సుప్రీంలోనూ ఐపీఎల్కు ఝలక్
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులోనూ ఐపీఎల్ నిర్వాహకులకు, ముంబై, మహారాష్ట్ర క్రికెట్ సంఘాలకు చుక్కెదురైంది. మహారాష్ట్ర నుంచి ఇతర ప్రాంతాలకు ఐపీఎల్ మ్యాచ్లను తరలించాలని బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో మహారాష్ట్రలో ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లకు కోతపడింది.
మహారాష్ట్రలో కరువు, నీటి కొరత కారణంగా ఆ రాష్ట్రం నుంచి ఐపీఎల్ మ్యాచ్లను తరలించాలని బాంబే హైకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30 లోపు జరిగే ఆరు మ్యాచ్లు మాత్రమే ఆ రాష్ట్రంలో నిర్వహించేందుకు అనుమతిచ్చింది. ఆ తర్వాత జరగాల్సిన మరో 13 మ్యాచ్లను ఇతర రాష్ట్రాలకు తరలించాలని ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్రలో ముంబైతో పాటు పుణె, నాగ్పూర్ వేదికల్లో మ్యాచ్లు జరగాల్సివుంది. కాగా బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర క్రికెట్ సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, అక్కడా నిరాశ ఎదురైంది.