ఇప్పటికే 1,610 మెగావాట్ల ఉత్పత్తి
పోలవరం జల విద్యుత్ కేంద్రం పూర్తయితే అందుబాటులోకి మరో 960 మెగావాట్లు
దేశంలో 1,48,701 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం
నిర్మాణం పూర్తయిన కేంద్రాల్లో ప్రస్తుతం 42,104.55 మెగావాట్ల ఉత్పత్తి
కేంద్ర జలసంఘం అధ్యయనంలో వెల్లడి
సాక్షి, అమరావతి: జల విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ముందంజ వేసింది. శ్రీశైలం కుడిగట్టు, లోయర్ సీలేరు, అప్పర్ సీలేరు తదితర జల విద్యుత్ కేంద్రాల ద్వారా ఇప్పటికే 1,610 మెగావాట్లను ఉత్పత్తి చేస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు అనుబంధంగా 960 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను 2019 నవంబర్‌లో ప్రారంభించి శరవేగంగా నిర్మిస్తోంది.
పోలవరం జల విద్యుత్ కేంద్రం కూడా పూర్తయితే రాష్ట్రంలో 2,570 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలో 2,596 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని అంచనా వేయగా.. అందులో 2,570 మెగావాట్లు(99 శాతం) ఉత్పత్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జల విద్యుత్ ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు సరసన ఆంధ్రప్రదేశ్ చేరిందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) వెల్లడించింది.
దేశంలో జల విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలు.. ఇప్పటికే పూర్తయిన కేంద్రాల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్.. నిర్మాణంలో ఉన్న కేంద్రాలు పూర్తయితే అందుబాటులోకి వచ్చే విద్యుత్ తదితర అంశాలపై సీడబ్ల్యూసీ 2017–23 మధ్య సమగ్ర అధ్యయనం చేసింది. అధ్యయనంలో వెల్లడైన అంశాలపై కేంద్రానికి ఇటీవల నివేదిక ఇచి్చంది. ఆ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ..
సద్వినియోగం చేసుకున్నది 41.95 శాతమే
దేశంలో హిమాలయ నదులు, ఈశాన్య రాష్ట్రాలు, ద్వీపకల్ప నదులు, జలపాతాలపై 1,48,701 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. ఇందులో 25 మెగావాట్లు, అంతకంటే ఎక్కువ సామర్థ్యంతో ఉత్పత్తి చేసే కేంద్రాల్లోనే 1,33,401.03 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తయిన జల విద్యుత్ కేంద్రాల ద్వారా 42,104.55 మెగావాట్లు (31.56 శాతం) విద్యుత్ అందుబాటులోకి వచ్చింది.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యం 13,867.50 మెగావాట్లు (10.39 శాతం). అంటే.. ఇప్పటివరకు జల విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాల్లో 41.95 శాతం మాత్రమే సద్వినియోగం చేసుకున్నట్టు స్పష్టమవుతోంది. వివిధ కారణాల వల్ల నిర్మాణ దశలో ఆగిపోయిన కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యం 1,156 మెగావాట్లు (0.87 శాతం). 76,282 మెగావాట్లు (57.18 శాతం) ఉత్పత్తి చేసే కేంద్రాల నిర్మాణాన్ని ఇప్పటికీ చేపట్టలేదు.
అరుణాచల్‌లో అవకాశాలు అపారం
హిమాలయ నదులు ప్రవహించే రాష్ట్రాల కంటే ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు అపారంగా ఉన్నాయి. ఆ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు జల విద్యుత్ ఉత్పత్తికి అత్యంత అనుకూలం. అరుణాచల్ ప్రదేశ్‌లో 50,394 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. ఇప్పటికి నిర్మాణం పూర్తయిన కేంద్రాల్లో 1,115 మెగావాట్లు (2.21 శాతం) విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.
చైనాతో సరిహద్దు సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితులు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణానికి అడ్డంకిగా మారాయి. దేశంలో అత్యధిక సామర్థ్యంతో జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్. ఆ రాష్ట్రంలో 18,305 మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం ఉంటే.. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన కేంద్రాల ద్వారా 10,263 మెగావాట్లు (56.07 శాతం) ఉత్పత్తి అవుతోంది. హిమాచల్‌ప్రదేశ్ తర్వాత అత్యధికంగా జల విద్యుత్ ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్, కర్ణాటక, జమ్మూకశీ్మర్ నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment