సాక్షి, న్యూఢిల్లీ: ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగా గీత చెప్పారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేవలం 9 శాతం అంటే నలుగురు, హైకోర్టుల్లో 11 శాతం అంటే 81 మంది మహిళా న్యాయమూర్తులే ఉన్నారని తెలిపారు. జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు న్యాయవ్యవస్థలోనూ సమాన ప్రాతినిధ్యం కల్పించాలని ఆమె కేంద్రాన్ని కోరారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (జీతాలు, సేవా నిబంధనలు) సవరణ బిల్లుపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు.
న్యాయవ్యవస్థలో 1950 నుంచి 1990 వరకు ఎస్సీ, ఎస్టీ న్యాయమూర్తుల సంఖ్య 10 శాతం దాటలేదన్నారు. సుప్రీంకోర్టు ఏర్పడిన నాటినుంచి కేవలం ఐదుగురు ఎస్సీలు, ఒక్క ఎస్టీ న్యాయమూర్తి మాత్రమే ఉన్నారని చెప్పారు. హైకోర్టుల్లోనూ 850 మందికిగాను కేవలం 24 మంది మాత్రమే ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయన్నారు. సరైన రిజర్వేషన్ విధానం ద్వారా అందరికీ సమన్యాయం జరిగేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ‘న్యాయవ్యవస్థ నియామకాలపై కొందరిదే గుత్తాధిపత్యం నడుస్తోంది. హైకోర్టు న్యాయమూర్తుల్లో 50 శాతం, సుప్రీంకోర్టులో 33 శాతం న్యాయమూర్తులు న్యాయవ్యవస్థలోని ఉన్నత స్థాయిల్లోని వారి కుటుంబ సభ్యులని సూచించే నివేదికలున్నాయి.
ఈ దృష్ట్యా కొలీజియం వ్యవస్థను నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ వంటి వ్యవస్థతో భర్తీచేయాల్సిన అవసరం ఉంది. దీనిద్వారా న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో మరింత పారదర్శకత వస్తుంది. దీంతోపాటే దేశం నలుమూలలా నాలుగు సుప్రీంకోర్టు శాశ్వత ప్రాంతీయ బెంచ్‌లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి..’ అని ఆమె పేర్కొన్నారు.
ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం పెంచాలి
Published Wed, Dec 8 2021 5:02 AM | Last Updated on Wed, Dec 8 2021 5:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment