న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో గురువారం మహిళా న్యాయమార్తులతో కూడిన ధర్మాసనం పిటిషన్లను విచారించనుంది. ఓ బెంచ్‌లో అందరూ మహిళా న్యాయమూర్తులే ఉండటం సుప్రీంకోర్టు చరిత్రలో ఇది మూడోసారి కావడం గమనార్హం. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బెలా ఎం త్రివేదిలతో కూడిన ఈ ధర్మాసనాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం ఏర్పాటు చేశారు.
సుప్రీంకోర్టులో తొలిసారి 2013లో మహిళా న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ ఆ బెంచ్‌లో ఉన్నారు. ఆ తర్వాత 2018 సెప్టెంబర్‌లో మహిళా న్యాయముర్తులు జస్టిస్ బానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం ఏర్పాటయ్యింది.
మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మూడోసారి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బెలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఏర్పాటయ్యింది. ఈ బెంచ్ గురువారం మొత్తం 32 పిటిషన్లను విచారించనుంది. అందులో 10 వివాహ వివాదాల బదిలీ పిటిషన్లు కాగా, 10 బెయిల్‌కు సంబంధించినవి.
సుప్రీంకోర్టులో ప్రస్తుతమున్న 27 మంది న్యాయమూర్తుల్లో ముగ్గురు మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. వారు.. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ త్రివేది. వీరిలో జస్టిస్ హిమా కోహ్లీ పదవీ కాలం 2024 సెప్టెంబర్‌లో ముగుస్తుంది. జస్టిస్ త్రివేది పదవీకాలం 2025 జూన్‌లో పూర్తవుతుంది. జస్టిస్ నాగరత్న 2027లో తొలి మహిళా సీజేఐగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించనున్నారు.
సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులకు గానూ ప్రస్తుతం 27 మందే ఉన్నారు. జస్టిస్ ఎ అబ్దుల్ నజార్ జనవరి 4న రిటైర్ అయ్యాక ఈ సంఖ్య 26కు తగ్గనుంది. దీంతో 8 ఖాళీలు ఉంటాయి. వచ్చే ఏడాది మరో ఏడుగురు న్యాయమూర్తులు కూడా రిటైర్ కానున్నారు.
చదవండి: రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న నటి
Comments
Please login to add a commentAdd a comment