ఆందోళనకారులకు భారీ ఊరట | No Further Cutting Of Trees Needed says Supreme court  | Sakshi
Sakshi News home page

ఆందోళనకారులకు భారీ ఊరట

Published Mon, Oct 7 2019 11:22 AM | Last Updated on Mon, Oct 7 2019 1:38 PM

No Further Cutting Of Trees Needed says Supreme court  - Sakshi

సాక్షి , న్యూఢిల్లీ: ముంబై మెట్రో రైలు ప్రాజెక్టు  నిర్మాణంలో   పర్యావరణ ఆందోళన కారులకు  సుప్రీంకోర్టుభారీ ఊరటనిచ్చింది. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రజలకు అనుకూలంగా తీర్పిచ్చి బాంబే హైకోర్టుకు గట్టి షాకిచ్చింది. ఆరేకాలనీ లో ఇకపై చెట్లను నరకడానికి వీల్లేదని సుప్రీం సోమవారం తేల్చి చెప్పింది. తదుపరి విచారణ తేదీ అక్టోబర్ 21 వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే  అరెస్టు చేసిన ఆందోళన కారులను తక్షణమే విడుదల చేయాలని  అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. 

ముంబైలో మెట్రో రైలు ప్రాజెక్టు మూడో ఫేజ్ నిర్మాణంలో చెట్లను నరకడానికి  వీల్లేదంటూ కొంతమంది ఆందోళనకారులు, పర్యావరణ వేత్తలు సుప్రీంకోర్టను ఆశ్రయించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కి కొంతమంది విద్యార్థుల బృందం లేఖ రాసిన సంగతి తెలిసిందే. కేసు విచారణకు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్ తో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తాజా ఆదేశాలిచ్చింది. బృహన్ ముంబై కార్పొరేషన్ ట్రీ అథార్టీ నిర్ణయాన్ని బాంబే హైకోర్టు సమర్థించింది. చెట్ల నరికివేతను ఆపాలంటూ పర్యావరణ వేత్తలు వేసిన పిల్‌పై అత్యవసరంగా విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరించింది. అసలు అటవీ ప్రాంతమే కాదని పేర్కొంది. దీంతో శుక్రవారం రాత్రికి రాత్రే పెద్ద సంఖ్యలో  చెట్లను నరికివేయడంతోపాటు, 144 సెక్షన్‌విధించడం వివాదాన్ని మరింత రాజేసింది.  అంబేద్కర్ మనుమడు, వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేద్కర్ తోపాటు 29 మంది ఆందోళనకారులను అరెస్ట్‌ చేయగా షరతులతో బెయిల్ లభించింది. చెట్ల నరికివేతకు వ్యతిరేక ఆందోళనకు స్థానికులు, పర్యావరణ వేత్తలు,ఇతర రాజకీయ నేతలతోపాటు, శివసేన కూడా  మద్దతునిస్తోంది. అయితే  బీజేపీ, శివసేన రెండు పార్టీలు డ్రామా చేస్తున్నాయని కాంగ్రెస్,  ఎన్సీపీ ఆరోపిస్తోంది.

ఐదు లక్షలకు పైగా చెట్లను కలిగి ఉన్న సబర్బన్ గోరేగావ్‌లోని గ్రీన్ బెల్ట్ ఆరే కాలనీలో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ కూడా ఒక భాగం. ముంబైకి ఇది హరిత ఊపిరితిత్తి లాంటిదని ఈ ప్రాంతానికి పేరు. అలాంటి పచ్చని వాతావరణాన్ని నాశనం చేస్తే ముంబై మరింత కాలుష్యమయం అవ్వక తప్పదంటూ  ట్విటర్‌ లో భారీ ఉద్యమం నడుస్తోంది. అటు పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలుకూడా ఈ ఉద్యమానికి మద్దతిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement