hydro power
-
జలవిద్యుదుత్పత్తిలో ఏపీ ముందంజ
సాక్షి, అమరావతి: జల విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ముందంజ వేసింది. శ్రీశైలం కుడిగట్టు, లోయర్ సీలేరు, అప్పర్ సీలేరు తదితర జల విద్యుత్ కేంద్రాల ద్వారా ఇప్పటికే 1,610 మెగావాట్లను ఉత్పత్తి చేస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు అనుబంధంగా 960 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను 2019 నవంబర్‌లో ప్రారంభించి శరవేగంగా నిర్మిస్తోంది. పోలవరం జల విద్యుత్ కేంద్రం కూడా పూర్తయితే రాష్ట్రంలో 2,570 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలో 2,596 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని అంచనా వేయగా.. అందులో 2,570 మెగావాట్లు(99 శాతం) ఉత్పత్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జల విద్యుత్ ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు సరసన ఆంధ్రప్రదేశ్ చేరిందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) వెల్లడించింది. దేశంలో జల విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలు.. ఇప్పటికే పూర్తయిన కేంద్రాల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్.. నిర్మాణంలో ఉన్న కేంద్రాలు పూర్తయితే అందుబాటులోకి వచ్చే విద్యుత్ తదితర అంశాలపై సీడబ్ల్యూసీ 2017–23 మధ్య సమగ్ర అధ్యయనం చేసింది. అధ్యయనంలో వెల్లడైన అంశాలపై కేంద్రానికి ఇటీవల నివేదిక ఇచి్చంది. ఆ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ.. సద్వినియోగం చేసుకున్నది 41.95 శాతమే దేశంలో హిమాలయ నదులు, ఈశాన్య రాష్ట్రాలు, ద్వీపకల్ప నదులు, జలపాతాలపై 1,48,701 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. ఇందులో 25 మెగావాట్లు, అంతకంటే ఎక్కువ సామర్థ్యంతో ఉత్పత్తి చేసే కేంద్రాల్లోనే 1,33,401.03 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తయిన జల విద్యుత్ కేంద్రాల ద్వారా 42,104.55 మెగావాట్లు (31.56 శాతం) విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యం 13,867.50 మెగావాట్లు (10.39 శాతం). అంటే.. ఇప్పటివరకు జల విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాల్లో 41.95 శాతం మాత్రమే సద్వినియోగం చేసుకున్నట్టు స్పష్టమవుతోంది. వివిధ కారణాల వల్ల నిర్మాణ దశలో ఆగిపోయిన కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యం 1,156 మెగావాట్లు (0.87 శాతం). 76,282 మెగావాట్లు (57.18 శాతం) ఉత్పత్తి చేసే కేంద్రాల నిర్మాణాన్ని ఇప్పటికీ చేపట్టలేదు.అరుణాచల్‌లో అవకాశాలు అపారం హిమాలయ నదులు ప్రవహించే రాష్ట్రాల కంటే ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు అపారంగా ఉన్నాయి. ఆ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు జల విద్యుత్ ఉత్పత్తికి అత్యంత అనుకూలం. అరుణాచల్ ప్రదేశ్‌లో 50,394 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. ఇప్పటికి నిర్మాణం పూర్తయిన కేంద్రాల్లో 1,115 మెగావాట్లు (2.21 శాతం) విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. చైనాతో సరిహద్దు సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితులు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణానికి అడ్డంకిగా మారాయి. దేశంలో అత్యధిక సామర్థ్యంతో జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్. ఆ రాష్ట్రంలో 18,305 మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం ఉంటే.. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన కేంద్రాల ద్వారా 10,263 మెగావాట్లు (56.07 శాతం) ఉత్పత్తి అవుతోంది. హిమాచల్‌ప్రదేశ్ తర్వాత అత్యధికంగా జల విద్యుత్ ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్, కర్ణాటక, జమ్మూకశీ్మర్ నిలిచాయి. -
హైడ్రో పవర్‌పై సింగరేణి ఫోకస్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బొగ్గు ఉత్పత్తితో మొదలైన సింగరేణి సంస్థ ఇప్పుడు తన పరిధి ని విస్తరిస్తోంది. ఇప్పటికే 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తూ మరో యూనిట్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. రాబోయే ఏడాదిన్నరలో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అందుబాటులో ఉన్న వనరుల ను ఉపయోగించుకోవడం ద్వారా సోలార్ –హైడ్రో పవర్‌పై కూడా దృష్టి పెట్టింది. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యం.. సింగరేణి సంస్థ ఆరు జిల్లాల పరిధిలోని 11 ఏరి యాల్లో విస్తరించి ఉంది. సంస్థ ఆధీనంలో 24 అండర్ గ్రౌండ్ మైన్లు, 19 ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. ఈ 11 ఏరియాల పరిధిలో గత కొన్నేళ్లుగా సింగరేణి సోలార్ పవర్ స్టేషన్లను నెలకొల్పుతోంది. ప్రస్తుతం సింగరేణి సోలార్ విద్యుత్ సామర్థ్యం 220 మెగావాట్లుగా ఉంది. మరికొన్ని నెలల్లో మరో 70 మెగావాట్ల యూనిట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంకో 200 మెగావాట్ల ప్లాంట్లను నెలకొల్పేందుకు ఇప్పటికే టెండర్లు ఆహా్వనించింది. 500 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తే సింగరేణి సంస్థ వాయు కాలుష్యం విషయంలో నెట్ జీరో సంస్థగా అవతరిస్తుంది. ఇక్కడితో ఆగకుండా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యంగా సింగరేణి అడుగులు వేస్తోంది. సోలార్ ‘డిమాండ్’ సోలార్ విద్యుత్ పగటి వేళలోనే ఉత్పత్తి అవుతుంది. సహజంగా ఆ సమయంలో విద్యుత్‌కు డిమాండ్ తక్కువగా ఉండి సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఎక్కువగా ఉంటుంది. రాత్రి వేళ ఉండే డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే మార్గాలపై ఇటీవల సింగరేణి ఫోకస్ చేస్తోంది. అందులో భాగంగా పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ టెక్నాలజీని ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. తద్వారా సింగరేణి సంస్థకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ సోలార్ పవర్ ద్వారా జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంపై ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. సోలార్ టూ హైడ్రో పవర్ పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ టెక్నాలజీలో నేల మట్టానికి దిగువ స్థాయిలో ఉన్న నీటిని మోటార్ల సాయంతో పైకి తోడుతారు. తిరిగి అదే నీటిని కిందకు వదులుతారు. నీరు కిందికి వెళ్లే మార్గంలో టర్బైన్లు ఏర్పాటు చేసి తద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. అమెరికా, యూరప్ దేశాల్లో ఈ విధానంలో చాలా విద్యుత్ కేంద్రాలు పని చేస్తున్నాయి. అందుబాటులోకి గ్రీన్ ఎనర్జీ.. పగటి వేళ అందుబాటులో ఉండే సోలార్ విద్యుత్ ద్వారా ఓపెన్‌కాస్ట్ మైన్స్‌లో ఉన్న నీటిని తోడి పై భాగంలో ఉన్న రిజర్వాయర్‌లో నింపుతారు. సాయంత్రం వేళ పీక్ అవర్స్‌లో విద్యుత్ డిమాండ్ ఉండే సమయంలో పైనున్న రిజర్వాయర్‌లో ఉండే నీటిని కిందికి పంపడం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ విధానంలో నీటిని తోడేందుకు ఉపయోగించిన సోలార్ విద్యుత్‌లో 80 శాతం తిరిగి ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. ఈ మొత్తం విధానంలో కార్బన్ ఉద్గారాలు విడుదల కావు. పూర్తిగా గ్రీన్ ఎనర్జీ అందుబాటులోకి వస్తుంది. వనరులపై దృష్టి.. ఓపెన్ కాస్ట్ విధానంలో నేలలో నిక్షిప్తమైన బొగ్గు కోసం భూమి పై పొరలను రెండు వందల మీటర్లకు పైగా తొలగిస్తారు. దీంతో భారీ గోతులు ఏర్పడుతాయి. ఇందులో సహజ నీటి ఊటలతో పాటు వర్షపు నీరు భారీగా చేరుకుంటుంది. బొగ్గు ఉత్పత్తి సమయంలో ఈ నీటిని ఎప్పటికప్పుడు భారీ మోటార్ల ద్వారా తోడేస్తారు. ఉత్పత్తి ఆగిపోయిన తర్వాత భారీ గోతులు, నీరు అక్కడే నిలిచి ఉంటాయి. ఇలా భారీగా నీరు నిల్వ ఉన్న ఓపెన్‌కాస్ట్ గనులు ఎక్కడ ఉన్నాయి.. ఈ మైన్స్‌కు సమీపంలో ఉపరితలంపై భారీ నీటి రిజర్వాయర్లు నిర్మించేందుకు అనువైన ఓపెన్‌కాస్ట్‌లు ఎక్కడున్నాయనే అంశంపై సింగరేణి దృష్టి సారించింది. -
గోదావరి– కావేరి అనుసంధానంపై వచ్చేనెలలో సీఎంల భేటీ
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరీ నదుల అనుసంధానంపై వచ్చేనెలలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ అధ్యక్షతన ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఈ మేరకు జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్డట్లూ్యడీఏ) రాష్ట్రాలకు ప్రాథమికంగా సమాచారం పంపించింది. ఈ రెండు నదుల అనుసంధానానికి సంబంధించి సవివర ప్రణాళిక నివేదిక(డీపీఆర్) త్వరలోనే రాష్ట్రాలకు పంపించి అ«ద్యయనం చేయడానికి గడువు ఇచ్చిన తర్వాత ఈనెలాఖరులో ఆయా ప్రభావిత రాష్ట్రాల నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శులు/కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ముసాయిదా డీపీఆర్‌ను ఎన్‌డబ్లు్యడీఏ హైదరాబాద్ విభాగం కేంద్రానికి పంపించింది. దీనికి ఎన్‌డబ్లు్యడీఏ ఆమోదముద్ర వేసిన వెంటనే సంబంధిత రాష్ట్రాలకు ఆ నివేదిక పంపిస్తారు. రెండు నదుల అనుసంధానికి రూ.74,329 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ప్రాజెక్టు చేపట్టిన ఐదేళ్లలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా అందులో పేర్కొన్నారు. ఈ పాజెక్టు పూర్తయితే ప్రతీ సంవత్సరం రూ.9824.49 కోట్ల మేరకు ఆదాయం సమకూరుతుందని లెక్కకట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపడతారు. దీనికి రూ.3381 కోట్లు అవుతుందని అంచనా. ఇక ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని149 టీఎంసీల నీటిని గోదావరి–కావేరి అనుసంధానం కింద తరలించాలని కేంద్రం భావిస్తున్న సంగతి విదితమే. ఒకవేళ ఛత్తీస్‌గఢ్ ఈ 140 టీఎంసీల నీటిని వినియోగించుకున్న పక్షంలో.. మహానది–గోదావరి మధ్య 230 టీఎంసీల నీటిని తరలించే ప్రక్రియ చేపడతామని కేంద్రం స్పష్టం చేసింది. వాటిని కావేరికి తరలిస్తామని వెల్లడించింది. ఇప్పటికే పలు సమావేశాల్లో గోదావరి–కావేరి నదుల అనుసంధానికి సంబంధించి సమ్మతి లభించింది. త్వరలోనే గోదావరి బోర్డు సమావేశం కూడా... గోదావరినది యాజమాన్య బోర్డు సమావేశం త్వరలోనే జరగనున్నట్టు సమాచారం. తదుపరి బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల సమాచారం అందులో చేర్చాలని ఏపీ ప్రభుత్వం గతంలో కోరింది. ఈ మేరకు బోర్డుకు ఏపీ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి లేఖ కూడా రాశారు. ఎల్లంపల్లి బ్యారేజీ పరిసర ప్రాంతాల్లోని ఎత్తిపోతల పథకాలతోపాటు కుప్తి, ఎస్సారెస్పీ రెండో దశ వినియోగం, ఇందిరమ్మ వరద నీటి కాలువ, కాళేశ్వరం అదనపు టీఎంసీల వినియోగంపై చర్చించాలని కోరింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి సమాచారం ఇవ్వాలని గోదావరి యాజమాన్య బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. సాగర్ నుంచి ఏపీకి 5 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాలకు 5 టీఎంసీల నీరు విడుదల చేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది. శ్రీశైలం కోటాను సాగర్‌కు మళ్లించింది. ఉమ్మడి జలాశయాల నుంచి ఇరు రాష్ట్రాలకు 80 టీఎంసీల నీటిని కేటాయించిన సంగతి తెలిసిందే. శ్రీశైలంలో కేటాయించిన నీటిని వినియోగించుకోలేకపోయామని, అందువల్ల నాగార్జునసాగర్ కుడికాలువ నుంచి ఐదు టీఎంసీల నీటి విడుదల చేయాలని ఏపీ కోరిక మేరకు బోర్డు అనుమతినిచి్చంది. బోర్డు ఆర్థిక పరిస్థితిపై ఈనెల 12వ తేదీన అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
‘కేంద్రం ఆమోదించిన డిజైన్ల మేరకే పోలవరం నిర్మాణం’
సాక్షి, ఢిల్లీ: పోలవరం ముంపు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తిశాఖ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన భేటీ ముగిసింది. ఈ భేటీకి ఏపీ, టీఎస్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల అధికారులతో జలశక్తిశాఖ సమావేశమైంది. ఈ భేటీకి ఏపీ నుంచి ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే పీపీఏ ఛైర్మన్ ఆర్కేగుప్తా.. గోదావరి ట్రిబ్యునల్‌కు కట్టుబడే పోలవరం కడుతున్నట్టు తెలిపారు. కేంద్రం ఆమోదించిన డిజైన్ల మేరకే పోలవరం నిర్మిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలను సంయుక్త సర్వేకు సహకరించాలని కోరాము. కాగా, సంయుక్త సర్వేకు ఒడిషా అంగికరించలేదని ఆయన వెల్లడించారు. పోలవరం కట్టినా గోదావరి వరద ముంపులో తేడా ఉండదు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయించామన్నారు. దీంతో, అక్టోబర్ 7వ తేదీన నాలుగు రాష్ట్రాల సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. వారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని జలశక్తిశాఖ పేర్కొంది. -
పోలవరం ముంపు రాష్ట్రలతో కేంద్ర జలశక్తిశాఖ కీలక భేటీ
-
సహజ వెలుగులు ప్రసరించాల్సిందే!
సాక్షి, అమరావతి: సహజ వెలుగుల వినియోగాన్ని పెంచడం ద్వారా వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మరోసారి దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర అవసరాలకు వినియోగించే విద్యుత్‌లో దాదాపు 25 శాతం విద్యుత్‌ను సౌర, పవన, జల విద్యుత్ ఉత్పత్తి నుంచే తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు 2022–23కి పునరుత్పాదక కొనుగోలు బాధ్యత (ఆర్పీవో)ను తాజాగా ప్రకటించింది. లక్ష్యాన్ని సాధించలేకపోతే జరిమానా.. గతేడాది 21 శాతంగా ఉన్న ఆర్పీవో అంతకుముందు రెండేళ్లలో వరుసగా 17 శాతం, 19 శాతంగా ఉంది. ఈ లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్ వంద శాతం పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా ఏపీతోపాటు గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు మాత్రమే నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్నాయని కేంద్రం తెలిపింది. లక్ష్యానికి తగ్గట్టుగా పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగించలేకపోయిన రాష్ట్రాల్లో యూనిట్‌కు 25 పైసల నుంచి 30 పైసల వరకూ తొలి ఏడాది జరిమానా విధించాలని కేంద్రం భావిస్తోంది. ఆ తర్వాత దాన్ని యూనిట్‌కు 35 పైసల నుంచి 50 పైసలకు పెంచాలనుకుంటోంది. ధరలను నిర్ణయించే అధికారం ఈఆర్సీదే.. 2030 చివరి నాటికి ఆర్‌పీవోను 43 శాతానికి పెంచుతామని కేంద్రం వెల్లడించింది. 2023–2030 మధ్య 24.61 శాతం నుంచి 43.33 శాతం వరకు ఆర్‌పీవోను పెంచుకుంటూ వెళ్లనుంది. దీనిలో పవన విద్యుత్ ఆర్పీవో లక్ష్యం.. 0.81–6.94 శాతం. కాగా జల విద్యుత్ 0.35–2.82 శాతం, సౌర విద్యుత్ 23.44–33.57 శాతంగా ఉంటుంది. రాష్ట్రాలు దీనికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. పునరుత్పాదక విదుŠయ్త్ ధరలను కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) నిర్ణయించనుంది. ఏపీలో ఆర్ఈ సామర్థ్యం 10,826 మెగావాట్లు.. దేశంలో 2040 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఈ ఏడాది చివరి నాటికి 175 గిగావాట్లు పూర్తి చేయాలనుకుంటోంది. కాగా రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ నాటికి పునరుత్పాదక విద్యుత్ (ఆర్ఈ) స్థాపిత సామర్థ్యం దాదాపు 10,826 మెగావాట్లకు చేరింది. దీనిలో 4,096.65 మెగావాట్లు పవన విద్యుత్, 3,490.48 మెగావాట్లు సౌర విద్యుత్, 1,610 మెగావాట్లు జల విద్యుత్, 566.04 మెగావాట్లు జీవ(బయో) విద్యుత్, 162.11 మెగావాట్లు చిన్న జల విద్యుత్, ఇతర పునరుత్పాదక విద్యుత్ 900.72 మెగావాట్లు ఉన్నాయి. -
IGI: ఇందిరాగాంధీ విమానాశ్రయం అరుదైన ఘనత
ఢిల్లీ: నగరంలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(IGI) అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే తొలి పూర్తిస్థాయి హైడ్రో, సోలార్ పవర్ ఎయిర్పోర్ట్ గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ ఎయిర్పోర్ట్ మొత్తం హైడ్రో, సోలార్ పవర్‌తోనే నడుస్తోంది. 2030 నాటికి.. పునరుత్పాదక ప్రయత్నంతో పూర్తిస్థాయి కార్బన్ ఉద్గార రహిత ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడంలో ఇది ఒక ప్రధాన అడుగు అని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (DIAL) ప్రకటించుకుంది. సుమారు రెండు లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంగా తెలిపింది. ఇదిలా ఉంటే.. 2036 దాకా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు హైడ్రోఎలక్ట్రిసిటీ సరఫరా చేసే ఉద్దేశంతో.. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది డయల్. కిందటి ఏడాది భారత్‌తో పాటు మధ్య ఆసియాలో ఉత్తమ ఎయిర్‌పోర్ట్‌గా గుర్తింపు దక్కించుకుంది ఐజీఐ. -
నీటి లభ్యత తేల్చాకే కావేరికి గోదావరి
సాక్షి, అమరావతి: గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాకే గోదావరి–కావేరి అనుసం ధానం చేపట్టాలని కేంద్రానికి రాష్ట్ర జలవనరుల శాఖ తేల్చిచెప్పింది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశం బుధవారం వర్చువల్ విధానంలో జరి గింది. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను నా గార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదు గా కావేరికి తరలించడానికి సమగ్ర ప్రాజెక్టు నివేది కను (డీపీఆర్‌ను) రాష్ట్రాలకు అందజేశామని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్‌సింగ్ చెప్పారు. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి గోదావరి–కావేరి అను సంధానంపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను విస్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న, భవిష్యత్తులో చేపట్టనున్న ప్రాజెక్టులకే గోదా వరి జలాలు సరిపోతాయని, నీటిలభ్యత ఎక్క డుందని జవహర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు లను పరిగణనలోకి తీసుకోకుండానే డీపీఆర్ రూపొందించారని ఆక్షేపించారు. గోదావరి వరద (మిగులు) జలాలపై పూర్తి హక్కును దిగువ రాష్ట్ర మైన ఆంధ్రప్రదేశ్‌కే గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిం దని గుర్తుచేశారు. ఏపీ అవసరాలు తీర్చాకే మిగిలి న జలాలను తరలించాలని స్పష్టం చేశారు. దీనిపై పంకజ్‌కుమార్ సానుకూలంగా స్పందించారు. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాలని భోపాల్‌సింగ్‌ను ఆదేశించారు. ఆ తర్వాతే బేసిన్ పరిధిలోని రాష్ట్రాలతో అనుసంధానంపై చర్చించాలని చెప్పారు. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించాకే అనుసంధానం పనులు చేపడతామని స్పష్టం చేశారు. కొత్త రిజర్వాయర్లు లేకుండా అనుసంధానమా? ఇచ్చంపల్లి నుంచి తరలించే గోదావరి జలాలను నాగార్జునసాగర్, సోమశిల రిజర్వాయర్లలో నిల్వ చేసి.. కావేరి బేసిన్‌కు తరలించేలా డీపీఆర్‌ను రూపొందించడంపై ఈఎన్సీ నారాయణరెడ్డి అభ్యంతరం తెలిపారు. నాగార్జునసాగర్, సోమశిలలో నిల్వచేసే జలాలు వాటి ఆయకట్టుకే సరి పోవడం లేదన్నారు. గోదావరి జలాల నిల్వకు కొత్త రిజర్వాయర్లు నిర్మించకుండా అనుసంధానం అసాధ్యమని చెప్పారు. దీనిపై పంకజ్‌కుమార్ స్పందిస్తూ కొత్త రిజర్వాయర్ల నిర్మాణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఎన్‌డబ్ల్యూడీఏకు సూచించారు. నీటి లభ్యత తేల్చాకే చర్చించాలి : తెలంగాణ గోదావరిలో నీటిలభ్యతను శాస్త్రీయంగా తేల్చా కే, కావేరికి నీటి తరలింపుపై చర్చించాలని తెలంగాణ కూడా అభిప్రాయపడింది. గోదావ రి జలాల్లో తమ వాటా నీటిని కావేరి బేసిన్‌కు తరలించడానికి అంగీకరించబోమని ఛత్తీస్‌ఘడ్ స్పష్టం చేసింది. కావేరి బేసిన్లో కర్ణాటకలోనే కరవు పీడిత ప్రాంతాలు ఎక్కువని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అందువల్ల గోదావరి జ లాల్లో వాటా ఇవ్వాలని కోరింది. ఉమ్మడి ఏపీ తో పోల్చితే కృష్ణా బేసిన్లో తమ రాష్ట్రంలోనే కరవు పీడిత ప్రాంతాలు అధికమైనందున కృష్ణా బేసిన్‌కు తరలించే గోదావరి జలాలకు బదులు కృష్ణాజలాల్లో అదనపు వాటా ఇవ్వాల ని కోరింది. మహారాష్ట్ర కూడా కృష్ణాజలాల్లో అద నపు వాటా ఇవ్వాలని కోరింది. కావేరి బేసి న్కు గోదావరి జలాలను తరలిస్తున్నందున, కావేరి జలాల పంపకంలో న్యాయం చేయాలని కేరళ కోరింది. గోదావరి–కావేరి అనుసంధా నంపై ఎలాంటి అభ్యంతరం లేదని ఒడిశా తెలిపింది. తీవ్ర నీటి ఎద్దడితో తల్లడిల్లుతున్న కావేరి బేసిన్‌కు గోదావరి జలాలను తరలించి ఆదుకోవాలని తమిళనాడు కోరింది. -
పదేళ్లలో 6 వేల మెగావాట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే పదేళ్లలో మరో 6 వేల మెగావాట్ల జల విద్యుదుత్పత్తి చేయాలని ఇంధనశాఖ లక్ష్యంగా నిర్ణయించింది. స్థిర విద్యుత్ ఇవ్వాలన్న కేంద్రం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పంప్డ్ స్టోరేజీలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 2030 జల విద్యుదుత్పత్తి ప్రణాళికను ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి వివరించారు. ► ప్రస్తుతం రాష్ట్రంలో 1,700 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా 2030 నాటికి 7,700 