న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబరు 17న పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన స్థానంలో నూతన సీజేఐగా జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే పేరును ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు ఆయన లేఖ రాశారు. నియామకానికి సంబంధించిన పత్రాలు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో నవంబరు 18న జస్టిస్ బోబ్డే ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా కొలీజియం సిఫార్సుల మేరకు సుప్రీంకోర్టు జడ్జీల నియామకం జరుగుతుందన్న విషయం తెలిసిందే. సీనియారిటీ ప్రకారం జడ్జీల నియామకం జరిపే సంప్రదాయం కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం ఉన్న అత్యున్నత న్యాయస్థానం జడ్జీల్లో రంజన్ గొగోయ్ తర్వాత శరద్ అరవింద్ సీనియర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియామకం లాంఛనప్రాయమే కానుంది.
కాగా 1956 ఏప్రిల్24న మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన న్యాయవాద కుటుంబంలో బోబ్డే జన్మించారు. నాగ్‌పూర్ యూనివర్సిటీకి చెందిన ఎస్‌ఎఫ్‌ఎస్ కాలేజీలో న్యాయ విద్యనభ్యసించిన ఆయన.. 1978లో అడ్వకేట్‌గా తనపేరు నమోదు చేసుకున్నారు. బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచీలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడంతో పాటుగా... మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ బోబ్డే.. రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసును విచారిస్తున్న ఐదుగురు జడ్జీల ధర్మాసనంలో ఒకరుగా ఉన్నారు. ఇక జస్టిస్ శరద్ అరవింద్ తండ్రి అరవింద్ బోబ్డే 1980-85 మధ్య కాలంలో మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు. శరద్ అరవింద్ అన్న వినోద్ బాబ్డే కూడా పేరు మోసిన లాయర్(సుప్రీంకోర్టు)గా గుర్తింపు తెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment