న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళ నియామకమయ్యే రోజు ఎంతో దూరం లేదంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే చేసిన వ్యాఖ్యలతో కోర్టుల్లో మహిళా న్యాయమూర్తుల ప్రాతినిధ్యంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 29 మంది న్యాయమూర్తులుంటే వారిలో కేవలం ఒక్కరంటే ఒక్కరే మహిళా న్యాయమూర్తి. ఆమే జస్టిస్ ఇందిరా బెనర్జీ. మూడేళ్ల క్రితం 2018లో జస్టిస్ ఇందిరా బెనర్జీ సుప్రీంలో అడుగు పెట్టినప్పుడు ఒకే సమయంలో ముగ్గురు మహిళా న్యాయమూర్తుల్ని అత్యున్నత న్యాయస్థానంలో చూడగలిగాము.
అప్పటికే జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందూ మల్హోత్రాలు న్యాయమూర్తులుగా ఉన్నారు. దీంతో వీరి ముగ్గురిని త్రిమూర్తులుగా అభివర్ణించేవారు. అప్పట్లో న్యాయవ్యవస్థలో మహిళా వివక్ష నశిస్తుందనే ఆశలు చిగురించాయి.. ఆ తర్వాత భానుమతి, ఇందూ మల్హోత్రాలు పదవీ విరమణ చేయడంతో మళ్లీ జస్టిస్ ఇందిర ఒక్కరే మిగిలారు.
జస్టిస్ ఇందిరకు సీజేఐగా ఛాన్స్ వస్తుందా
భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) ఈ నెల 24 ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ ఎన్‌వీ రమణ పదవీ కాలం 26, ఆగస్టు, 2022తో ముగియనుంది. సీనియార్టీ ప్రకారం చూస్తే రమణ తర్వాత పదో స్థానంలో ఇందిర ఉన్నారు. ఆమె సెప్టెంబర్ 23, 2022న పదవీ విరమణ చేస్తారు. ఎన్‌వీ రమణ తర్వాత జస్టిస్ ఆర్.ఎఫ్ నారిమన్ సీనియార్టీ జాబితాలో ఉన్నారు. అయితే నారిమన్ ఈ ఏడాది ఆగస్టులోనే పదవీ విరమణ చేయనున్నారు.
ఆ తర్వాత స్థానంలో ఉన్న జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్‌కు 2022 సంవత్సరం నవంబర్ 8 వరకు పదవీ కాలం ఉంది. అందువల్ల రమణ తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం జస్టిస్ లలిత్‌కు వస్తుంది. అందుకే ఇందిరకు భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉండదు. ఇకమీదట ఎవరైనా మహిళా న్యాయమూర్తి సుప్రీంకోర్టులో నియమితులైతే... ఆమె అందరికంటే జూనియర్‌గా ప్రస్థానం (పురుషులకైనా అంతే) మొదలుపెడతారు. రిటైర్‌మెంట్ వయసుకు ముందే సీనియారిటీ జాబితాలో రెండోస్థానానికి చేరినపుడు మాత్రమే తదుపరి సీజేగా అవకాశం వస్తుంది. ఇది ఎప్పటికి జరిగేనో? ఇక సుప్రీంకోర్టుకు న్యాయమూర్తుల పదవుల ఖాళీలను భర్తీ చేయడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది.
ఎనిమిది మందే..
స్వతంత్ర భారతావనిలో అత్యున్నత న్యాయస్థానం ఏర్పడిన తర్వాత ఒక మహిళ తీర్పులు వెలువరించడానికి దాదాపుగా 40 ఏళ్ల కాలం పట్టింది. 1950, జనవరి 26న సుప్రీంకోర్టు ఏర్పాటైతే ఆ తర్వాత 1989లో భారత దేశ మొట్టమొదటి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఫాతిమా బీవి నియమితులయ్యారు. ఇప్పటివరకు సుప్రీం కోర్టులో 247 మందిని జడ్జీలుగా నియమిస్తే వారిలో ఎనిమిది మాత్రమే మహిళలు. జస్టిస్ ఫాతిమా బీవీ తర్వాత .
జస్టిస్ సుజాత మనోహర్, జస్టిస్ రుమాపాల్, జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్, జస్టిస్ భానుమతి, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలకు మాత్రమే అత్యున్నత న్యాయస్థానంలో తీర్పులు చెప్పే అవకాశం వచ్చింది. హైకోర్టుల్లో న్యాయమూర్తుల్ని నియమించే అత్యున్నత అధికారాలు కలిగిన కొలీజియమ్‌లో సభ్యులుగా జస్టిస్ రుమాపాల్, జస్టిస్ ఆర్ భానుమతిలకు మాత్రమే భాగస్వామ్యులయ్యారు.
ఏమిటి పరిష్కారం
న్యాయవ్యవస్థలో వివక్ష రూపు మాపాలంటే అన్ని స్థాయిల్లో మహిళల నియామకం పెద్ద సంఖ్యలో జరగాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అడ్వకేట్లగా ఉన్న మహిళలు న్యాయమూర్తులుగా పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ముందుకు రావాలనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ తాము తీర్పుల్ని వెల్లడించే అతి పెద్ద న్యాయమూర్తి బాధ్యతను చేపట్టలేమని ఆ అవకాశాన్ని మహిళా అడ్వకేట్లు తిరస్కరిస్తున్నారని సాక్షాత్తూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులే చెబుతున్నారు.
మహిళా సాధికారత కోసం ఎన్నో చట్టాలు ఉన్నట్టుగానే మహిళా న్యాయమూర్తుల నియామకం అంశంలో కొన్ని విధివిధానాలను రూపొందిస్తూ చట్టాలు చెయ్యాలని బోంబే హైకోర్టు అడ్వకేట్ ప్రాస్పర్ డీ సౌజా సూచించారు. న్యాయమూర్తుల్ని నియమించే విశేష అధికారాలు కలిగిన సుప్రీం కోర్టు, హైకోర్టు కొలీజియంలలో మహిళా భాగస్వామ్యం పెరగడం వల్ల కూడా మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణకు తొలి మహిళా సీజే
తెలంగాణకు 2021 కొత్త సంవత్సరం కానుకగా ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. జనవరి 1న ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కొహ్లీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక గువాహటి, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, జార్ఖండ్, రాజస్థాన్, సిక్కిం రాష్ట్రాల్లో ఒక్కో మహిళా న్యాయమూర్తి ఉన్నారు. మణిపూర్, మేఘాలయా, పాట్నా, త్రిపుర, ఉత్తరాఖండ్ హైకోర్లుల్లో మహిళా న్యాయమూర్తులెవరూ లేరు.
Comments
Please login to add a commentAdd a comment