ఓ పక్క ప్రపంచవ్యాప్తంగా వెలుగులు వెదజల్లుతూ విద్యుచ్ఛక్తిని అందిస్తున్న సూర్యుడు. మరోపక్క భూగర్భంలో చీకట్లమాటన దాగి విద్యుచ్ఛక్తితో చీకటిని మాపుతున్న బొగ్గు గనులు. ఇందులో ఒకటి గతించిపోతున్న గతం. మరొకటి భవిష్యత్తుకు నిదర్శనం. గతించి పోతున్న బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులంతా భవిష్యత్తు బాటలో సౌరవిద్యుత్ ప్లాంట్లలోకి అడుగులు వేయాల్సిందే. అదే ప్రస్తుత కర్తవ్యమని మిషిగన్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ జాషువా పియర్స్, ఓరెగాన్ స్టేట్ యూనివర్సిటీ పీహెచ్‌డీ విద్యార్థి ఎడ్వర్డ్ లూయీ చెబుతున్నారు. వారు సౌర విద్యుత్ ఆవశ్యకతను వివరిస్తూ 'ఎనర్జీ ఎకనామిక్స్' జర్నల్‌లో ఓ వ్యాసం రాశారు.
అమెరికాలో గత 15 ఏళ్లుగా విస్తరిస్తున్న సౌరవిద్యుత్ వ్యవస్థ కారణంగా థర్మల్ విద్యుత్ రంగంలో పనిచేస్తున్నవారి ఉద్యోగాలు ఊడిపోతున్నాయని, వారిని సౌరవిద్యుత్ వ్యవస్థలోకి లాక్కొని ఉద్యోగావకాశాలను కల్పించాలని వారు సూచించారు. ప్రస్తుతం అమెరికాలోని బొగ్గు ఉత్పత్తి రంగంలో ఇంజనీర్లు, అకౌంటెంట్లు, ఎలక్ట్రీషియన్లు, మైనర్లు కలిపి దాదాపు 1.50 లక్షల మంది పనిచేస్తున్నారు. అదే సౌరవిద్యుత్ రంగంలో 2.09 లక్షల మంది పనిచేస్తున్నారు.
బొగ్గు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా సులభంగానే సౌర విద్యుత్ రంగంలోకి తీసుకోవచ్చని, నైపుణ్యం కలిగిన కార్మికులకు రెండు వారాల శిక్షణ ఇస్తే సరిపోతుందని జాషువా పియర్స్ అభిప్రాయపడ్డారు. ఇంజనీర్లకు మాత్రం సరైన విద్యను అందజేస్తే సరిపోతుందని చెప్పారు. బొగ్గురంగంలో పనిచేస్తున్న మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ అధికారులకు వేతనాలు సౌర విద్యుత్ రంగంలో తగ్గిపోతాయి. బొగ్గురంగం నుంచి ప్రతి కార్మికుడిని సౌర విద్యుత్ రంగంలోకి తీసుకుంటే 18 కోట్ల డాలర్ల నుంచి వంద కోట్ల డాలర్ల వరకు ఆర్థిక భారం పడవచ్చని ఆయన అంచనా వేశారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం, కార్మికులు పంచుకోవాలని ఆయన సూచించారు.
బొగ్గు కంపెనీలు కూడా చమురు కంపెనీలు అనుసరించిన మార్గాన్నే అనుసరించాలని, సహజ వాయువు తదితర ప్రత్యామ్నాయ ఇంధన వనరులవైపు తమ పోర్ట్‌ఫోలియోలను చమురు కంపెనీలు మార్చుకున్నాయని, వారి బాటలోనే ప్రత్యామ్నాయ, ఎకో ఫ్రెండ్లీ ఇంధనాల వైపు బొగ్గు కంపెనీలు తమ దృష్టిని సారించాలని జాషువా, ఎడ్వర్డ్‌లు తమ వ్యాసంలో సూచించారు. ఫ్రెంచ్ కంపెనీ టోటల్ ఎస్‌ఏ, బ్యాటరీ మేకర్ సాఫ్ట్‌గ్రూప్‌ను వంద కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిందని, సన్ పవర్ కార్పొరేషన్‌లో మరో చమురు కంపెనీ 60 శాతం షేర్లను కొనుగోలు చేసిందని వారు ఉదహరించారు. బీపీ, ఎగ్జాన్‌మొబైల్, కొనొకోఫిలిప్స్ లాంటి కంపెనీల వద్ద అపార ధనరాశులు ఉన్నాయని, అలాంటి కంపెనీలు సౌర విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.
వాళ్లు కూడా సౌర విద్యుత్తు వైపే వెళ్లాలి
Published Tue, Aug 16 2016 4:11 PM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM
Advertisement
Advertisement