సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ డిసెంబర్‌లో అత్యధికంగా 99.5 శాతం పీఎల్‌ఎఫ్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పిందని సింగరేణి సంస్థ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. 2017–18లో 90 శాతం పీఎల్‌ఎఫ్ సాధించి జాతీయ స్థాయిలో 25 అత్యుత్తమ థర్మల్ విద్యుత్ కేంద్రాల జాబితాలో 4వ స్థానంలో నిలిచిందని, ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొంది. విద్యుత్ ప్లాంట్ స్థాపిత సామర్థ్యంతో పోల్చినపుడు.. ఓ నిర్ణీత కాలంలో వాస్తవంగా జరిగిన విద్యుదుత్పత్తి శాతాన్ని పీఎల్‌ఎఫ్ అంటారు.
గత ఫిబ్రవరిలో 100 శాతం పీఎల్‌ఎఫ్ సాధించిన 600 మెగావాట్ల యూనిట్–2 ప్లాంటు.. మే, నవంబర్‌లలో కూడా 100 శాతం పీఎల్‌ఎఫ్ సాధించింది. మరో 600 మెగావాట్ల యూనిట్–1 ప్లాంటు ఏప్రిల్, డిసెంబర్‌లలో 100 శాతం పీఎల్‌ఎఫ్ సాధించడం గమనార్హం. అందరికీ అందుబాటులో, అన్ని వేళలా విద్యుత్తు సరఫరా చేయాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్న నేపథ్యంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 10,658 మిలియన్ యూనిట్లను ఇతర సంస్థల కన్నా తక్కువ ధరకే సరఫరా చేసింది. ఇలా ఇతర సంస్థల ధరలతో పోలిస్తే దాదాపు రూ.వెయ్యి కోట్లు ఆదా అయినట్లు సింగరేణి యాజమాన్యం తెలిపింది.
కొత్త ఏడాదిలో మరిన్ని విజయాలు
సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంటు జాతీయ స్థాయిలో 4వ స్థానంలో నిలవడంపై సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. 2018లో మరిన్ని విజయాలు సాధించనున్నామని, కొత్త సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయనున్నామని తెలిపారు. సంస్థ ప్రగతి పథంలో కీలకపాత్ర పోషిస్తున్న అధికారులకు, వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న కుటుంబీకులకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏటా సగటున 7 శాతం వృద్ధి రేటుతో సంస్థ పురోగమిస్తోందని పేర్కొన్నారు. కొత్తగా 12 గనులు రానున్నాయని, రానున్న 5 ఏళ్లలో సింగరేణి 850 లక్షల టన్నుల లక్ష్యాన్ని చేరుకోనుందని తెలిపారు.
విద్యుదుత్పత్తిలో సింగరేణి రికార్డు
Published Mon, Jan 1 2018 2:29 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment