సాక్షి, అమరావతి: సహజ వెలుగుల వినియోగాన్ని పెంచడం ద్వారా వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మరోసారి దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర అవసరాలకు వినియోగించే విద్యుత్‌లో దాదాపు 25 శాతం విద్యుత్‌ను సౌర, పవన, జల విద్యుత్ ఉత్పత్తి నుంచే తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు 2022–23కి పునరుత్పాదక కొనుగోలు బాధ్యత (ఆర్‌పీవో)ను తాజాగా ప్రకటించింది.
లక్ష్యాన్ని సాధించలేకపోతే జరిమానా..
గతేడాది 21 శాతంగా ఉన్న ఆర్‌పీవో అంతకుముందు రెండేళ్లలో వరుసగా 17 శాతం, 19 శాతంగా ఉంది. ఈ లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్ వంద శాతం పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా ఏపీతోపాటు గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు మాత్రమే నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్నాయని కేంద్రం తెలిపింది. లక్ష్యానికి తగ్గట్టుగా పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగించలేకపోయిన రాష్ట్రాల్లో యూనిట్‌కు 25 పైసల నుంచి 30 పైసల వరకూ తొలి ఏడాది జరిమానా విధించాలని కేంద్రం భావిస్తోంది. ఆ తర్వాత దాన్ని యూనిట్‌కు 35 పైసల నుంచి 50 పైసలకు పెంచాలనుకుంటోంది.
ధరలను నిర్ణయించే అధికారం ఈఆర్‌సీదే..
2030 చివరి నాటికి ఆర్‌పీవోను 43 శాతానికి పెంచుతామని కేంద్రం వెల్లడించింది. 2023–2030 మధ్య 24.61 శాతం నుంచి 43.33 శాతం వరకు ఆర్‌పీవోను పెంచుకుంటూ వెళ్లనుంది. దీనిలో పవన విద్యుత్ ఆర్‌పీవో లక్ష్యం.. 0.81–6.94 శాతం. కాగా జల విద్యుత్ 0.35–2.82 శాతం, సౌర విద్యుత్ 23.44–33.57 శాతంగా ఉంటుంది. రాష్ట్రాలు దీనికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. పునరుత్పాదక విదుŠయ్‌త్ ధరలను కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ) నిర్ణయించనుంది.
ఏపీలో ఆర్‌ఈ సామర్థ్యం 10,826 మెగావాట్లు..
దేశంలో 2040 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఈ ఏడాది చివరి నాటికి 175 గిగావాట్లు పూర్తి చేయాలనుకుంటోంది. కాగా రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ నాటికి పునరుత్పాదక విద్యుత్ (ఆర్‌ఈ) స్థాపిత సామర్థ్యం దాదాపు 10,826 మెగావాట్లకు చేరింది. దీనిలో 4,096.65 మెగావాట్లు పవన విద్యుత్, 3,490.48 మెగావాట్లు సౌర విద్యుత్, 1,610 మెగావాట్లు జల విద్యుత్, 566.04 మెగావాట్లు జీవ(బయో) విద్యుత్, 162.11 మెగావాట్లు చిన్న జల విద్యుత్, ఇతర పునరుత్పాదక విద్యుత్ 900.72 మెగావాట్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment