![Bengaluru Suffers From Water Related Issues Says Sitharaman - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/7/nirmala-sitharaman_0.jpg.webp?itok=RWfCYZ2z)
బెంగళూరు: గత కొన్ని రోజులుగా బెంగళూరులో నీటి సమస్య ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిపైన కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' స్పందించారు. సిద్ధరామయ్య ప్రభుత్వంపై మండిపడ్డారు. గత ఏడాది కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అనేక నీటిపారుదల, నీటి సంబంధిత ప్రాజెక్టుల కార్యక్రమాలను నిలిపివేసినట్లు ఆరోపించారు.
బెంగళూరు నగరం నీటి సమస్యలతో ఇబ్బందిపడటం చాలా బాధాకరం అని నిర్మలా సీతారామన్ అన్నారు. మే 2023లో విశ్వేశ్వరయ్య జల నిగమ్ లిమిటెడ్, కర్ణాటక నీరవారి నిగమ్ లిమిటెడ్, కావేరి నీరవారి నిగమ లిమిటెడ్, కృష్ణా భాగ్య జల నిగమ్ లిమిటెడ్ వంటి ప్రాజెక్టుల కోసం రూ.20,000 కోట్ల విలువైన టెండర్లను ముఖ్యమంత్రి నిలిపివేశారని ఆమె ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘జల్ జీవన్ మిషన్’ను రాష్ట్రంలో ఎందుకు ప్రోత్సహించడం లేదని ఆమె ప్రశ్నించారు.
కర్ణాటకలో శాంతి భద్రతలు తగ్గిపోయాయి. బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు, అసెంబ్లీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడం వంటి ఘటనలే దీనికి ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక బాధ్యతాయుతమైన మంత్రి హిందూ టెర్రర్ అనే పదాన్ని సృష్టించాడని సీతారామన్ పేర్కొన్నారు.
దావణగరే లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి గాయత్రి సిద్ధేశ్వరపై కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వ్యాఖ్యలను సీతారామన్ తప్పుబట్టారు. ఇలాంటి మాటలు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని అన్నారు.
కరువు సహాయ నిధుల జాప్యంపై అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. కర్ణాటక ప్రభుత్వం అక్టోబర్‌లో మెమోరాండం సమర్పించిందని, ఆ తరువాత కేంద్ర బృందం ఇక్కడికి వచ్చి స్పాట్ అసెస్‌మెంట్ నిర్వహించిందని వివరించారు. కరువు సహాయం విడుదల చేయడానికి కొన్ని విధానాలను అనుసరించాల్సి ఉందని, దీనికి సమయం పట్టిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment