న్యూఢిల్లీ: బలవంతపు మతమార్పిడులను అత్యంత తీవ్రమైన అంశంగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. మోసగించి, ప్రలోభపెట్టి, భయపెట్టి మతాంతరీకరణ చేయడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు స్పష్టం చేసింది. ‘‘మత స్వేచ్ఛ ఉండొచ్చు. కానీ బలవంతంగా మతం మార్చే స్వేచ్ఛ ఎవరికీ లేదు! ఈ తరహా మార్పిడులను అడ్డుకోని పక్షంలో చాలా సమస్యాత్మక పరిస్థితులు తలెత్తుతాయి.
ఈ పోకడలు నిజమే అయితే గనక అంతిమంగా ఇది దేశభద్రతకే పెను సవాలు విసరగలిగినంతటి తీవ్రమైన సమస్య! అంతేగాక పౌరులు తమకు నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛను కూడా ప్రమాదంలో పడేస్తుంది’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్రం తక్షణం జోక్యం చేసుకోండి. బలవంతపు మతమార్పిళ్లకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోండి. ఆ వివరాలతో 22లోగా అఫిడవిట్ దాఖలు చేయండి’’ అని ఆదేశించింది.
బలవంతపు మత మార్పిళ్లను అడ్డుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ అడ్వకేట్ అశ్వనీకుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. బలవంతపు మతమార్పిడులను అడ్డుకునేందుకు కేంద్రం ఏం చేయనుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది. ఈ అంశాన్ని రాజ్యాంగ పరిషత్తులో చర్చించినట్టు ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
‘‘డబ్బు తదితర ప్రలోభాలు చూపి, భయపెట్టి, మోసగించి మతం మార్చడాన్ని అడ్డుకునేందుకు ఒడిశా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు తెచ్చిన రెండు చట్టాలు ఇప్పటికే ఉన్నాయి. ఈ అంశం గతంలో సుప్రీంకోర్టు దృష్టికి వచ్చినప్పుడు ఆ చట్టాల చెల్లుబాటును సమర్థించింది కూడా’’ అని ఆయన వివరించారు. గిరిజన ప్రాంతాల్లో ఈ బలవంతపు మతమార్పిళ్లు అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్నాయన్నారు. ‘‘తాము క్రిమినల్ నేరాల్లో భాగస్వాములుగా మారుతున్నామన్న వాస్తవం కూడా ఇలాంటి బాధితులకు చాలాసార్లు తెలియదు. పైగా మతం మారుస్తున్న వాళ్లు తమకు సాయం చేస్తున్నారని భ్రమిస్తుంటారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. విచారణను నవంబర్ 28కి ధర్మాసనం వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment