న్యూఢిల్లీ/ముంబై: ‘పోక్సో’ (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్) చట్టం గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు జస్టిస్ పుష్ప గనేడివాలా. శరీరాన్ని శరీరం తాకలేదు గనుక నేరంగా పరిగణించలేమనడం సహా.. ఐదేళ్ల బాలిక చేతులు కట్టేసి పట్టుకుని, ప్యాంటు జిప్ తెరచినా ఈ చట్టం కింద అదేమీ నేరం కాదని ఆమె ఇచ్చిన తీర్పుపై భిన్నవాదనలు కొనసాగుతున్నాయి. ఈ రెండు కేసుల్లోనూ పోక్సో చట్టం నుంచి నిందితులకు విముక్తి కలిగించిన తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. జనవరి 15, జనవరి 19 నాటి తీర్పులతో సోషల్ మీడియాలో ఆమె గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నాగ్‌పూర్ బెంచ్ జడ్జి జస్టిస్ పుష్ప గనేడివాలా నేపథ్యం, ఆమె కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు గమనిద్దాం.(చదవండి: జిప్ తెరచి ఉంచినంత మాత్రాన.. జడ్జి సంచలన వ్యాఖ్యలు)
►మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో గల పరాఠ్వాడాలో 1969లో జస్టిస్ పుష్ప జన్మించారు. బీకాం, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పట్టా పుచ్చుకున్నారు. 2007లో తొలిసారిగా జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ముంబైలోని సిటీ సివిల్ కోర్టు, నాగ్‌పూర్ జిల్లా, ఫ్యామిలీ కోర్టు జడ్జిగా పనిచేశారు.
►అనంతరం నాగ్‌పూర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత బాంబే హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు.
►ఇక 2018లో జస్టిస్ పుష్ప బాంబే హైకోర్టు జడ్జిగా నియమితులైనప్పటికీ, న్యాయస్థానం వ్యతిరేకించడంతో ఆమె కొన్నాళ్లపాటు వేచిచూడాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఇందుకు సానుకూలంగా స్పందించడంతో ఆమెకు నిరాశ ఎదురైంది. అయితే 2019లో జస్టిస్ పుష్ప నియామకం ఖరారు కావడంతో బాంబే హైకోర్టు అదనపు జడ్జిగా ఆమెకు అవకాశం లభించింది.
►పెరోల్‌కు సంబంధించి ఖైదీలకు ఉన్న పరిమిత హక్కుల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనంలో జస్టిస్ పీఎన్ దేశ్‌ముఖ్, జస్టిస్ మనీష్ పితాలేతో పాటు జస్టిస్ పుష్ప గనేడివాలా కూడా ఉన్నారు. పెరోల్ అనేది కేవలం అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్( ప్రభుత్వ నిర్ణయం) కాదంటూ, దానికి సంబంధించిన ప్రొవిజన్‌పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జైళ్ల నిబంధనలకు సంబంధించి ప్రిజన్ రూల్స్-1959లోని రూల్ 19(2), ప్రిజన్స్ యాక్ట్-1894లోని సెక్షన్ 59(5)లో కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలు సరికావని పేర్కొంది.
►2019లో హత్యానేరంలో దోషులకు పడిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ రెండు కేసుల్లో తీర్పునిచ్చిన ధర్మాసనంలోనూ ఆమె సభ్యురాలిగా ఉన్నారు.
►2020లో కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో నాగ్‌పూర్‌లో కరోనా పేషంట్లకు సరిపడా బెడ్లు అందుబాటులో ఉంచాల్సిందిగా ఆదేశించిన ధర్మాసనంలో కూడా ఆమె కూడా ఉన్నారు.
►వీటితో పాటు మరికొన్ని కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్న జస్టిస్ పుష్ప గనేడివాలా జనవరి 15, 2021, జనవరి 2021 నాటి పోక్సో చట్టం కింద అరెస్టైన నిందితులకు పోక్సో చట్టం కింద శిక్ష పడదని పేర్కొంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వెలుగులోకి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment