సాక్షి, అమరావతి: దేశంలోని అనేక రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే విద్యుత్ చార్జీలు అతి తక్కువగా ఉన్నాయి. పేద, మధ్య తరగతికి బిల్లుల భారమేంటో కూడా తెలీకుండా చేసిన ఘనత ఏపీదే. విద్యుత్ సంస్థలు పుట్టెడు అప్పుల్లో ఉన్నా.. నిరుపేదలకు మాత్రం నామమాత్రపు చార్జీలే వసూలు చేయడంలో రాష్ట్రం ముందుంది. వాస్తవానికి విద్యుత్ కొనుగోళ్లే చార్జీలపై అత్యధిక ప్రభావం చూపుతాయి. గత ఐదేళ్లుగా అధిక ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేయడంవల్ల ప్రస్తుతం యూనిట్ విద్యుత్ చేరవేయడానికి రూ.6.48 ఖర్చవుతోంది. ఈ భారం ప్రజలపై వేయకుండా ప్రస్తుత ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో రూ.10,060.63 కోట్లు ఇచ్చింది. పేదలకు కరెంట్ షాక్ కొట్టకుండా గృహ విద్యుత్ సబ్సిడీ కింద రూ.1,707.07 కోట్లు ఇచ్చి చరిత్ర సృష్టించింది.
జల విద్యుత్ ఉన్నా ఉత్తరాదిలో ఎక్కువే
జల విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటే కొనుగోలు భారం చాలావరకూ తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో జల విద్యుత్ ఉత్పత్తి తక్కువ కాబట్టి ఈ అవకాశంలేదు. కానీ, ఉత్తరాది రాష్ట్రాల్లో మనకన్నా జల విద్యుత్ ఉత్పత్తే కీలకపాత్ర పోషిస్తోంది. ఇది యూనిట్ రూ.2లోపే లభించినా.. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం మనకన్నా ఎన్నో రెట్లు కరెంట్ చార్జీలు వసూలుచేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో యూనిట్‌కు ఏకంగా రూ.5.50 వసూలు చేస్తున్నారు. పరిశ్రమల నుంచి క్రాస్ సబ్సిడీ ఎక్కువగా వచ్చే మహారాష్ట్రలోనూ మధ్యతరగతి విద్యుత్ ధర ఏకంగా యూనిట్‌కు రూ.8.33 ఉంది. ఏపీలో ఈ తరహా మోత ఎక్కడా కనిపించదు.
ఎంత తేడా?
ఆంధ్రప్రదేశ్‌లో 1.45 కోట్ల మంది విద్యుత్ వినియోగదారుల్లో.. నెలకు 200 యూనిట్లు వాడే వారి సంఖ్య 1.29 కోట్లు. వీళ్లకు కనిష్టంగా యూనిట్‌కు రూ.1.45, గరిష్టంగా రూ.3.60 మాత్రమే ఉంది. కానీ, 21 రాష్ట్రాల్లోని విద్యుత్ చార్జీలను గమనిస్తే.. కనిష్టంగా యూనిట్‌కు రూ.2.65 నుంచి గరిష్టంగా యూనిట్‌కు రూ.8.33 వరకూ వసూలుచేస్తున్నారు. ఏపీలో మాత్రం 50 యూనిట్లలోపు విద్యుత్‌కు యూనిట్‌కు రూ.1.45 మాత్రమే తీసుకుంటోంది. అదే పశ్చిమబెంగాల్ రూ.5.37 వసూలు చేస్తోంది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కూడా రూ.3.70 టారిఫ్ అమలుచేస్తోంది.
పేదలపై భారం పడకూడదనే..
వివిధ రాష్ట్రాల విద్యుత్ ధరలను పరిశీలించాకే మన రాష్ట్ర విద్యుత్ టారిఫ్ తయారుచేశాం. ఎన్ని కష్టాలున్నా పేదలపై కరెంట్ చార్జీల భారం పడకూడదనే ఆలోచనకే ప్రాధాన్యం ఇచ్చాం. అలాగే, కరెంట్ చార్జీల పెంపు ప్రజల జీవన ప్రమాణంపై ప్రభావం చూపకూడదనే ఆలోచన ఈ ఏడాది టారిఫ్ ఆర్డర్‌లో చూడవచ్చు.
– నాగార్జునరెడ్డి, ఏపీఈఆర్‌సీ చైర్మన్
సర్కారు భరోసాతోనే తక్కువ చార్జీలు
విద్యుత్ సంస్థలకు ఎంత ఆర్థిక భారం ఉన్నా.. కరెంట్ భారం ప్రజలకు గుదిబండ కాకూడదని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఆర్థిక లోటు మొత్తం తామే భరిస్తామని సర్కార్ ఇచ్చిన భరోసా కారణంగానే మిగతా రాష్ట్రాలకన్నా తక్కువ ధరలకే విద్యుత్ ఇవ్వగలుగుతున్నాం.
– శ్రీకాంత్ నాగులాపల్లి, రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి
విద్యుత్ చార్జీలు.. ఏపీలోనే చౌక
Published Sat, Feb 15 2020 3:26 AM | Last Updated on Sat, Feb 15 2020 4:47 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment