సాక్షి, న్యూఢిల్లీ: ముంబైలోని ఆరే కాలనీలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే చెట్ల నరికివేతపై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆరేకాలనీలో చెట్లను నరకడానికి వీల్లేదని సుప్రీం సోమవారం పునరుద్ఘాటించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తాలతో కూడిన ప్రత్యేక బెంచ్ ఈ మేరకు సోమవారం ఆదేశాలిచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని బెంచ్ లోతుగా పరిశీలించింది. పర్యావరణానికి నష్టం కలగకుండానే మెట్రో షెడ్ నిర్మాణ పనులు కొనసాగించాలని సూచించింది. ఎన్ని చెట్లు పడగొట్టారు, ఎన్నింటిని తరలించారని ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది.
బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు విన్పించారు. ఆరే కాలనీలో చెట్ల జోలికి వెళ్లబోమని, యథాతథ స్థితిని కొనసాగించాలని గత విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని సుప్రీంకోర్టుకు మెహతా విన్నవించారు. సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడతామని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కూడా హామీయిచ్చారు. ‘ఆరే కాలనీలో ఎటువంటి భవన నిర్మాణాలు ప్రాజెక్టులు లేవు. మెట్రో కార్ షెడ్ మాత్రమే నిర్మిస్తున్నార’ని ఆయన తెలిపారు. మెట్రో షెడ్ నిర్మాణానికి అనుకూలంగా ఆయన వాదనలు విన్పించారు. మెట్రో రైలు సర్వీసులు కారణంగా ఢిల్లీలో 7 లక్షల వాహనాలు రోడ్డు ఎక్కడం లేదని, దీంతో వాయు కాలుష్యం చాలా వరకు తగ్గుతోందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్ 15కు వాయిదా వేసింది. (చదవండి: ఆందోళనకారులకు భారీ ఊరట)
Comments
Please login to add a commentAdd a comment