నైరుతీ రుతుపవనాలు ఆశించిన వర్షాన్ని ఇవ్వకపోవడంతో దేశంలో నీటి సంక్షోభం నెలకొంది. ఇప్పటికే చెన్నై, బెంగళూరు నగరాలు నీటి కొరతతో అల్లాడుతున్నాయనీ, 2020 నాటికి హైదరాబాద్, విజయవాడ సహా 21 నగరాల్లో తీవ్ర నీటి కొరత ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెన్నైలో ప్రజలకు అందించే నీటిపై రేషన్ విధించగా, బెంగళూరులో నీటికొరత కారణంగా కొత్త భవన నిర్మాణాలను ఐదేళ్లు నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్రం ఇప్పటికే జలశక్తి మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసింది. అవసరాల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతున్నప్పటికీ నీటి కొరత ఎందుకొచ్చింది? నీటి కోసం భారీ క్యూలైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించింది.
మితిమీరిన వాడకం..
అమెరికా, చైనాలతో పోల్చుకుంటే భారత్‌లో భూగర్భ జలాలను మితిమీరి వాడేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మన అవసరాల్లో సగానికిపైగా భూగర్భ జలాలే తీరుస్తున్నాయి. ఇందులో సాగుకు 89 శాతం, గృçహావసరాలకు 9 శాతం, పారిశ్రామిక అవసరాలకు 2 శాతం వాడేస్తున్నాం. అయితే జనాభా పెరుగుదల, పట్టణీకరణ కారణంగా భూగర్భ జలాలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. ప్రజలకు మంచినీటి సరఫరాలోనూ తీవ్రమైన వ్యత్యాసాలు నమోదవుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఓ వ్యక్తికి రోజుకు 150 లీటర్ల నీరు కావాల్సి ఉండగా, దేశంలో 81 శాతం గృహాలకు రోజుకు 40 లీటర్ల నీటిని మాత్రమే ప్రభుత్వం సరఫరా చేయగలుగుతోంది.
వరుణదేవుడు కరుణించినా..
దేశంలో నీటి కటకటకు ఇష్టారాజ్యంగా నీళ్లను వృథా చేయడం కూడా ఓ కారణమేనని సెంట్రల్ వాటర్ కమిషన్ చెబుతోంది. భారత్‌కు ఏటా 3,000 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు అవసరం. కానీ ఏటా 4 వేల బిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షం కురుస్తోంది. వాన నీటిని నిల్వ చేసుకోలేకపోవడంతో అదంతా వృథా అవుతోంది. వర్షపు నీటిలో 8 శాతాన్ని మాత్రమే సంరక్షిస్తున్నారు. నీటిని శుద్ధిచేసి పునర్వినియోగించే విషయంలోనూ భారత్ బాగా వెనుకబడింది. పైపుల ద్వారా సరఫరా అయ్యే నీటిలో 40 శాతం వృ«థా అవుతోంది.
చుట్టంగా మారిన చట్టాలు..
భారత్‌లో ప్రస్తుతం భూగర్భ జలాల వినియోగ చట్టం–1882 ఇంకా అమలవుతోంది. దీనిప్రకారం భూయజమానికి తన ఇల్లు, పొలంలో భూగర్భ జలాలపై సర్వాధికారాలు ఉన్నాయి. దీంతో ప్రజలంతా ఇష్టానుసారం బోర్లు వేసి నీటిని తోడేస్తున్నారు. దీన్ని నియంత్రించేందుకు కేంద్రం 2011లో భూగర్భ జలాల నిర్వహణ బిల్లును రూపొందించింది. తమ భూముల్లోని నీటిని ఇష్టానుసారం వాడుకునే హక్కు ప్రజలకు ఉండదని నిబంధనలు చేర్చింది. అయితే నీటి అంశం రాష్ట్రాల జాబితాలో ఉండటంతో ఏకాభిప్రాయం సాధ్యం కాక ఇది మూలనపడింది. దీనికితోడు నదులు, సరస్సులు, చెరువుల ఆక్రమణలతో పరిస్థితి మరింత తీవ్రం అవుతోంది. పారిశ్రామికీకరణ కారణంగా గంగా తీరం లో 80 శాతం సరస్సులు తీవ్రంగా కలుషితమయ్యాయి. ‘2040 నాటికి మన దేశ జనాభాలో 40 శాతం మందికి తాగేందుకు నీళ్లు కూడా దొరకవు. 2021 నాటికి ఢిల్లీ సహా 21 నగరాల్లో భూగర్భ జలాలు కనుమరుగైపోతాయి’ అని నీటి నిర్వహణ నిపుణుడు రాజేంద్ర సింగ్ హెచ్చరించారు.
దేశంపై ప్రభావం
► నీటి దుర్వినియోగం కొనసాగితే 2050 నాటికి భారత్ జీడీపీలో 6 శాతాన్ని కోల్పోతుంది.
► ఆరోగ్యం, వ్యవసాయం, స్థిర–చరాస్తి రంగాలపై నీటి కొరత తీవ్ర ప్రభావం చూపనుంది.
► స్మార్ట్ సిటీల జాబితాలో ఉన్న షోలాపూర్ (మహారాష్ట్ర)లో నీటిఎద్దడితో పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయి.
► కలుషిత నీటితో 21% అంటు వ్యాధులు వ్యాపిస్తున్నాయి ఊ డయేరియా కారణంగా దేశవ్యాప్తంగా రోజుకు 1600 మంది చనిపోతున్నారు.
తోడి పారేస్తున్నాం..!
Published Mon, Jul 1 2019 3:58 AM | Last Updated on Mon, Jul 1 2019 1:24 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment