జస్టిస్ పుష్ప గణేడివాలా
న్యూఢిల్లీ: అత్యాచార కేసుల్లో వరసగా వివాదాస్పద తీర్పులు ఇస్తున్న బొంబాయి హైకోర్టు నాగపూర్ బెంచ్ మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గణేడివాలాకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. బొంబాయి హైకోర్టు శాశ్వత జడ్జిగా ఆమెను నియమించాలని గతంలో సిఫారసు చేసిన సుప్రీం కొలిజీయం శనివారం దానిని వెనక్కి తీసుకుంది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం కింద జస్టిస్ పుష్ప ఇటీవల ఇచ్చిన తీర్పులు వివాదాస్పదమయ్యాయి. ఆ తీర్పుల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అందుకే శాశ్వత జడ్జిగా నియామకం సిఫారసుల్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టుగా సుప్రీం వర్గాలు వెల్లడించాయి.
పన్నెండేళ్ల బాలికపై లైంగిక దాడికి దిగితే శరీరంతో నేరుగా శరీరాన్ని (స్కిన్ టు స్కిన్) తాకకపోతే పోక్సో చట్టం కింద నేరం కాదంటూ కేసు నుంచి నిందితుడిని విముక్తుడిని చేశారు. మరో కేసులో బాధితురాలి చేతులు గట్టిగా పట్టుకొని, ప్యాంటు జిప్ తీయడం లైంగిక దాడికాదని కేసు కొట్టేశారు. మరో రెండు కేసుల్లో బాధితురాలు ప్రతిఘటిస్తే ఆమెను వివస్త్రని చేయడం సాధ్యం కాదని, బాధితురాలి సాక్ష్యాన్ని పరిగణించడం కుదరదంటూ వరసగా వివాదాస్పద తీర్పులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే ఆధ్వర్యంలో సుప్రీం కొలీజియం జనవరి 20న సమావేశమై పుష్పను శాశ్వత న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేసింది. కేవలం నెలరోజుల వ్యవధిలో ఆమె తీర్పులు వివాదాస్పదం కావడంతో సుప్రీం కొలీజియం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment