సాక్షి, ముంబై : వస్త్రాల మీద నుంచి బాలిక ఛాతిభాగంలో తాకడం నేరం కాదంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు తీవ్ర వివాదాస్పదమవుతోన్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముంబై హైకోర్టు నాగపూర్ బెంచ్ జస్టిస్ పుష్ప గనేడివాలా ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని శివసేన నేతృత్వంలోని మహావికాష్ అఘాడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి సీతారం కుంటే శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేదు గనుక పోక్సో చట్టం కింద దానిని లైంగికదాడిగా పరిగణించలేమంటూ జస్టిస్ పుష్ఫ ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేస్తున్నామన్నారు. దీనిపై ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. (వివాదాస్పద తీర్పు: కొలీజియం కీలక నిర్ణయం)
బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిందిగా హైకోర్టులో పలువురు సీనియర్ న్యాయవాదులు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పోక్సో ( లైంగిక పరమైన దాడుల నుంచి చిన్నారుల రక్షణ) చట్టాన్ని నీరుగార్చే విధంగా ఉందని, దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. న్యాయవాదుల లేఖపై స్పందించిన సీఎం ఉద్ధవ్ న్యాయనిపుణులతో చర్చించి స్పెషల్‌లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. (బాలిక ఛాతిపై తాకడం నేరంకాదు : హైకోర్టు)
బాంబే హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించిన విషయం తెలిసిందే. నాగపూర్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై దేశ వ్యాప్తంగా నిరసన స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత బుధవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వివాదాస్పదంగా మారిన అంశంపై తుది విచారణ ముగిసే వరకు స్టే విధిస్తున్నట్లు తెలిపారు. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆందోళనకరంగా ఉందని, దీనిపై మరోసారి సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని కేకే వేణుగోపాల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.
Comments
Please login to add a commentAdd a comment