![AP to hydel side with the Central Guidelines - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/9/POWER.jpg.webp?itok=QtTGVLZg)
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే పదేళ్లలో మరో 6 వేల మెగావాట్ల జల విద్యుదుత్పత్తి చేయాలని ఇంధనశాఖ లక్ష్యంగా నిర్ణయించింది. స్థిర విద్యుత్ ఇవ్వాలన్న కేంద్రం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పంప్డ్ స్టోరేజీలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 2030 జల విద్యుదుత్పత్తి ప్రణాళికను ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి వివరించారు.
► ప్రస్తుతం రాష్ట్రంలో 1,700 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా 2030 నాటికి 7,700 మెగావాట్లకు పెరగనుంది. ఫలితంగా చౌక విద్యుత్ లభిస్తుంది. మాచ్‌ఖండ్ కేంద్రం నుంచి మనకు యూనిట్ 90 పైసలకే లభిస్తోంది.
► పునరుత్పాదక ఇంధన వనరుల పీపీఏలు చేసుకోవాలంటే 30 శాతం వరకూ స్థిర విద్యుత్ (24 గంటలూ ఉత్పత్తి చేయగల విద్యుత్) అందుబాటులో ఉండాలని కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. మరో 10 వేల మెగావాట్లకుపైగా సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 6 వేల మెగావాట్ల జల విద్యుత్ అవసరం.
► ఆన్ రివర్ పంప్డ్ స్టోరేజీ, ఆఫ్ రివర్ పద్ధతుల్లో పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ ప్రాజెక్టులకు నెడ్‌క్యాప్ ప్రణాళికలు సిద్ధం చేసింది. 29 ప్రాంతాలను గుర్తించి డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నారు. 2030 నాటికి 6 వేల మెగావాట్ల జల విద్యుత్ అందుబాటులోకి వచ్చే వీలుందని నెడ్‌క్యాప్ ఎండీ రమణారెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment