వర్క్‌ ఫ్రం హోమ్‌ శకం ముగిసినట్టే..నా? కంపెనీలు ఏమంటున్నాయి? | remote work era ends as tech companies make work from office mandatory | Sakshi
Sakshi News home page

Remote work: వర్క్‌ ఫ్రం హోమ్‌ శకం ముగిసినట్టే..నా? కంపెనీలు ఏమంటున్నాయి?

Published Sun, Nov 5 2023 5:30 PM | Last Updated on Sun, Nov 5 2023 9:26 PM

remote work era ends as tech companies make work from office mandatory - Sakshi

కోవిడ్‌ మహమ్మారి సమయంలో వర్క్‌ ఫ్రం హోమ్‌ (WFH) విధానం అన్ని కంపెనీలకూ, ముఖ్యంగా టెక్‌ సంస్థలకు అనివార్యంగా మారింది.  ఆ తర్వాత కోవిడ్ పరిమితులు  సడలించినప్పటి నుంచి ఐటీ కంపెనీలు, స్టార్టప్‌లు ఉద్యోగుల ఉత్పాదకతను పెంచే క్రమంలో వారిని ఆఫీస్‌లకు రప్పించే హైబ్రిడ్‌ మోడల్‌ను అమలు చేస్తున్నాయి. ఇప్పుడు, రిమోట్ వర్కింగ్ యుగానికి ముగింపు పలుకుతూ ఉద్యోగులు ఆఫీసు నుంచి పని చేయడాన్ని (WFO) తప్పనిసరి చేస్తున్నాయి.

దాదాపు నాలుగేళ్ల నుంచి వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసిన ఇన్ఫోసిస్ ఉద్యోగులు నవంబర్ 20వ తేదీ నుంచి తిరిగి ఆఫీస్‌ బాట పట్టనున్నారు. వారంలో మూడు రోజులు ఆఫీసు నుంచే వారు పనిచేయాల్సి ఉంటుందని కంపెనీ ఆదేశాలు జారీ చేసింది. ఇక టీసీఎస్‌ (TCS) అయితే గత నెలలో తమ ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పాటు ఆఫీస్‌ నుంచి వర్క్‌ను తప్పనిసరి చేసింది.

ఇక విప్రో తమ ఉద్యోగులను వారంలో తమకు నచ్చిన మూడు రోజులు ఆఫీసు నుంచి పని చేసేందుకు మే నెల నుంచి అవకాశం కల్పించింది. హెచ్‌సీఎల్‌టెక్ కూడా తన ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీస్‌లకు వచ్చి పనిచేయాలని కోరింది.

ఇదీ చదవండి: ఐటీ హబ్‌లు వెలవెల! భారీగా పడిపోయిన నియామకాలు.. కీలక రిపోర్ట్‌ వెల్లడి

సొనాటా సాఫ్ట్‌వేర్‌లో దశలవారీగా రిటర్న్ టు ఆఫీస్ విధానం అమలుపై కసరత్తు చేస్తున్నారు. మిడ్-మేనేజర్‌లు, సీనియర్ మేనేజర్‌లు, లీడర్‌షిప్ స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఇప్పటికే వారానికి రెండు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేస్తున్నారు. వచ్చే  జనవరి నుంచి మిగిలిన వారు కూడా హైబ్రిడ్ మోడ్‌లో వారానికి కనీసం రెండు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేస్తారని సొనాటా సాఫ్ట్‌వేర్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ బాలాజీ కుమార్ చెప్పారు.

పూర్తి వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానం నుంచి  ఉద్యోగులను కంపెనీలు ఇప్పుడిప్పుడే హైబ్రిడ్ మోడల్‌కు తీసుకొచ్చి వారానికి కొన్ని రోజులైనా ఆఫీస్‌ల నుంచి పని చేయించుకుంటున్నాయి. అయితే ఈ హైబ్రిడ్‌ విధానమైనా కొనసాగుతుందా లేదా టీసీఎస్‌ లాగా అన్ని కంపెనీలు పూర్తిగా వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ను తప్పనిసరి చేసి వర్క్‌ ఫ్రం హోమ్‌ శకానికి ముగింపు పలుకుతాయా? అన్న అనుమానం ఉద్యోగ వర్గాల్లో ఉంది.

రిమోట్ వర్క్‌ క్షీణిస్తోంది
వంద శాతం రిమోట్ జాబ్స్ అనే భావన క్రమంగా మసకబారుతోందని ర్యాండ్‌స్టాడ్ ఇండియా చీఫ్ పీపుల్ ఆఫీసర్ అంజలి రఘువంశీ చెబుతున్నారు. ఆఫీస్‌కు వచ్చి పనిచేయడానికి భారతీయ ఉద్యోగులు క్రమంగా అలవాటు పడుతున్నారని, వారి అవసరాన్ని బట్టి వారానికి ఒకటి లేదా రెండు రోజులు వర్క్‌ ఫ్రం హోమ్‌ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారని తెలిపారు.

వారానికి నాలుగు రోజులైతే ఓకే 
రాండ్‌స్టాడ్ ఇన్‌సైట్స్ 4-డే వర్క్‌వీక్ క్యాండిడేట్ పల్స్ సర్వే 2023 ప్రకారం, 35 శాతం మంది ఉద్యోగులకు తమ కంపెనీ 4-రోజుల వర్క్‌వీక్‌కి మారితే ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లి  పని చేయడానికి అభ్యంతరం లేదు. 43 శాతం మంది ఒక రోజు అదనపు సెలవు వస్తే మిగిలిన రోజుల్లో పని గంటలు కాస్త ఎక్కువైనా పర్వాలేదని అభిప్రాయపడ్డారు.

ఉద్యోగుల అభిప్రాయాలను అదే సమయంలో తమ వ్యాపార అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇద్దరికీ అనువైన విధానాన్ని కంపెనీలు ఆలోచించాలని అంజలీ రఘువంశీ సూచిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికి వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ మోడల్‌కు ఉద్యోగులు వచ్చినప్పటికీ ఒక్కసారి జాబ్‌ మార్కెట్‌ అనుకూలంగా మారిందంటే ఉద్యోగులు తమకు మరింత సౌలభ్యాన్ని అందించే ఉద్యోగాల వైపు వెళ్లే అవకాశం ఉంటుందని, అందువల్ల కంపెనీలు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందంటున్నారు.

దశలవారీగా ఆఫీస్‌లకు..
ఆఫీస్‌లకు వచ్చి పనిచేయడం వల్ల ఉద్యోగుల మరింత నేర్చుకునేందుకు, అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని హెచ్‌ఆర్‌ నిపుణులు నమ్ముతున్నారు. “హైబ్రిడ్ విధానం ఐటీ  రంగంలోని ఉద్యోగులపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కొంతమంది ఉద్యోగులు ఆఫీస్‌ రావడానికి ఇష్టపడవచ్చు. ప్రయాణ ఇబ్బందుల నేపథ్యంలో​ మరికొంత మంది ఆఫీస్‌లకు రావడానికి ఇష్టపడకపోవచ్చు” అని కెరీర్‌నెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అన్షుమన్ దాస్ చెప్పారు.

వర్క్‌ ఫ్రం హోమ్‌ మంచి ఆలోచన కాదని ఐటీ కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు భావిస్తున్నారు. దశలవారీగా అన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పిస్తున్నాయి. కోవిడ్‌ మహమ్మారి సమయంలో విస్తృతంగా ఉన్న రిమోట్ వర్క్ విధానం తగ్గుతూ వస్తోంది. రిమోట్‌ వర్క్‌ క్రమంగా తగ్గుముఖం పట్టడం కూడా ఉద్యోగులను తిరిగి ఆఫీస్‌లకు రప్పించడానికి కంపెనీల్లో కొనసాగుతున్న ఒత్తిడిని ప్రతిబింబిస్తుందని బిజ్ స్టాఫింగ్ కామ్రేడ్ మేనేజింగ్ పార్టనర్ పునీత్ అరోరా పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement