సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన ముంబై, మహారాష్ట్ర అసోసియేషన్లు
ముంబై: రాష్ట్రం నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లను తరలించాలని బాంబే హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ముంబై, మహారాష్ట్ర క్రికెట్ సంఘాలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. ఈ మేరకు రెండు సంఘాలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. ఈనెల 25న జస్టిస్ దీపక్ మిశ్రా, శివ కీర్తి సింగ్‌లతో కూడిన బెంచ్ వీటిపై విచారణ జరపనుంది. తాము పిచ్‌ల నిర్వహణ కోసం శుద్ధి చేసిన నీటిని (సీవరేజ్) ఉపయోగిస్తున్నామని చెప్పినా... కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్న అంశాన్ని ఎంసీఏ తన పిటిషన్‌లో పేర్కొంది. ‘మా రెండు సంఘాలు వేర్వేరుగా పిటిషన్లు వేశాయి. ఐపీఎల్ లేకపోవడం వల్ల మేం పెద్ద మొత్తంలో డబ్బులు, ఉద్యోగాలు నష్టపోతున్నామని కోర్టుకు విజ్ఞప్తి చేశాం.
సీవరేజ్ నీటిని ఉపయోగించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు తెలిపినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఐపీఎల్ లేకపోయినా మేం గడ్డి కోసం నీటిని వినియోగిస్తున్నాం. ఈ ఒక్క అంశాన్ని ఆధారంగా చేసుకుని మేం సుప్రీంకోర్టుకు వెళ్లాం’ అని ఎంసీఏ సంయుక్త కార్యదర్శి ఉన్మేష్ కన్విల్కర్ పేర్కొన్నారు.
ఐపీఎల్ మన దగ్గరెందుకు?
మహారాష్ట్రతో పోలిస్తే తమ దగ్గరే ఎక్కువ నీటి ఎద్దడి ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు ఇక్కడ ఎందుకు ఆతిథ్యమిస్తున్నారని రాజస్తాన్ హైకోర్టు... రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లను ఇక్కడికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ఓ పిల్‌పై కోర్టు విచారణ జరపింది. ఈనెల 27లోగా దీనికి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. రాజస్తాన్ క్రికెట్ అసోసియేషన్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్ర నుంచి మ్యాచ్‌లను తరలించడంతో ముంబై ఇండియన్స్ జట్టు ప్రత్యామ్నాయ వేదికగా జైపూర్‌ని ఎంచుకున్న సంగతి తెలిసిందే.
బాంబే హైకోర్టు తీర్పుపై సవాలు
Published Sat, Apr 23 2016 1:10 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement