
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ అందుతున్న ఫిర్యాదులపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని, ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16,000 కోట్ల నుంచి ఏకంగా రూ.58,000 కోట్లకు పెంచేశారని, ఎలాంటి టెండర్లు లేకుండా కేవలం నామినేషన్‌పై రూ.3,500 కోట్ల విలువైన పనులకు కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారని, అలాగే సహాయ పునరావాస(ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీలోనూ అక్రమాలకు పాల్పడ్డారని, వీటన్నింటిపై విచారణకు ఆదేశించాల్సిందిగా పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరుభాయ్ నరణ్‌భాయ్ పటేల్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తమ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవడం లేదని పిటిషన్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) కూడా పేర్కొందని గుర్తుచేశారు.
పారదర్శకత లోపించింది.
జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణంలో పారదర్శకత లోపించిందని పిటిషనర్లు తెలిపారు. అక్రమాలపై ఫిర్యాదు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం స్పందించింది. అక్రమాలపై ఎందుకు విచారణ జరపడం లేదని కేంద్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీపీ) తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ అంశం ఆంధ్రప్రదేశ్‌కు చెందినది కాబట్టి ఢిల్లీ హైకోర్టు పరిధిలోకి రాదని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ వాదన సరైంది కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న అక్రమాల విషయంలో పిటిషనర్ సమర్పించిన ఆధారాలపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.