Women judge
-
అమెరికాలో జడ్జిగా నియమితులైన తెలుగు మహిళ జయ బాడిగ
న్యూయార్క్: భారతీయ సంతతి అమెరికా పౌరురాలు, తెలుగుబిడ్డ జయ బాడిగ అక్కడి శాక్రామెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన జయ ఆ తర్వాత కుటుంబంతో అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే న్యాయ విద్య చదివి న్యాయవాద వృత్తి జీవితం మొదలెట్టారు. ఇటీవల జడ్జిగా ఎంపికైన జయను కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ శాక్రామెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా తాజాగా నియమించారు. ఇదే కోర్టులో గత రెండేళ్లుగా జయ కమిషనర్‌గా సేవలందిస్తుండటం విశేషం. డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలైన జయ 2020లో కాలిఫోరి్నయా ఆరోగ్య పరిరక్షణ సేవల విభాగంలో అటారీ్నగా పనిచేశారు. 2018లో కాలిఫోరి్నయా గవర్నర్ కార్యాలయంలో అత్యవసర సేవల విభాగంలో సేవలందించారు. శాంటాక్లారా విశ్వవిద్యాలయంలో లా చదివారు. బోస్టన్ విశ్వవిద్యాలయంలోని ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ విభాగంలో ఎంఏ చేశారు. కుటుంబ కేసులు, తగాదాలను పరిష్కరించడంలో జయ పది సంవత్సరాల అనుభవం గడించారు. -
మహిళా జడ్జీకి లైంగిక వేధింపులు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా జడ్జి తనను జిల్లా జడ్జి లైంగికంగా వేధిస్తున్నారని, అనుమతిస్తే గౌరవప్రదంగా చనిపోతానంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని సీజేఐ సీరియస్‌గా తీసుకున్నారు. ఆయన ఉత్తర్వుల మేరకు..సత్వరమే నివేదిక ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించారు. జిల్లాలోని బారాబంకీలో నియామకం అయిన ఏడాదిన్నర నుంచి తనపై కొనసాగుతున్న వేధింపులను బాధిత జడ్జి రెండు పేజీల లేఖలో ప్రస్తావించారు. ‘నాకు ఏమాత్రం జీవించాలని లేదు. ఏడాదిన్నర కాలంలో నన్ను జీవచ్ఛవంలా మార్చారు. నిర్జీవమైన ఈ శరీరాన్ని ఇంకా మోయడం వల్ల ప్రయోజనం లేదు. నా జీవితంలో ఎలాంటి లక్ష్యం లేదు. దయచేసి నా జీవితాన్ని గౌరవప్రదంగా ముగించుకునేందుకు అనుమతించండి’అని అందులో తెలిపారు. ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాధిత జడ్జి గతంలో పెట్టుకున్న పిటిషన్‌పై జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, బాధితురాలిపై వేధింపుల అంశం అంతర్గత ఫిర్యాదుల కమిటీ పరిశీలనలో ఉన్నదని, కమిటీ తీర్మానం అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నదంటూ ఆ ఫిర్యాదును ధర్మాసనం కొట్టివేసింది. తాజాగా, బాధితురాలి లేఖపై సీజేఐ ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుంచి నివేదిక కోరారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ నివేదికపై ఏమేరకు చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ ఆదేశించినట్లు సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. -
న్యాయ వృత్తిలో మహిళలు పెరగాలి: సీజేఐ
మదురై: న్యాయ వృత్తిని చేపడుతున్న పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉందంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ మరోసారి తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ‘‘నైపుణ్యమున్న మహిళా లాయర్లకు మన దేశం కొదవేమీ లేదు. అయినా పురుషులతో పోలిస్తే వారి సంఖ్య ఎప్పుడూ చాలా తక్కువే. మహిళలు ఇంటిపని తదితరాల కారణంగా వృత్తికి న్యాయం చేయలేరేమోనని లా చాంబర్లు భావిస్తుండటం వంటివి ఇందుకు కారణాలు’’ అన్నారు. ‘‘పిల్లల్ని కనడం, వారి సంరక్షణ తదితరాల వల్ల మహిళలకు వృత్తిపరంగా శిక్ష పడకూడదు. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి వారికి వ్యక్తిగతంగానే గాక వ్యవస్థాగతంగా కూడా చేయూతనివ్వాలి. కోర్టు సముదాయాల్లో క్రెష్ సదుపాయం దిశగా సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు తీసుకున్న చర్యల వంటివి దేశవ్యాప్తం కావాలి’’ అని అభిప్రాయపడ్డారు. శనివారం మదురైలో జిల్లా కోర్టుల సముదాయం తదితరాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయ వృత్తి మహిళలకు సమానావకాశాలు కల్పించడం లేదన్నారు. తమిళనాడులో న్యాయవాదులుగా నమోదు చేసుకుంటున్న పురుషుల సంఖ్య 50 వేల దాకా ఉంటే మహిళలు ఐదు వేలకు మించడం లేదంటూ ఉదాహరించారు. ‘‘ఇటీవల పరిస్థితి మారుతుండటం శుభసూచకం. జిల్లా స్థాయి న్యాయ నియామకాల్లో 50 శాతానికి పైగా మహిళలే చోటుచేసుకున్నారు. ఈ ధోరణి మరింత పెరగాలి’’ అని సీజేఐ ఆకాంక్షించారు. జూనియర్ లాయర్లకు నెలకు కేవలం రూ.5,000–12,000 వేతనం సరికాదన్నారు. ఘర్షణ లేదు: రిజిజు ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య ఉన్నది అభిప్రాయ భేదాలేనని తప్ప ఘర్షణ కాదని కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు చెప్పారు. ‘‘మా మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు గొడవలేమీ కాదు. అవి సంక్షోభం కాదు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సూచిక. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించేందుకు కేంద్రం ఎప్పుడూ సహకరిస్తుంది’’ అని చెప్పారు. చెన్నై, ముంబై, కోల్‌కతా నగరాల్లో సుప్రీంకోర్టు బెంచిలు ఏర్పాటు చేయాలని తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ సీజేఐని కోరారు. -
సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులతో బెంచ్.. చరిత్రలో మూడోసారి..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో గురువారం మహిళా న్యాయమార్తులతో కూడిన ధర్మాసనం పిటిషన్లను విచారించనుంది. ఓ బెంచ్‌లో అందరూ మహిళా న్యాయమూర్తులే ఉండటం సుప్రీంకోర్టు చరిత్రలో ఇది మూడోసారి కావడం గమనార్హం. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బెలా ఎం త్రివేదిలతో కూడిన ఈ ధర్మాసనాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టులో తొలిసారి 2013లో మహిళా న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ ఆ బెంచ్‌లో ఉన్నారు. ఆ తర్వాత 2018 సెప్టెంబర్‌లో మహిళా న్యాయముర్తులు జస్టిస్ బానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం ఏర్పాటయ్యింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మూడోసారి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బెలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఏర్పాటయ్యింది. ఈ బెంచ్ గురువారం మొత్తం 32 పిటిషన్లను విచారించనుంది. అందులో 10 వివాహ వివాదాల బదిలీ పిటిషన్లు కాగా, 10 బెయిల్‌కు సంబంధించినవి. సుప్రీంకోర్టులో ప్రస్తుతమున్న 27 మంది న్యాయమూర్తుల్లో ముగ్గురు మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. వారు.. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ త్రివేది. వీరిలో జస్టిస్ హిమా కోహ్లీ పదవీ కాలం 2024 సెప్టెంబర్‌లో ముగుస్తుంది. జస్టిస్ త్రివేది పదవీకాలం 2025 జూన్‌లో పూర్తవుతుంది. జస్టిస్ నాగరత్న 2027లో తొలి మహిళా సీజేఐగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించనున్నారు. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులకు గానూ ప్రస్తుతం 27 మందే ఉన్నారు. జస్టిస్ ఎ అబ్దుల్ నజార్ జనవరి 4న రిటైర్ అయ్యాక ఈ సంఖ్య 26కు తగ్గనుంది. దీంతో 8 ఖాళీలు ఉంటాయి. వచ్చే ఏడాది మరో ఏడుగురు న్యాయమూర్తులు కూడా రిటైర్ కానున్నారు. చదవండి: రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న నటి -
ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం పెంచాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీత చెప్పారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేవలం 9 శాతం అంటే నలుగురు, హైకోర్టుల్లో 11 శాతం అంటే 81 మంది మహిళా న్యాయమూర్తులే ఉన్నారని తెలిపారు. జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు న్యాయవ్యవస్థలోనూ సమాన ప్రాతినిధ్యం కల్పించాలని ఆమె కేంద్రాన్ని కోరారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (జీతాలు, సేవా నిబంధనలు) సవరణ బిల్లుపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. న్యాయవ్యవస్థలో 1950 నుంచి 1990 వరకు ఎస్సీ, ఎస్టీ న్యాయమూర్తుల సంఖ్య 10 శాతం దాటలేదన్నారు. సుప్రీంకోర్టు ఏర్పడిన నాటినుంచి కేవలం ఐదుగురు ఎస్సీలు, ఒక్క ఎస్టీ న్యాయమూర్తి మాత్రమే ఉన్నారని చెప్పారు. హైకోర్టుల్లోనూ 850 మందికిగాను కేవలం 24 మంది మాత్రమే ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయన్నారు. సరైన రిజర్వేషన్ విధానం ద్వారా అందరికీ సమన్యాయం జరిగేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ‘న్యాయవ్యవస్థ నియామకాలపై కొందరిదే గుత్తాధిపత్యం నడుస్తోంది. హైకోర్టు న్యాయమూర్తుల్లో 50 శాతం, సుప్రీంకోర్టులో 33 శాతం న్యాయమూర్తులు న్యాయవ్యవస్థలోని ఉన్నత స్థాయిల్లోని వారి కుటుంబ సభ్యులని సూచించే నివేదికలున్నాయి. ఈ దృష్ట్యా కొలీజియం వ్యవస్థను నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ వంటి వ్యవస్థతో భర్తీచేయాల్సిన అవసరం ఉంది. దీనిద్వారా న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో మరింత పారదర్శకత వస్తుంది. దీంతోపాటే దేశం నలుమూలలా నాలుగు సుప్రీంకోర్టు శాశ్వత ప్రాంతీయ బెంచ్‌లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి..’ అని ఆమె పేర్కొన్నారు. -
భారత ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళను చూడగలమా?
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళ నియామకమయ్యే రోజు ఎంతో దూరం లేదంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే చేసిన వ్యాఖ్యలతో కోర్టుల్లో మహిళా న్యాయమూర్తుల ప్రాతినిధ్యంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 29 మంది న్యాయమూర్తులుంటే వారిలో కేవలం ఒక్కరంటే ఒక్కరే మహిళా న్యాయమూర్తి. ఆమే జస్టిస్ ఇందిరా బెనర్జీ. మూడేళ్ల క్రితం 2018లో జస్టిస్ ఇందిరా బెనర్జీ సుప్రీంలో అడుగు పెట్టినప్పుడు ఒకే సమయంలో ముగ్గురు మహిళా న్యాయమూర్తుల్ని అత్యున్నత న్యాయస్థానంలో చూడగలిగాము. అప్పటికే జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందూ మల్హోత్రాలు న్యాయమూర్తులుగా ఉన్నారు. దీంతో వీరి ముగ్గురిని త్రిమూర్తులుగా అభివర్ణించేవారు. అప్పట్లో న్యాయవ్యవస్థలో మహిళా వివక్ష నశిస్తుందనే ఆశలు చిగురించాయి.. ఆ తర్వాత భానుమతి, ఇందూ మల్హోత్రాలు పదవీ విరమణ చేయడంతో మళ్లీ జస్టిస్ ఇందిర ఒక్కరే మిగిలారు. జస్టిస్ ఇందిరకు సీజేఐగా ఛాన్స్ వస్తుందా భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) ఈ నెల 24 ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం 26, ఆగస్టు, 2022తో ముగియనుంది. సీనియార్టీ ప్రకారం చూస్తే రమణ తర్వాత పదో స్థానంలో ఇందిర ఉన్నారు. ఆమె సెప్టెంబర్ 23, 2022న పదవీ విరమణ చేస్తారు. ఎన్వీ రమణ తర్వాత జస్టిస్ ఆర్.ఎఫ్ నారిమన్ సీనియార్టీ జాబితాలో ఉన్నారు. అయితే నారిమన్ ఈ ఏడాది ఆగస్టులోనే పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత స్థానంలో ఉన్న జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్‌కు 2022 సంవత్సరం నవంబర్ 8 వరకు పదవీ కాలం ఉంది. అందువల్ల రమణ తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం జస్టిస్ లలిత్‌కు వస్తుంది. అందుకే ఇందిరకు భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉండదు. ఇకమీదట ఎవరైనా మహిళా న్యాయమూర్తి సుప్రీంకోర్టులో నియమితులైతే... ఆమె అందరికంటే జూనియర్‌గా ప్రస్థానం (పురుషులకైనా అంతే) మొదలుపెడతారు. రిటైర్మెంట్ వయసుకు ముందే సీనియారిటీ జాబితాలో రెండోస్థానానికి చేరినపుడు మాత్రమే తదుపరి సీజేగా అవకాశం వస్తుంది. ఇది ఎప్పటికి జరిగేనో? ఇక సుప్రీంకోర్టుకు న్యాయమూర్తుల పదవుల ఖాళీలను భర్తీ చేయడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఎనిమిది మందే.. స్వతంత్ర భారతావనిలో అత్యున్నత న్యాయస్థానం ఏర్పడిన తర్వాత ఒక మహిళ తీర్పులు వెలువరించడానికి దాదాపుగా 40 ఏళ్ల కాలం పట్టింది. 1950, జనవరి 26న సుప్రీంకోర్టు ఏర్పాటైతే ఆ తర్వాత 1989లో భారత దేశ మొట్టమొదటి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఫాతిమా బీవి నియమితులయ్యారు. ఇప్పటివరకు సుప్రీం కోర్టులో 247 మందిని జడ్జీలుగా నియమిస్తే వారిలో ఎనిమిది మాత్రమే మహిళలు. జస్టిస్ ఫాతిమా బీవీ తర్వాత . జస్టిస్ సుజాత మనోహర్, జస్టిస్ రుమాపాల్, జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్, జస్టిస్ భానుమతి, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలకు మాత్రమే అత్యున్నత న్యాయస్థానంలో తీర్పులు చెప్పే అవకాశం వచ్చింది. హైకోర్టుల్లో న్యాయమూర్తుల్ని నియమించే అత్యున్నత అధికారాలు కలిగిన కొలీజియమ్‌లో సభ్యులుగా జస్టిస్ రుమాపాల్, జస్టిస్ ఆర్ భానుమతిలకు మాత్రమే భాగస్వామ్యులయ్యారు. ఏమిటి పరిష్కారం న్యాయవ్యవస్థలో వివక్ష రూపు మాపాలంటే అన్ని స్థాయిల్లో మహిళల నియామకం పెద్ద సంఖ్యలో జరగాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అడ్వకేట్లగా ఉన్న మహిళలు న్యాయమూర్తులుగా పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ముందుకు రావాలనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ తాము తీర్పుల్ని వెల్లడించే అతి పెద్ద న్యాయమూర్తి బాధ్యతను చేపట్టలేమని ఆ అవకాశాన్ని మహిళా అడ్వకేట్లు తిరస్కరిస్తున్నారని సాక్షాత్తూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులే చెబుతున్నారు. మహిళా సాధికారత కోసం ఎన్నో చట్టాలు ఉన్నట్టుగానే మహిళా న్యాయమూర్తుల నియామకం అంశంలో కొన్ని విధివిధానాలను రూపొందిస్తూ చట్టాలు చెయ్యాలని బోంబే హైకోర్టు అడ్వకేట్ ప్రాస్పర్ డీ సౌజా సూచించారు. న్యాయమూర్తుల్ని నియమించే విశేష అధికారాలు కలిగిన సుప్రీం కోర్టు, హైకోర్టు కొలీజియంలలో మహిళా భాగస్వామ్యం పెరగడం వల్ల కూడా మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు తొలి మహిళా సీజే తెలంగాణకు 2021 కొత్త సంవత్సరం కానుకగా ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. జనవరి 1న ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కొహ్లీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక గువాహటి, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, జార్ఖండ్, రాజస్థాన్, సిక్కిం రాష్ట్రాల్లో ఒక్కో మహిళా న్యాయమూర్తి ఉన్నారు. మణిపూర్, మేఘాలయా, పాట్నా, త్రిపుర, ఉత్తరాఖండ్ హైకోర్లుల్లో మహిళా న్యాయమూర్తులెవరూ లేరు. -
మహిళా జడ్జి పుష్పకు సుప్రీంకోర్టు షాక్
న్యూఢిల్లీ: అత్యాచార కేసుల్లో వరసగా వివాదాస్పద తీర్పులు ఇస్తున్న బొంబాయి హైకోర్టు నాగపూర్ బెంచ్ మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గణేడివాలాకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. బొంబాయి హైకోర్టు శాశ్వత జడ్జిగా ఆమెను నియమించాలని గతంలో సిఫారసు చేసిన సుప్రీం కొలిజీయం శనివారం దానిని వెనక్కి తీసుకుంది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం కింద జస్టిస్ పుష్ప ఇటీవల ఇచ్చిన తీర్పులు వివాదాస్పదమయ్యాయి. ఆ తీర్పుల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అందుకే శాశ్వత జడ్జిగా నియామకం సిఫారసుల్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టుగా సుప్రీం వర్గాలు వెల్లడించాయి. పన్నెండేళ్ల బాలికపై లైంగిక దాడికి దిగితే శరీరంతో నేరుగా శరీరాన్ని (స్కిన్ టు స్కిన్) తాకకపోతే పోక్సో చట్టం కింద నేరం కాదంటూ కేసు నుంచి నిందితుడిని విముక్తుడిని చేశారు. మరో కేసులో బాధితురాలి చేతులు గట్టిగా పట్టుకొని, ప్యాంటు జిప్ తీయడం లైంగిక దాడికాదని కేసు కొట్టేశారు. మరో రెండు కేసుల్లో బాధితురాలు ప్రతిఘటిస్తే ఆమెను వివస్త్రని చేయడం సాధ్యం కాదని, బాధితురాలి సాక్ష్యాన్ని పరిగణించడం కుదరదంటూ వరసగా వివాదాస్పద తీర్పులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఆధ్వర్యంలో సుప్రీం కొలీజియం జనవరి 20న సమావేశమై పుష్పను శాశ్వత న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేసింది. కేవలం నెలరోజుల వ్యవధిలో ఆమె తీర్పులు వివాదాస్పదం కావడంతో సుప్రీం కొలీజియం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. -
మహిళా జడ్జీకి లాయర్ల బెదిరింపు
తిరువనంతపురం: కొందరు లాయర్లు తనను బెదిరించారంటూ ఓ మహిళా జడ్జీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 12 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఓ నిందితుడి బెయిల్ రద్దు విషయమై మాట్లాడేందుకు తన చాంబర్‌కు వచ్చిన లాయర్లు చట్టవిరుద్ధంగా ప్రవర్తించారంటూ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ దీపా మోహన్ లిఖిత పూర్వకంగా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆ ఫిర్యాదును పోలీసులకు పంపారు. దీనిపై స్పందించిన పోలీసులు తిరువనంతపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌తోపాటు 12 మందిపై దాడి, ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం వంటి నేరాల కింద పలు కేసులు పెట్టారు. ‘ఒక నిందితుడి బెయిల్ రద్దు, రిమాండ్‌పై చర్చించేందుకు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేపీ జయచంద్రన్ మరికొందరితో కలిసి నా బాంబర్‌కు వచ్చారు. సదరు నిందితుడి రిమాండ్ ఉత్తర్వులు రద్దు చేస్తారా లేదా అంటూ బెదిరించారు. మహిళ కాకపోయుంటే మిమ్మల్ని కొట్టి ఉండేవాళ్లం. బయటికి వస్తే అంతుచూస్తామంటూ జయచంద్రన్ వెళ్లిపోయారు’అని బాధిత జడ్జీ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర జ్యుడీషియల్ అధికారుల సంఘం కేరళ హైకోర్టులో పిటిషన్ వేసింది. కాగా, మహిళా జడ్జీ ఆరోపణలన్నీ అబద్ధాలేనంటూ తిరువనంతపురం బార్ అసోసియేషన్ శుక్రవారం విధులు బహిష్కరించింది. -
వైరల్: జడ్జికి కంటెస్టెంట్ ముద్దు
ముంబయి : సోనీ చానెల్ నిర్వహిస్తోన్న రియాల్టీ షోలో కంటెస్టెంట్ మహిళా జడ్జికి ముద్దుపెట్టి అక్కడున్నవారందరినీ షాక్‌కు గురి చేశాడు. ఊహించని ఘటనతో సదరు మహిళా జడ్జి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. కాగా ఇదంతా సోనీ నిర్వహిస్తోన్న 'ఇండియన్ ఐడల్ 11' లో చోటుచేసుకుంది. అయితే దీనిని సోనీ టీవీ ప్రోమో రూపంలో రిలీజ్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే .. ఇండియన్ ఐడల్ 11 కార్యక్రమానికి ప్రముఖ గాయకులు అను మాలిక్, విశాల్ దడ్లానిలతో పాటు నేహా కక్కర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కంటెస్టెంట్ గుజరాతీ వేషదారణలో పలు బహుమతులతో స్టేజీ మీదకు వచ్చినట్లు ప్రోమోలో తెలుస్తుంది. పాట పాడిన అనంతరం తనను గుర్తుపట్టారా అంటూ నేహాకక్కర్‌ను అడిగాడు. దీంతో స్టేజీ మీదకు వెళ్లిన నేహా అతను ఇచ్చిన బహుమతులను తీసుకొని కృతజ్ఞతగా అతన్ని హగ్ చేసుకుంది. ఈ నేపథ్యంలో అతను అందరూ చూస్తుండగానే నేహా బుగ్గమీద ముద్దుపెట్టాడు. దీంతో షో వాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆదిత్య నారాయణ అతన్ని అడ్డుకొని అక్కడి నుంచి పంపించేశాడు. ఈ ఉహించని పరిణామంతో షాక్‌కు గురైన నేహాకక్కర్ కార్యక్రమం మద్యలోనే వెళ్లిపోయినట్లు ప్రోమోలో చూపించారు. కాగా, ఈ ఎపిసోడ్ ఆదివారం సోనీలో టెలికాస్ట్ అవనుంది. -
నిష్పాక్షిక విచారణ జరగాలి
మహిళా జడ్జి ఆరోపణలపై కేంద్ర మంత్రి రవిశంకర్ న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళా జడ్జి చేసిన ఆరోపణలపై నిష్పాక్షికమైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ.. ఇది చాలా విచారించదగ్గ, దురదృష్టకరమైన ఘటన అని అభివర్ణించారు. ఇది చాలా సున్నితమైన అంశమైనందున, భారత ప్రధాన న్యాయమూర్తి దీనిపై దృష్టిసారించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై నిష్పాక్షికమైన రీతిలో విచారణ జరపాలని ఓ భారత పౌరుడిగా కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ కేసులో ఆరోపణలు రుజువైతే భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని న్యాయవ్యవస్థ తగిన చర్యలు తీసుకుంటుందని రవిశంకర్ ప్రసాద్ స్పష్టంచేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టులోని గ్వాలియర్ బెంచ్ న్యాయమూర్తి తనను లైంగికంగా వేధించారని, అందుకే తన పదవికి రాజీనామా చేశానని అదనపు జిల్లా, సెషన్స్ మహిళా న్యాయమూర్తి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె భారత ప్రధాన న్యాయమూర్తికి తొమ్మిది పేజీల లేఖ రాశారు. అయితే, ఆమె ఆరోపణలను సదరు హైకోర్టు న్యాయమూర్తి ఖండించారు. ఆ ఆరోపణలు నిజమని తేలితే మరణశిక్షకైనా సిద్ధమేనన్నారు. ఖండించండి..: బీజేపీ ఎంపీ మీనాక్షి మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళా జడ్జి చేసిన ఆరోపణలు మంగళవారం లోక్‌సభలో ప్రస్తావనకు వచ్చాయి. ఈ అంశాన్ని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి ప్రస్తావించారు. ఈ ఘటన చాలా దిగ్భ్రాంతికరమని, పవిత్రమైన న్యాయవ్యవస్థలోనూ మహిళలకు రక్షణ లేదనడానికి ఇది నిదర్శనమన్నారు. ఇలాంటి ఘటనల వల్ల మహిళల జీవించే హక్కుకు విఘాతం కలుగుతోందన్నారు. దీనిని సభతోపాటు న్యాయవ్యవస్థ కూడా ఖండించాలని విజ్ఞప్తి చేశారు.