దేశీయ ఐటీ కంపెనీలకు అమెరికా గుడ్‌న్యూస్ చెప్పింది. అన్ని రకాల హెచ్-1బీ వీసా పిటిషన్ల ప్రీమియం ప్రాసెసింగ్ పునఃప్రారంభిస్తున్నట్టు అమెరికా పౌరసత్వ వలసల సేవా సంస్థ (యూఎస్‌సీఐఎస్) మంగళవారం ప్రకటించింది. ఇటీవలే కొన్ని విభాగాల్లో హెచ్-1బీ వీసాల ప్రీమియం ప్రక్రియను పునఃప్రారంభించిన యూఎస్‌సీఐఎస్, ప్రస్తుతం అన్ని విభాగాలకు ఈ ప్రక్రియను పునరుద్ధరించింది. ఈ నిర్ణయం దేశీయ టెక్నాలజీ పరిశ్రమకు సానుకూలమని టెక్ వర్గాలు చెబుతున్నాయి. భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తిన నేపథ్యంలో గత ఏప్రిల్‌లో ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా ఈ వీసాల జారీని నిలిపివేసిన సంగతి తెలిసిందే.
పిటిషనర్, ఏజెన్సీ ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీసును కోరితే, యూఎస్‌సీఐఎస్ 15 రోజుల్లోగా వీసా మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటుందని, ఆ లోపు మంజూరు కాకపోతే ఏజెన్సీ పిటిషనర్ ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును వెనక్కి ఇచ్చేయనున్నట్టు పేర్కొంది. హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్‌కు ప్రీమియం ప్రాసెసింగ్ తత్కాల్ స్కీమ్ లాంటిదని, 15 రోజుల్లో అప్లికేషన్ ప్రక్రియ ముగుస్తుందని పేర్కొంది. దీనికి ఒక్కో అప్లికేషన్‌కు అయ్యే ఖర్చు 1,225 డాలర్లుగా యూఎస్‌సీఐఎస్ పేర్కొంది.
ప్రాజెక్టు వర్క్‌లపై దేశీయ ఐటీ వర్కర్లను అమెరికాను పంపించడానికి ఎక్కువగా వాడే వీసా కేటగిరీ హెచ్-1బీ వీసాలే. అంతర్జాతీయ ప్రత్యర్థుల నుంచి ప్రయోజనం పొందడానికి, తక్కువ ఖర్చుకు అమెరికాకు చెందిన క్లయింట్ లొకేషన్లకు దేశీయ ఐటీ ఉద్యోగులను కంపెనీలు పంపుతుంటాయి. యూఎస్‌సీఐఎస్ డేటా ప్రకారం 2007 నుంచి హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్‌పై ఎక్కువగా లాభపడేది భారతే. 2017లో హెచ్-1బీ వీసాల కోసం 2,47,927 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్ వంటి ప్రత్యేక వృత్తులకు హెచ్-1బీ వీసాలను అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment