అమెరికాలో ఇన్ఫోసిస్ ‘లోకల్’ రూట్
అధిక సంఖ్యలో స్థానికుల నియామకాలపై దృష్టి
వీసా నిబంధనల మార్పు నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు
న్యూఢిల్లీ: హెచ్1బీ వీసా నిబంధనల కఠినతరం నేపథ్యంలో ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ అమెరికాలో స్థానికులనే మరింత మందిని ఉద్యోగాల్లో నియమించుకోవడంపై దృష్టి సారించింది. అలాగే, అమెరికన్లకు శిక్షణ ఇచ్చేందుకు గాను కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉంది. సాధారణంగా విదేశీ మార్కెట్లలో స్థానికుల నియామకం వల్ల ఐటీ కంపెనీలకు వ్యయాలు పెరుగుతాయి. అయినప్పటికీ ట్రంప్ సర్కారు విదేశీ నిపుణుల వీసాలకు సంబంధించి నిబంధనలను కఠినతరం చేస్తున్న నేపథ్యంలో భారత ఐటీ కంపెనీలు స్థానికులను అధిక సంఖ్యలో నియమించుకునేలా తమ వ్యాపార నమూనాలను మార్చుకుంటున్నాయి. ‘‘వీసాల విషయంలో మొత్తం పరిస్థితులను పరిశీలిస్తున్నాం.
గత 24 నెలల కాలంలో అమెరికాలో మా ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడంతోపాటు మరింత మంది స్థానికులను నియమించుకోవడంపై దృష్టి పెట్టాం’’ అని ఇన్ఫోసిస్ సీఓఓ యూబీ ప్రవీణ్‌రావు ఇటీవల జరిగిన ఇన్వెస్టర్ల సదస్సులో పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తామని, స్థానికుల నియామకాలను వేగవంతం చేస్తామని చెప్పారు. అలాగే, అభివృద్ధి, శిక్షణా కేంద్రాలను సైతం నెలకొల్పనున్నట్టు తెలిపారు.
కఠినమైన వలస చట్టాలను తీసుకొచ్చి, స్థానికుల ఉద్యోగాలను రక్షిస్తానని ఎన్నికల సందర్భంగా ట్రంప్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత హెచ్1బీ వీసాల ఫీజులను భారీగా పెంచడంతోపాటు, అత్యధిక నైపుణ్యం గల వారికే ఈ వీసాలు పరిమితం అంటూ కొత్త ప్రతిపాదనలను తీసుకొచ్చారు. దీంతో భారత్ కంపెనీలు అక్కడ స్థానికులనే అధికంగా నియమించుకునే ప్రణాళికల్లో ఉన్నాయి.