మహారాష్ట్ర నుంచి ఐపీఎల్ మ్యాచ్లు అవుట్
ముంబై: బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులకు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. కరువు, నీటి కొరత కారణంగా మహారాష్ట్ర నుంచి ఐపీఎల్ మ్యాచ్లను తరలించాలని ఆదేశించింది. ఏప్రిల్ 30 వరకు మాత్రమే ఆ రాష్ట్రంలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించుకునేందుకు అనుమతిచ్చింది. ఆ తర్వాత జరగాల్సిన అన్ని మ్యాచ్లనూ రాష్ట్రం నుంచి తరలించాలని బాంబే హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మహారాష్ట్రలో ముంబైతో పాటు పుణె, నాగ్పూర్ వేదికల్లో మ్యాచ్లు జరగాల్సివుంది. ఏప్రిల్ 30 లోపు కేవలం ఆరు మ్యాచ్లు మాత్రమే ఆ రాష్ట్రంలో నిర్వహిస్తారు. హైకోర్టు తాజా ఉత్తర్వుల కారణంగా మరో 13 మ్యాచ్లను ఇతర రాష్ట్రాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కరువు ప్రాంతాల్లో సహాయక చర్యలకు సహకరిస్తామని, రోజు 40 లక్షల లీటర్ల కంటే ఎక్కువ నీటిని లాతూర్ లేదా ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తామని బీసీసీఐ తరపు న్యాయవాది అంతకుముందు కోర్టుకు విన్నవించారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్, పుణె చెరో 5 కోట్లు రూపాయల చొప్పున సీఎం సహాయక నిధికి అందజేస్తాయని చెప్పారు. వాదనలు విన్న అనంతరం ఆరు మ్యాచ్ల నిర్వహణకు మాత్రమే కోర్టు అనుమతిచ్చింది.