నిష్పాక్షిక విచారణ జరగాలి
మహిళా జడ్జి ఆరోపణలపై కేంద్ర మంత్రి రవిశంకర్
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళా జడ్జి చేసిన ఆరోపణలపై నిష్పాక్షికమైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ.. ఇది చాలా విచారించదగ్గ, దురదృష్టకరమైన ఘటన అని అభివర్ణించారు. ఇది చాలా సున్నితమైన అంశమైనందున, భారత ప్రధాన న్యాయమూర్తి దీనిపై దృష్టిసారించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై నిష్పాక్షికమైన రీతిలో విచారణ జరపాలని ఓ భారత పౌరుడిగా కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ కేసులో ఆరోపణలు రుజువైతే భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని న్యాయవ్యవస్థ తగిన చర్యలు తీసుకుంటుందని రవిశంకర్ ప్రసాద్ స్పష్టంచేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టులోని గ్వాలియర్ బెంచ్ న్యాయమూర్తి తనను లైంగికంగా వేధించారని, అందుకే తన పదవికి రాజీనామా చేశానని అదనపు జిల్లా, సెషన్స్ మహిళా న్యాయమూర్తి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె భారత ప్రధాన న్యాయమూర్తికి తొమ్మిది పేజీల లేఖ రాశారు. అయితే, ఆమె ఆరోపణలను సదరు హైకోర్టు న్యాయమూర్తి ఖండించారు. ఆ ఆరోపణలు నిజమని తేలితే మరణశిక్షకైనా సిద్ధమేనన్నారు.
ఖండించండి..: బీజేపీ ఎంపీ మీనాక్షి
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళా జడ్జి చేసిన ఆరోపణలు మంగళవారం లోక్‌సభలో ప్రస్తావనకు వచ్చాయి. ఈ అంశాన్ని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి ప్రస్తావించారు. ఈ ఘటన చాలా దిగ్భ్రాంతికరమని, పవిత్రమైన న్యాయవ్యవస్థలోనూ మహిళలకు రక్షణ లేదనడానికి ఇది నిదర్శనమన్నారు. ఇలాంటి ఘటనల వల్ల మహిళల జీవించే హక్కుకు విఘాతం కలుగుతోందన్నారు. దీనిని సభతోపాటు న్యాయవ్యవస్థ కూడా ఖండించాలని విజ్ఞప్తి చేశారు.