మెగావాట్లకు పెరగనుంది. ఫలితంగా చౌక విద్యుత్ లభిస్తుంది. మాచ్‌ఖండ్ కేంద్రం నుంచి మనకు యూనిట్ 90 పైసలకే లభిస్తోంది. ► పునరుత్పాదక ఇంధన వనరుల పీపీఏలు చేసుకోవాలంటే 30 శాతం వరకూ స్థిర విద్యుత్ (24 గంటలూ ఉత్పత్తి చేయగల విద్యుత్) అందుబాటులో ఉండాలని కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. మరో 10 వేల మెగావాట్లకుపైగా సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 6 వేల మెగావాట్ల జల విద్యుత్ అవసరం. ► ఆన్ రివర్ పంప్డ్ స్టోరేజీ, ఆఫ్ రివర్ పద్ధతుల్లో పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ ప్రాజెక్టులకు నెడ్‌క్యాప్ ప్రణాళికలు సిద్ధం చేసింది. 29 ప్రాంతాలను గుర్తించి డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నారు. 2030 నాటికి 6 వేల మెగావాట్ల జల విద్యుత్ అందుబాటులోకి వచ్చే వీలుందని నెడ్‌క్యాప్ ఎండీ రమణారెడ్డి వివరించారు. -
విద్యుత్ చార్జీలు.. ఏపీలోనే చౌక
సాక్షి, అమరావతి: దేశంలోని అనేక రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే విద్యుత్ చార్జీలు అతి తక్కువగా ఉన్నాయి. పేద, మధ్య తరగతికి బిల్లుల భారమేంటో కూడా తెలీకుండా చేసిన ఘనత ఏపీదే. విద్యుత్ సంస్థలు పుట్టెడు అప్పుల్లో ఉన్నా.. నిరుపేదలకు మాత్రం నామమాత్రపు చార్జీలే వసూలు చేయడంలో రాష్ట్రం ముందుంది. వాస్తవానికి విద్యుత్ కొనుగోళ్లే చార్జీలపై అత్యధిక ప్రభావం చూపుతాయి. గత ఐదేళ్లుగా అధిక ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేయడంవల్ల ప్రస్తుతం యూనిట్ విద్యుత్ చేరవేయడానికి రూ.6.48 ఖర్చవుతోంది. ఈ భారం ప్రజలపై వేయకుండా ప్రస్తుత ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో రూ.10,060.63 కోట్లు ఇచ్చింది. పేదలకు కరెంట్ షాక్ కొట్టకుండా గృహ విద్యుత్ సబ్సిడీ కింద రూ.1,707.07 కోట్లు ఇచ్చి చరిత్ర సృష్టించింది. జల విద్యుత్ ఉన్నా ఉత్తరాదిలో ఎక్కువే జల విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటే కొనుగోలు భారం చాలావరకూ తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో జల విద్యుత్ ఉత్పత్తి తక్కువ కాబట్టి ఈ అవకాశంలేదు. కానీ, ఉత్తరాది రాష్ట్రాల్లో మనకన్నా జల విద్యుత్ ఉత్పత్తే కీలకపాత్ర పోషిస్తోంది. ఇది యూనిట్ రూ.2లోపే లభించినా.. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం మనకన్నా ఎన్నో రెట్లు కరెంట్ చార్జీలు వసూలుచేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో యూనిట్‌కు ఏకంగా రూ.5.50 వసూలు చేస్తున్నారు. పరిశ్రమల నుంచి క్రాస్ సబ్సిడీ ఎక్కువగా వచ్చే మహారాష్ట్రలోనూ మధ్యతరగతి విద్యుత్ ధర ఏకంగా యూనిట్‌కు రూ.8.33 ఉంది. ఏపీలో ఈ తరహా మోత ఎక్కడా కనిపించదు. ఎంత తేడా? ఆంధ్రప్రదేశ్‌లో 1.45 కోట్ల మంది విద్యుత్ వినియోగదారుల్లో.. నెలకు 200 యూనిట్లు వాడే వారి సంఖ్య 1.29 కోట్లు. వీళ్లకు కనిష్టంగా యూనిట్‌కు రూ.1.45, గరిష్టంగా రూ.3.60 మాత్రమే ఉంది. కానీ, 21 రాష్ట్రాల్లోని విద్యుత్ చార్జీలను గమనిస్తే.. కనిష్టంగా యూనిట్‌కు రూ.2.65 నుంచి గరిష్టంగా యూనిట్‌కు రూ.8.33 వరకూ వసూలుచేస్తున్నారు. ఏపీలో మాత్రం 50 యూనిట్లలోపు విద్యుత్‌కు యూనిట్‌కు రూ.1.45 మాత్రమే తీసుకుంటోంది. అదే పశ్చిమబెంగాల్ రూ.5.37 వసూలు చేస్తోంది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కూడా రూ.3.70 టారిఫ్ అమలుచేస్తోంది. పేదలపై భారం పడకూడదనే.. వివిధ రాష్ట్రాల విద్యుత్ ధరలను పరిశీలించాకే మన రాష్ట్ర విద్యుత్ టారిఫ్ తయారుచేశాం. ఎన్ని కష్టాలున్నా పేదలపై కరెంట్ చార్జీల భారం పడకూడదనే ఆలోచనకే ప్రాధాన్యం ఇచ్చాం. అలాగే, కరెంట్ చార్జీల పెంపు ప్రజల జీవన ప్రమాణంపై ప్రభావం చూపకూడదనే ఆలోచన ఈ ఏడాది టారిఫ్ ఆర్డర్లో చూడవచ్చు. – నాగార్జునరెడ్డి, ఏపీఈఆర్సీ చైర్మన్ సర్కారు భరోసాతోనే తక్కువ చార్జీలు విద్యుత్ సంస్థలకు ఎంత ఆర్థిక భారం ఉన్నా.. కరెంట్ భారం ప్రజలకు గుదిబండ కాకూడదని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఆర్థిక లోటు మొత్తం తామే భరిస్తామని సర్కార్ ఇచ్చిన భరోసా కారణంగానే మిగతా రాష్ట్రాలకన్నా తక్కువ ధరలకే విద్యుత్ ఇవ్వగలుగుతున్నాం. – శ్రీకాంత్ నాగులాపల్లి, రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి -
పోలవరం నిర్మాణంలో భారీగా అవినీతి
-
‘పోలవరం’లో అవినీతిపై విచారణ జరపండి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ అందుతున్న ఫిర్యాదులపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని, ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16,000 కోట్ల నుంచి ఏకంగా రూ.58,000 కోట్లకు పెంచేశారని, ఎలాంటి టెండర్లు లేకుండా కేవలం నామినేషన్‌పై రూ.3,500 కోట్ల విలువైన పనులకు కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారని, అలాగే సహాయ పునరావాస(ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీలోనూ అక్రమాలకు పాల్పడ్డారని, వీటన్నింటిపై విచారణకు ఆదేశించాల్సిందిగా పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరుభాయ్ నరణ్భాయ్ పటేల్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తమ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవడం లేదని పిటిషన్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) కూడా పేర్కొందని గుర్తుచేశారు. పారదర్శకత లోపించింది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణంలో పారదర్శకత లోపించిందని పిటిషనర్లు తెలిపారు. అక్రమాలపై ఫిర్యాదు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం స్పందించింది. అక్రమాలపై ఎందుకు విచారణ జరపడం లేదని కేంద్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీపీ) తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ అంశం ఆంధ్రప్రదేశ్‌కు చెందినది కాబట్టి ఢిల్లీ హైకోర్టు పరిధిలోకి రాదని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ వాదన సరైంది కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న అక్రమాల విషయంలో పిటిషనర్ సమర్పించిన ఆధారాలపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. -
తోడి పారేస్తున్నాం..!
నైరుతీ రుతుపవనాలు ఆశించిన వర్షాన్ని ఇవ్వకపోవడంతో దేశంలో నీటి సంక్షోభం నెలకొంది. ఇప్పటికే చెన్నై, బెంగళూరు నగరాలు నీటి కొరతతో అల్లాడుతున్నాయనీ, 2020 నాటికి హైదరాబాద్, విజయవాడ సహా 21 నగరాల్లో తీవ్ర నీటి కొరత ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెన్నైలో ప్రజలకు అందించే నీటిపై రేషన్ విధించగా, బెంగళూరులో నీటికొరత కారణంగా కొత్త భవన నిర్మాణాలను ఐదేళ్లు నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్రం ఇప్పటికే జలశక్తి మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసింది. అవసరాల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతున్నప్పటికీ నీటి కొరత ఎందుకొచ్చింది? నీటి కోసం భారీ క్యూలైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించింది. మితిమీరిన వాడకం.. అమెరికా, చైనాలతో పోల్చుకుంటే భారత్‌లో భూగర్భ జలాలను మితిమీరి వాడేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మన అవసరాల్లో సగానికిపైగా భూగర్భ జలాలే తీరుస్తున్నాయి. ఇందులో సాగుకు 89 శాతం, గృçహావసరాలకు 9 శాతం, పారిశ్రామిక అవసరాలకు 2 శాతం వాడేస్తున్నాం. అయితే జనాభా పెరుగుదల, పట్టణీకరణ కారణంగా భూగర్భ జలాలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. ప్రజలకు మంచినీటి సరఫరాలోనూ తీవ్రమైన వ్యత్యాసాలు నమోదవుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఓ వ్యక్తికి రోజుకు 150 లీటర్ల నీరు కావాల్సి ఉండగా, దేశంలో 81 శాతం గృహాలకు రోజుకు 40 లీటర్ల నీటిని మాత్రమే ప్రభుత్వం సరఫరా చేయగలుగుతోంది. వరుణదేవుడు కరుణించినా.. దేశంలో నీటి కటకటకు ఇష్టారాజ్యంగా నీళ్లను వృథా చేయడం కూడా ఓ కారణమేనని సెంట్రల్ వాటర్ కమిషన్ చెబుతోంది. భారత్‌కు ఏటా 3,000 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు అవసరం. కానీ ఏటా 4 వేల బిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షం కురుస్తోంది. వాన నీటిని నిల్వ చేసుకోలేకపోవడంతో అదంతా వృథా అవుతోంది. వర్షపు నీటిలో 8 శాతాన్ని మాత్రమే సంరక్షిస్తున్నారు. నీటిని శుద్ధిచేసి పునర్వినియోగించే విషయంలోనూ భారత్ బాగా వెనుకబడింది. పైపుల ద్వారా సరఫరా అయ్యే నీటిలో 40 శాతం వృ«థా అవుతోంది. చుట్టంగా మారిన చట్టాలు.. భారత్‌లో ప్రస్తుతం భూగర్భ జలాల వినియోగ చట్టం–1882 ఇంకా అమలవుతోంది. దీనిప్రకారం భూయజమానికి తన ఇల్లు, పొలంలో భూగర్భ జలాలపై సర్వాధికారాలు ఉన్నాయి. దీంతో ప్రజలంతా ఇష్టానుసారం బోర్లు వేసి నీటిని తోడేస్తున్నారు. దీన్ని నియంత్రించేందుకు కేంద్రం 2011లో భూగర్భ జలాల నిర్వహణ బిల్లును రూపొందించింది. తమ భూముల్లోని నీటిని ఇష్టానుసారం వాడుకునే హక్కు ప్రజలకు ఉండదని నిబంధనలు చేర్చింది. అయితే నీటి అంశం రాష్ట్రాల జాబితాలో ఉండటంతో ఏకాభిప్రాయం సాధ్యం కాక ఇది మూలనపడింది. దీనికితోడు నదులు, సరస్సులు, చెరువుల ఆక్రమణలతో పరిస్థితి మరింత తీవ్రం అవుతోంది. పారిశ్రామికీకరణ కారణంగా గంగా తీరం లో 80 శాతం సరస్సులు తీవ్రంగా కలుషితమయ్యాయి. ‘2040 నాటికి మన దేశ జనాభాలో 40 శాతం మందికి తాగేందుకు నీళ్లు కూడా దొరకవు. 2021 నాటికి ఢిల్లీ సహా 21 నగరాల్లో భూగర్భ జలాలు కనుమరుగైపోతాయి’ అని నీటి నిర్వహణ నిపుణుడు రాజేంద్ర సింగ్ హెచ్చరించారు. దేశంపై ప్రభావం ► నీటి దుర్వినియోగం కొనసాగితే 2050 నాటికి భారత్ జీడీపీలో 6 శాతాన్ని కోల్పోతుంది. ► ఆరోగ్యం, వ్యవసాయం, స్థిర–చరాస్తి రంగాలపై నీటి కొరత తీవ్ర ప్రభావం చూపనుంది. ► స్మార్ట్ సిటీల జాబితాలో ఉన్న షోలాపూర్ (మహారాష్ట్ర)లో నీటిఎద్దడితో పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ► కలుషిత నీటితో 21% అంటు వ్యాధులు వ్యాపిస్తున్నాయి ఊ డయేరియా కారణంగా దేశవ్యాప్తంగా రోజుకు 1600 మంది చనిపోతున్నారు. -
‘లింగ’నమక్కి వద్ద సినిమా షూటింగ్ వద్దేవద్దు
చిత్రీకరణకు ఇచ్చిన అనుమతి రద్దు చేయాలని పరిసర ప్రేమికులు డిమాండ్ శివమొగ్గ : ప్రముఖ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రమైన లింగనమక్కి జలాశయం వద్ద ‘లింగ’ సినిమా షూటింగ్‌కు అనుమతి ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఉన్న ఈ జలాశయం వద్ద సినిమా చిత్రీకరణ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సరికాదని పరిసర ప్రేమికులు పేర్కొంటున్నారు. చిత్రీకరణకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని శివమొగ్గ నగర పరిసర ప్రేమికుల ఒక్కోట అధ్యక్షుడు పరిసర రమేశ్ ఆదివారం ఇక్కడ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా కోట్లాదిరూపాయల వ్యయంతో లింగనమక్కిడ్యాం వద్ద ఇప్పటకే సెట్టింగ్‌లు వే శారు.వందలాది మంది కళాకారులు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తే ఆర్ధికంగా నష్టపోవాల్సి వస్తుందనేది చిత్ర నిర్మాణయూనిట్ నిర్వాహకుల భయం. ఈ నేపథ్యంలో ఇక్కడ షూటింగ్‌ను త్వరగా ముగించాలని నిర్ణయించుకున్నారు. సినిమా షూటింగ్‌కు అనుమతి ఇవ్వడం సరికాదు జలాశయం వద్ద సినిమా షూటింగ్‌కు అనుమతి ఇవ్వడం సరైంది కాదని పరిసర పోరాటదారుడు పరిసర రమేశ్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. లింగనమక్కి డ్యాం ప్రదేశం అత్యంత సూక్ష్మమైందని, ఈ డ్యాం ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఉన్న నేపథ్యంలో వీడియో, ఫొటోల చిత్రీకరణను కూడా నిషేధించారని గుర్తు చేశారు. అయితే సినిమా చిత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అవైజ్ఞానికమని పేర్కొన్నారు. సినిమా చిత్రీకరణకు ఇచ్చిన అనుమతులను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులోనూ ఇక్కడ సినిమాల షూటింగ్‌లు నిర్వహించరాదని డిమాండ్ చేస్తూ ఈనెల 26 తేదీన శివమొగ్గ జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి మనవి పత్రం అందిస్తామని రమేశ్ పేర్కొన్నారు.