పడినప్పుడు కొనడానికి సిద్ధంగా ఉండండి.. | be ready to purchase of gold when gold price is drop | Sakshi
Sakshi News home page

పడినప్పుడు కొనడానికి సిద్ధంగా ఉండండి..

Published Thu, Aug 28 2014 12:49 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

పడినప్పుడు కొనడానికి సిద్ధంగా ఉండండి.. - Sakshi

పడినప్పుడు కొనడానికి సిద్ధంగా ఉండండి..

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే 10 ఏళ్ళు మోడీ ప్రధానిగా ఉండటమే కాకుండా కీలకమైన ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తారని మార్కెట్ వర్గాలు గట్టిగా విశ్వసిస్తున్నాయంటోంది ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎస్‌ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్. బుల్లిష్ సెంటిమెంట్ పటిష్టంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రతీ కరెక్షన్‌ను కొనుగోళ్లకు వినియోగించుకోమంటున్న ఎస్‌ఎంసీ గ్లోబల్ రీసెర్చ్ హెడ్ జగన్నాథం తూనుగుంట్లతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ...
 మోడీ 100 రోజుల పాలనపై మార్కెట్ వర్గాలు ఏ విధంగా స్పందిస్తున్నాయి?
 ప్రస్తుత మార్కెట్ సెంటిమెంట్ చాలా బుల్లిష్‌గా ఉంది. మన మార్కెట్‌పై దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు అత్యంత నమ్మకంతో ఉన్నారు. సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం కొద్దిగా ఆలస్యం చేస్తుండటంపై మార్కెట్ వర్గాలు కొంత అసంతృప్తిగా ఉన్నాయి.

ముఖ్యంగా రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్, సహజవాయువు ధరలు, జీఎస్‌టీ వంటి కీలక నిర్ణయాల్లో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోందన్న భావన ఉంది. అధికారంలోకి వచ్చి 3 నెలలు అయినా డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ మొదలు కాలేదు. కానీ మోడీ బాడీ లాంగ్వేజ్‌ను బట్టి వచ్చే 10 ఏళ్లు తానే అధికారంలో ఉంటానన్న ధీమాతో కీలక నిర్ణయాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.  మొత్తంమీద మార్కెట్ వర్గాలు మాత్రం రానున్న కాలంలో సంస్కరణల వేగం పెరుగుతుందన్న నమ్మకంతో ఉన్నాయి.  దేశీయ స్టాక్ మార్కెట్ టాప్ 3 బుల్లిష్ సెంటిమెంట్స్‌లో ఇదొకటని కచ్చితంగా చెప్పొచ్చు.

 ప్రస్తుతం మార్కెట్లు జీవన కాల గరిష్ట స్థాయిల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ స్థాయిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా? స్వల్ప, మధ్య కాలానికి సూచీల కదలికలు ఎలా ఉంటాయని అంచనా వేస్తున్నారు?
 ప్రస్తుతం విలువ పరంగా చూస్తే ఇండెక్స్‌లు అంత చౌకగా ఏమీ లేవు. సెన్సెక్స్ 18 -19 పీఈ వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గత బుల్న్‌ల్రో ఇండెక్స్‌లు 25 పీఈ వరకు కూడా వెళ్ళాయి. ఒక్కసారి వృద్ధిరేటు గాడిలో పడి కంపెనీల ఆదాయం పెరిగితే సూచీలు మరింత పైకి పరుగులు పెడతాయి. ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఉన్నందున సూచీలు ఎంత వరకు వెళ్తాయి అని అంచనా వేయడం కష్టం. స్వల్పకాలానికి ఇండెక్స్‌లో 5-6 శాతం కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది.

 రానున్న కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఎదుర్కొనే ప్రధానమైన రిస్క్ ఏది?
 కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం రావడంతో స్టాక్‌మార్కెట్లకు దేశీయంగా ఎటువంటి నష్టభయాలు లేవని చెప్పొచ్చు. రిస్క్ ఏదైనాఉందంటే అవి అంతర్జాతీయ పరిణామాలే. ఇరాక్, ఉక్రెయిన్, అమెరికాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఊహించలేం. ప్రస్తుతం క్రూడ్  ధరలు తగ్గుతున్నా.. అంతర్జాతీయంగా ఏ మాత్రం ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడినా తిరిగి పెరిగే అవకాశం ఉంది. ఒక్కసారి ఆయిల్ ధరలు పెరిగితే అది దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

 ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు మీరిచ్చే సలహా?
 ఇప్పటికే చాలా షేర్లు కనిష్ట స్థాయిల నుంచి బాగా పెరిగిపోయాయి. ఈ ర్యాలీని మిస్ అయిన వాళ్లల్లో చాలామంది షేర్ల ధరలు 2011, 2012 స్థాయికి వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేద్దామని ఎదురు చూస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేటట్లు కనిపించడం లేదు. బుల్ సెంటిమెంట్ బాగా ఉన్న మార్కెట్లలో సూచీల్లో ప్రతీ పతనంలోనూ కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది.

కాబట్టి సూచీలు గరిష్టంగా 5 నుంచి 6 శాతానికి మించి పతనం కావు. కాని షేర్లు గరిష్ట స్థాయి నుంచి 20-30% పతనం అవుతాయి. ఇటువంటి సందర్భాలను కొనుగోళ్లకు వినియోగించుకోవచ్చు. మార్కెట్లు పతనం అయ్యాక ఎందులో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించడం కంటే ముందుగానే మంచి షేర్లను ఎంపిక చేసుకొని కరెక్షన్ వచ్చినప్పుడల్లా కొనుగోలు చేయమని సూచిస్తాను. అప్పులు ఎక్కువగా ఉన్న కంపెనీలకు దూరంగా ఉండండి.

 ఏయే రంగాలు ఆకర్షణీయంగా ఉన్నాయి?
 పెరిగిన షేర్లు అందనంత ఎత్తుకు పెరగడం అనేది బుల్ మార్కెట్ లక్షణం. ఇటువంటి ఇఫోరియాలో వాల్యుయేషన్స్‌ను మార్కెట్ పట్టించుకోదు. ప్రస్తుతం ఫార్మా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు విలువ పరంగా ఖరీదుగా ఉన్నప్పటికీ ఇంకా పెరిగే అవకాశాలున్నాయి.

కానీ క్రమేపీ ఈ షేర్లలో పెట్టుబడులను తగ్గించుకోమని సూచిస్తాను. ప్రస్తుత మార్కెట్లో ఇన్‌ఫ్రా, క్యాపిటల్ గూడ్స్, మైనింగ్, కోల్, పవర్ రంగాల షేర్లు విలువ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ నియంత్రణ ఉన్న మైనింగ్, కోల్, పవర్ రంగాల్లో ప్రభుత్వం ఏ మాత్రం సంస్కరణలు చేపట్టినా ఈ రంగాల షేర్లు పరుగులు తీస్తాయి. ఇక  పీఎస్‌యూ బ్యాంకుల కంటే మిడ్‌క్యాప్ ప్రైవేట్ బ్యాంక్‌లు మంచి ర్యాలీ చేస్తున్నాయి.

 వడ్డీరేట్లు, రూపాయి కదలికలపై అంచనాలు ఏమిటి?
 డిసెంబర్ చివరి వరకు వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.  ఇక్కడ వడ్డీరేట్లు తగ్గడం అనేది అమెరికా ఫెడరల్ బ్యాంక్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఫెడ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచే ఆలోచనలో ఉంది. అదే జరిగితే ఇక్కడ వడ్డీరేట్లు తగ్గడం అనేది కష్టం.అనూహ్యంగా ద్రవ్యోల్బణం బాగా తగ్గితే ఇక్కడ వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉంది. రానున్న కాలంలో రూపాయితో డాలరు మారకం విలువ రూ. 59-61 శ్రేణిలో కదలవచ్చని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement