సంప్రదాయం నుంచి.. స్వచ్ఛత వైపు.. 2029–30 నాటికి లక్ష్యం 64 % | Inclination of Central and State Governments towards non conventional power generation | Sakshi
Sakshi News home page

సంప్రదాయం నుంచి.. స్వచ్ఛత వైపు.. దేశంలో వేగంగా మారుతున్న విద్యుత్‌ రంగ ముఖచిత్రం 

Published Wed, Mar 15 2023 2:24 AM | Last Updated on Wed, Mar 15 2023 7:53 AM

Inclination of Central and State Governments towards non conventional power generation - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌ : రాష్ట్ర, దేశ ప్రగతికి కీలకమైనది విద్యుత్‌ రంగం. కాగా ఒకప్పుడు బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పాదనకే ప్రాధాన్యత ఎక్కువగా ఉండేది. దశాబ్దన్నర కిందటి వరకు విద్యుత్‌ ఉత్పత్తి ప్రధానంగా బొగ్గుపైనే ఆధారపడి ఉండేది. కానీ ప్రస్తుతం విద్యుత్‌ ఉత్పత్తి ప్రాధాన్యతలు మారుతున్నాయి. కర్బన ఉద్గారాలు, వాతావరణంలో మార్పులు నేపథ్యంలో విద్యుదుత్పాదన సంప్రదాయ విధానం నుంచి సంప్రదాయేతర విధానం వైపు మారుతోంది.

బొగ్గుతో పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, కర్బన ఉద్గారాల విడుదల విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. కర్బన ఉద్గారాల తగ్గింపునకు కట్టుబడి ఉన్నామని చెబుతున్న భారత్‌ పుష్కరకాలంగా సంప్రదాయేతర విద్యుత్‌ ఉత్పాదనకే మొగ్గు చూపుతోంది.  

సంప్రదాయేతర విద్యుత్‌కే మొగ్గు 
దేశంలో ప్రస్తుతం ఉన్న ప్లాంట్లకు మొత్తం 3,79,515 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన సామ ర్థ్యం ఉంది. వీటిలో బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాల సామర్ధ్యం 2,04,435 మెగావాట్లు (49.7%) కాగా, పవన, సౌర విద్యుత్‌ కేంద్రాల సామర్ధ్యం 1,21,550 మెగావాట్లు (29.5%).

అయితే ఈ సౌర, పవన విద్యుత్‌ కేంద్రాలు గత దశాబ్దన్నర కాలంగా వచ్చినవే కావడం గమనార్హం కాగా.. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) కూడా తన ప్రధాన ఉత్పాదన అయిన థర్మల్‌ నుంచి సోలార్‌ వైపు అడుగులేస్తుండటం కీలక పరిణామం. ప్రస్తుతం సంప్రదాయేతర విద్యుదుత్పాదన మొత్తం 42.5 శాతం కాగా, దీనిని 2029–30 నాటికి ఏకంగా 64 శాతానికి తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.  

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలే ఎక్కువ విద్యుత్‌ ఉత్పత్తిని ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి సంప్రదాయ (బొగ్గు, లిగ్నైట్, గ్యాస్, డీజిల్‌ ఆధారిత) అయితే, మరొకటి సంప్రదాయేతర (జల, పవన, సౌర, బయోమాస్, అణు) విద్యుత్‌. సంప్రదాయ విద్యుత్‌లో కూడా..దేశంలో బొగ్గు నిల్వలు విస్తారంగా ఉన్న నేపథ్యంలో అత్యధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాలే ఉండేవి. గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటు అయినా.. వాటికి సరిపడా గ్యాస్‌ లభ్యత లేని కారణంగా నామమాత్రంగా తయారయ్యాయి.

ఇక సంప్రదాయేతర ఇంధనంలో ఒకప్పుడు ప్రధానంగా జల ఆధారిత, స్వల్పంగా బయోమాస్‌తో విద్యుదుత్పాదన జరిగేది. డ్యామ్‌లు, రిజర్వాయర్లు ఉన్నచోట మాత్రమే జల విద్యుత్‌ ఉత్పత్తి జరిగేది. ఇది కూడా వర్షాలపై ఆధార పడి ఉండడంతో.. రిజర్వాయర్లలో నీటి లభ్యత తక్కువైన సమయంలో విద్యుత్‌ ఉత్పాదన సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే పవన, సౌర విద్యుత్‌ తెరపైకి వచ్చాయి.

కాగా ప్రస్తుత పరిస్థితుల్లో సంప్రదాయేతర విద్యుత్‌ ఉత్పాదన స్థాపిత సామర్థ్యం గణనీయంగా పెరుగుతోంది. సంప్రదాయ ఇంధనాల కంటే సుస్థిర, పర్యావరణ హితమైన సంప్రదాయేతర ఇంధనాలతో విద్యుత్‌ ఉత్పత్తి చేయడమే సరైనదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి ఆ దిశగా ముందుకెళ్తున్నాయి. 

పడిపోతున్న థర్మల్‌ ఉత్పాదన సామర్థ్యం.. 
థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల విద్యుదుత్పాదన సామర్థ్యంలో తగ్గుదల నమోదు అవుతోంది, ఇందుకు ప్రధాన కారణాల్లో బొగ్గు కొరత ఒకటైతే, స్టేషన్ల బ్యాక్‌డౌన్‌ (వినియోగం తక్కువగా ఉన్న ప్పుడు లేదా సంప్రదాయేతర ఇంధన విద్యుదుత్పాదన అధికంగా ఉన్నప్పుడు, థర్మల్‌ కేంద్రాల ఉత్పత్తి నిలిపివేయడం/ తగ్గించడం) మరొకటి. యంత్రాల కాలపరిమితి ముగిసినా అలాగే ఉత్పత్తి చేయడం, బొగ్గులో నాణ్యత లోపించడం వంటి అంశాలతో ఉత్పాదన ఈ సామర్థ్యం తగ్గుతోంది.

తాజాగా కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంస్థ ప్రకటించిన లెక్కల ప్రకారం 57.69 శాతం విద్యుత్‌ ప్లాంట్లు మాత్రమే తమ స్థాపిత సామర్థ్యంలో 35 శాతం కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాయని, మిగిలిన 42.31 శాతం విద్యుత్‌ ప్లాంట్లు 35 శాతం కంటే తక్కువ ఫీఎల్‌ఎఫ్‌ (ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌)తో నడుస్తున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల, ప్రభుత్వ రంగ సంస్థల్లోని థర్మల్‌ కేంద్రాలు మాత్రం ఏకంగా 90% పీఎల్‌ఎఫ్‌తో పనిచేస్తున్నాయి.  

తెలుగు రాష్ట్రాల్లో వేగంగా.. 
సంప్రదాయేతర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటులో తెలంగాణ, ఏపీ వేగంగా పురోగతి సాధిస్తున్నాయి. కేంద్ర గణాంకాల ప్రకారం ఏపీలో పవన విద్యుత్‌ 4,096.95 మెగావాట్లు, సౌర విద్యుత్‌ 4,390.48 మెగావాట్లు, భారీ జల విద్యుత్‌ ప్రాజెక్టులు1,610 మెగావాట్లు, బయోమాస్‌ 566 మెగావాట్లు, స్మాల్‌హైడ్రో 162 మెగావాట్లుగా ఉంది. కాగా తెలంగాణలో 5748 మెగావాట్ల సౌర విద్యుత్, 128 మెగవాట్ల పవన విద్యుత్‌ , 287 మెగావాట్ల రూఫ్‌టాప్, 2381.76 మెగావాట్ల జల విద్యుత్‌ ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

పరిశ్రమలదే సింహభాగం.. 
పారిశ్రామిక రంగ అభివృద్ధి ముఖ్యంగా విద్యుత్‌ రంగంపైనే ఆధారపడి ఉంది. దేశంలో విద్యుత్‌ వినియోగంలో సింహభాగం పరిశ్రమల రంగానిదే. అయితే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో పారిశ్రామిక విద్యుత్‌ వినియోగం తక్కువే.

అధికార గణాంకాల ప్రకారం ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో పరిశ్రమల రంగానికి 41.36%, గృహావసరాలకు 26.89% , వ్యవసాయానికి 17.99 శాతం, వాణిజ్య అవసరాలకు 7.07% వినియోగిస్తున్నట్లు కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తలసరి విద్యుత్‌ వినియోగం దాదాపు 1,255 యూనిట్లుగా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement