water shortage problem
-
వేసవి రాకమునుపే తాగునీటి కష్టాల
విజయపుర (బెంగళూరు గ్రామీణ): రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వేసవి కాలం రాకనే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. విజయపుర పట్టణంలోని పురసభ పరిధిలోని 16వ వార్డులో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ పురసభ ట్యాంకర్ల ద్వారా అందించే నీరు కూడా నిలిచిపోయింది. దీంతో ప్రజలు సోమవారం ఖాళీ బిందెలతో పురసభ వద్ద నిరసన తెలిపారు. -
తోడి పారేస్తున్నాం..!
నైరుతీ రుతుపవనాలు ఆశించిన వర్షాన్ని ఇవ్వకపోవడంతో దేశంలో నీటి సంక్షోభం నెలకొంది. ఇప్పటికే చెన్నై, బెంగళూరు నగరాలు నీటి కొరతతో అల్లాడుతున్నాయనీ, 2020 నాటికి హైదరాబాద్, విజయవాడ సహా 21 నగరాల్లో తీవ్ర నీటి కొరత ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెన్నైలో ప్రజలకు అందించే నీటిపై రేషన్ విధించగా, బెంగళూరులో నీటికొరత కారణంగా కొత్త భవన నిర్మాణాలను ఐదేళ్లు నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్రం ఇప్పటికే జలశక్తి మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసింది. అవసరాల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతున్నప్పటికీ నీటి కొరత ఎందుకొచ్చింది? నీటి కోసం భారీ క్యూలైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించింది. మితిమీరిన వాడకం.. అమెరికా, చైనాలతో పోల్చుకుంటే భారత్‌లో భూగర్భ జలాలను మితిమీరి వాడేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మన అవసరాల్లో సగానికిపైగా భూగర్భ జలాలే తీరుస్తున్నాయి. ఇందులో సాగుకు 89 శాతం, గృçహావసరాలకు 9 శాతం, పారిశ్రామిక అవసరాలకు 2 శాతం వాడేస్తున్నాం. అయితే జనాభా పెరుగుదల, పట్టణీకరణ కారణంగా భూగర్భ జలాలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. ప్రజలకు మంచినీటి సరఫరాలోనూ తీవ్రమైన వ్యత్యాసాలు నమోదవుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఓ వ్యక్తికి రోజుకు 150 లీటర్ల నీరు కావాల్సి ఉండగా, దేశంలో 81 శాతం గృహాలకు రోజుకు 40 లీటర్ల నీటిని మాత్రమే ప్రభుత్వం సరఫరా చేయగలుగుతోంది. వరుణదేవుడు కరుణించినా.. దేశంలో నీటి కటకటకు ఇష్టారాజ్యంగా నీళ్లను వృథా చేయడం కూడా ఓ కారణమేనని సెంట్రల్ వాటర్ కమిషన్ చెబుతోంది. భారత్‌కు ఏటా 3,000 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు అవసరం. కానీ ఏటా 4 వేల బిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షం కురుస్తోంది. వాన నీటిని నిల్వ చేసుకోలేకపోవడంతో అదంతా వృథా అవుతోంది. వర్షపు నీటిలో 8 శాతాన్ని మాత్రమే సంరక్షిస్తున్నారు. నీటిని శుద్ధిచేసి పునర్వినియోగించే విషయంలోనూ భారత్ బాగా వెనుకబడింది. పైపుల ద్వారా సరఫరా అయ్యే నీటిలో 40 శాతం వృ«థా అవుతోంది. చుట్టంగా మారిన చట్టాలు.. భారత్‌లో ప్రస్తుతం భూగర్భ జలాల వినియోగ చట్టం–1882 ఇంకా అమలవుతోంది. దీనిప్రకారం భూయజమానికి తన ఇల్లు, పొలంలో భూగర్భ జలాలపై సర్వాధికారాలు ఉన్నాయి. దీంతో ప్రజలంతా ఇష్టానుసారం బోర్లు వేసి నీటిని తోడేస్తున్నారు. దీన్ని నియంత్రించేందుకు కేంద్రం 2011లో భూగర్భ జలాల నిర్వహణ బిల్లును రూపొందించింది. తమ భూముల్లోని నీటిని ఇష్టానుసారం వాడుకునే హక్కు ప్రజలకు ఉండదని నిబంధనలు చేర్చింది. అయితే నీటి అంశం రాష్ట్రాల జాబితాలో ఉండటంతో ఏకాభిప్రాయం సాధ్యం కాక ఇది మూలనపడింది. దీనికితోడు నదులు, సరస్సులు, చెరువుల ఆక్రమణలతో పరిస్థితి మరింత తీవ్రం అవుతోంది. పారిశ్రామికీకరణ కారణంగా గంగా తీరం లో 80 శాతం సరస్సులు తీవ్రంగా కలుషితమయ్యాయి. ‘2040 నాటికి మన దేశ జనాభాలో 40 శాతం మందికి తాగేందుకు నీళ్లు కూడా దొరకవు. 2021 నాటికి ఢిల్లీ సహా 21 నగరాల్లో భూగర్భ జలాలు కనుమరుగైపోతాయి’ అని నీటి నిర్వహణ నిపుణుడు రాజేంద్ర సింగ్ హెచ్చరించారు. దేశంపై ప్రభావం ► నీటి దుర్వినియోగం కొనసాగితే 2050 నాటికి భారత్ జీడీపీలో 6 శాతాన్ని కోల్పోతుంది. ► ఆరోగ్యం, వ్యవసాయం, స్థిర–చరాస్తి రంగాలపై నీటి కొరత తీవ్ర ప్రభావం చూపనుంది. ► స్మార్ట్ సిటీల జాబితాలో ఉన్న షోలాపూర్ (మహారాష్ట్ర)లో నీటిఎద్దడితో పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ► కలుషిత నీటితో 21% అంటు వ్యాధులు వ్యాపిస్తున్నాయి ఊ డయేరియా కారణంగా దేశవ్యాప్తంగా రోజుకు 1600 మంది చనిపోతున్నారు. -
ఘనపురం.. దయనీయం
రోహిణిలో తుకం పోసి .. ఆరుద్రలో నాటేసే రైతన్నను అప్పట్లో మోతుబరి రైతు అనేవారు. ప్రస్తుతం ఆరుద్ర వచ్చినా తుకం పోసే పరిస్థితి లేదు. కార్తెలు కదులుతున్నా.. చినుకు కనిపించడం లేదు. వానాకాలం వచ్చినా ఎండల తీవ్రత తగ్గడం లేదు. మంజీర జీర బోయింది. నమ్ముకున్న ఘనపురం ఎడారిలా మారింది. ఇటీవల కురిసిన తేలిక పాటి వర్షాలతో దుక్కులు దున్నిన రైతన్నలు దిక్కులు చూస్తున్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో రుతుపవనాలొచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వరుణుడు కరుణిస్తే గాని ఘనపురం ప్రాజెక్టుకు గ్రహణం వీడే పరిస్థితి కనిపించడం లేదు. అటు వర్షాలు కురవక.. ఇటు ప్రాజెక్టులో చుక్కనీరు లేక ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సాక్షి, మెదక్: మెతుకు సీమ రైతన్నల జీవనాధారం ఘనపురం ప్రాజెక్టు. 1905లో నిర్మించిన ఈ ప్రాజెక్టు నిల్వ నీటి సామర్థ్యం 0.2 టీఎంసీలు. ఆనకట్టకు మహబూబ్‌నహర్ (ఎంఎన్), ఫతేనహర్ కెనాల్ (ఎఫ్ఎన్) ఉన్నాయి. ఎంఎన్ కెనాల్ పొడవు 42.80 కి.మీ. దీనిద్వారా కొల్చారం, మెదక్, మెదక్ రూరల్, హవేలి ఘనపూర్ మండలాల్లోని 18 గ్రామాల కింద 11,425 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. ఎఫ్ఎన్ కెనాల్ పొడవు 12.80 కి.మీ. దీని ద్వారా పాపన్నపేట మండలంలోని 11 గ్రామాల పరిధిలోని 10, 200 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. మొత్తం సాగు భూమి 21,625 ఎకరాలు. ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టు నిండితే గాని దిగువన ఉన్న ఘనపురం ప్రాజక్టుకు జలకళ రాదు. మంజీర వరదలు వస్తేనే ఘనపురం గలగలలు కనిపిస్తాయి. ఎడారిలా మారిన సింగూరు.. ఘనపురం వేసవిలో మండిన ఎండలతో సింగూరు బీటలు వారింది. 29 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులో ప్రస్తుతం 0.6 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.ç 0.2 టీఎంసీల సామర్థ్యం గల ఘనపురం ప్రాజెక్టు చుక్క నీరు లేక ఎడారిని తలపిస్తోంది. ఖరీఫ్ సీజన్ కోసం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. గత రబీలో కొంతమంది మంజీర నదిలో రింగు బోర్లు వేసి, రేయింబవళ్లు కష్టపడి పంట దక్కించుకున్నారు. మరి కొన్ని పంటలు నిలువునా ఎండిపోయాయి. ఘనపురం ప్రాజెక్టు కింద సుమారు నాలుగు వేల ఎకరాల పంట ఎండిపోయింది. కార్తెలు కదిలి పోతున్నా కానరాని చినుకు ఖరీఫ్ సీజన ఆరంభమై .. కార్తెలు కదిలి పోతున్నా చినుకు జాడ కానరావడం లేదు. రోహిణిలో తుకా లు పోస్తే మంచి దిగుబడులు వస్తాయంటారు. కాని ఆరుద్ర సగం పాదం ముగిసినా వరుణుడు కరుణించడం లేదు. ఎండలు ఇంకా మండిపోతూనే ఉన్నాయి. ఇటీవల మృగసిర రోజున కురి సిన కొద్దిపాటి వర్షాలకు తోడు బోర్లు ఉన్న రైతు లు దుక్కులు సిద్ధం చేసుకుంటుండగా, 80 శాతం మంది దుక్కుల కోసం దిక్కులు చూస్తున్నారు. రబీ ముంచింది.. ఖరీఫ్ పైనే ఆశలు గత రబీలో మంజీరను నమ్ముకొని పంటలు వేస్తే ఉన్న ఎకరంన్నర పంట ఎండి పోయింది. తిండి గింజలే దొరకని పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్‌లో పంట వేద్దామంటే ఇప్పటి వరకు దుక్కులు దిక్కులేవు. చినుకు రాలడం లేదు. ఎలా గడుస్తుందోనని ఆందోళనగా ఉంది. –సాలె కుమార్, రైతు, కొడుపాక -
కందకాల ద్వారా పరిశ్రమకు, తోటకు నీటి భద్రత!
ఈ ఏడాది చెప్పుకోదగ్గ వర్షం కురవకపోయినా.. సంగారెడ్డి జిల్లా పసలవాది గ్రామ పరిధిలో ఒక పరిశ్రమకు, దాని పక్కనే ఉన్న మామిడి తోట, వరి పొలానికి నీటి కొరత లేదు! ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఇది నిజం. ఇందులో మాయ మంత్రాలేమీ లేవు. ఇది కేవలం కందకాల మహత్మ్యం! అది 13.5 ఎకరాల భూమి. అందులో రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించిన పెద్ద ఇండస్ట్రియల్ షెడ్ ఉంది. కొద్ది సంవత్సరాల క్రితం దీన్ని వత్సవాయి కేశవరాజు కొనుగోలు చేశారు. అప్పటికి ఒకటే బోరు ఉంది. మరో 4, 5 చోట్ల బోరు వేశారు. చుక్క నీరు పడలేదు. ఇక ఉన్న బోరే దిక్కయింది. స్టెయిన్లెస్ స్టీల్ పైపుల తయారీ పరిశ్రమ అది. పరిశ్రమకు నీరు అవసరం ఉంటుంది. ఆరు ఎకరాల్లో మామిడి మొక్కలు నాటారు. మిగతా భూమిలో కంది తదితర పంటలు పండించే వారు. ఎండాకాలంలో బోరుకు నీరు తగినంత అందేది కాదు. ఆగి, ఆగి పోసేది. అటువంటి పరిస్థితుల్లో మిత్రుడు ప్రకాశ్‌రెడ్డి సూచన మేరకు వాన నీటి సంరక్షణ చేపట్టి నీటి భద్రత పొందాలన్న ఆలోచన కలిగింది. కందకాలతో స్వల్ప ఖర్చుతోనే నీటి భద్రత పొందవచ్చని ‘సాక్షి’ దినపత్రిక ద్వారా తెలుసుకొని.. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షులు సంగెం చంద్రమౌళి(984 956 6009)ని సంప్రదించి, ఆయన పర్యవేక్షణలో 2015లో కందకాలు తవ్వించారు. ఇండస్ట్రియల్ షెడ్‌పై నుంచి పడే వర్షపు నీరు మొత్తం అంతకు ముందు వృథాగా బయటకు వెళ్లిపోయేది. ఆ నీటిని మొత్తాన్నీ భూమిలోకి ఇంకేలా చంద్రమౌళి దగ్గరుండి మీటరు లోతు, మీటరు వెడల్పున కందకాలు తవ్వించారు. కందకాలు నిండినా నీరు బయటకు పోకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. అప్పటి నుంచి ఎంత వర్షం పడినా నీరంతా భూమిలోకి ఇంకుతూ ఉన్నది. ఫలితంగా నీటికి వెతుక్కోవాల్సిన పని లేకుండాపోయిందని కేశవరాజు ‘సాగుబడి’కి తెలిపారు.పరిశ్రమకు, డ్రిప్‌తో పెరుగుతున్న మామిడి తోటకు ఈ మూడేళ్లలో ఎటువంటి నీటి కొరతా రాలేదన్నారు. మామిడితోపాటు జామ, బత్తాయి మొక్కలు సైతం నాటామని, సేంద్రియ పద్ధతుల్లో జీవామృతం తదితరాలతోనే సాగు చేస్తున్నామన్నారు. కందకాలు తవ్వి చుక్క నీరు వృథాగా పోకుండా ఇంకింపజేయడం వల్ల నీటికి కొరత లేకుండా పనులు సాఫీగా జరుగుతున్నాయన్నారు. ఈ ఏడాది ఇంతవరకు చెప్పుకోదగ్గ వర్షం పడకపోయినప్పటికీ.. నీటి కొరత లేని కారణంగా.. రెండెకరాల్లో తెలంగాణ సోనా వరి సాగు చేస్తున్నామని కేశవరాజు (98489 90129) సంతోషంగా చెప్పారు. -
దయచేసి వినండి...రైళ్లలో నీళ్లు లేవు!
► రైళ్లలో మధ్యలోనే ఖాళీ అవుతున్న నీటి ట్యాంకులు ► పర్యవేక్షణ మరిచిన రైల్వే అధికారులు ► ప్రైవేటుకు అప్పగించి చోద్యం చూస్తున్న వైనం ► ఫిర్యాదులు ఎక్కువేమీ రావడం లేదంటూ సన్నాయి నొక్కులు గోదావరి ఎక్స్‌ప్రెస్.. విశాఖ నుంచి సాయంత్రం బయల్దేరింది.. అర్ధరాత్రి విజయవాడ దాటింది.. ఇంతలో రైల్లో నీళ్లు అయిపోయాయి.. ఏసీ బోగీల్లో తప్ప ఎక్కడా నీటి సరఫరా లేదు.. దీంతో టాయిలెట్లకు వెళ్లే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది! గౌతమి ఎక్స్‌ప్రెస్.. కాకినాడ నుంచి బయల్దేరి రాత్రి 12.30కు విజయవాడ స్టేషన్ చేరుకుంది. రైలు ఆగగానే ప్రయాణికులు ఖాళీ వాటర్ బాటిల్స్ పట్టుకొని ప్లాట్‌ఫాంలపై ఉన్న నీటి కుళాయిల వద్దకు పరుగుపెట్టారు. రైల్లో నీటి సరఫరా లేకపోవటమే ఇందుకు కారణం!! సాక్షి, హైదరాబాద్: ఇది ఈ రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకే పరిమితమైన సమస్య కాదు. కొంతకాలంగా చాలా రైళ్లలో ప్రయాణికులు ఇవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైలు బయల్దేరిన నాలుగైదు గంటల్లో నీటి కొరత సమస్య తలెత్తుతోంది. ఏసీ బోగీల్లో తప్ప మిగతాచోట్ల ఎక్కడా నల్లాల్లో నీళ్లు రావటం లేదు. టాయిలెట్లలో కూడా నీళ్లు రాక ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. టీసీలకు చెబుతున్నా ఈ సమస్య పరిష్కారం కావటం లేదు. దీంతో రైలు ఆగగానే ప్లాట్‌ఫాంపై ఉండే కుళాయిల వద్ద ఖాళీ సీసాల్లో నీళ్లు నింపుకోవాల్సి వస్తోంది. అత్యవసరమైన వాళ్లు మినరల్ వాటర్ బాటిల్స్ కొనుక్కోవాల్సి వస్తోంది. రాత్రి పూట తిరిగే రైళ్లలో ఈ సమస్య అధికంగా ఉంటోంది. నీళ్లు నింపే దగ్గరే సమస్య రైలు బయల్దేరే ముందే బోగీల్లో నీళ్లను నింపుతారు. ట్రాక్‌ను ఆనుకుని ఉండే నీటి పైపులైన్ ద్వారా ప్రతిబోగీలో ట్యాంకులు నింపాలి. వాడకం ఎక్కువై నీళ్లు అయిపోతే మరో పెద్ద స్టేషన్లో నింపాలి. దీనికి ప్రత్యేకంగా నీళ్లను నింపేందుకు కొన్ని స్టేషన్లు కేటాయిస్తారు. సికింద్రాబాద్, కాచిగూడ, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి తదితర స్టేషన్లలో నింపాలి. గతంలో గోదావరి, గౌతమిలాంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు విజయవాడలో నీటిని నింపేవారు. గోదావరి ఎక్స్‌ప్రెస్ బయల్దేరే సమయంలో హైదరాబాద్, వైజాగ్‌లో నీటిని నింపుతారు. మధ్యలో అయిపోతే విజయవాడలో నింపుతారు. కానీ ఇప్పుడు వాటికి మధ్యలో నీటిని నింపే పద్ధతిని తొలగించారు. రాత్రి బయ ల్దేరి పొద్దునకల్లా గమ్యం చేరే రైళ్లు కావటంతో వాటికి మధ్యలో నింపాల్సిన అవసరం లేదనేది అధికారుల అభిప్రాయం. గతంలో నీటిని నింపే బాధ్యతే రైల్వే అధికారులకే ఉండేది. మూడేళ్ల క్రితం దాన్ని ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఎక్కువ బోగీలకు నీళ్లు నింపాలంటే ఎక్కువ సంఖ్యలో సిబ్బంది కావాలి. కానీ కాంట్రాక్టర్లు వేతనాల ఖర్చును తప్పించుకునేందుకు తక్కువ మందినే వినియోగిస్తున్నారు. దీంతో వారు ఏసీ బోగీలకు ప్రాధాన్యమిచ్చి మిగతావాటిని గాలికొదిలేస్తున్నారు. మరికొన్నింట్లో తక్కువ నీటిని నింపి చేతులు దులుపుకోవడంతో నాలుగైదు గంటల్లోనే అవి ఖాళీ అవుతున్నాయి. కొన్ని రైళ్లలో ట్యాప్‌లు సరిగ్గా లేక నీరు లీకై మధ్యలోనే ట్యాంకులు ఖాళీ అవుతున్నాయి. కుళాయిలను పర్యవేక్షించాల్సిన సిబ్బంది పట్టించుకోవటం లేదు. ప్రయాణికులూ... మేల్కొనండి కుళాయిలో నీళ్లు రాకుంటే ఒకరిద్దరు మినహా ఫిర్యాదు చేసేందుకు పెద్దగా జనం ముందుకు రావటం లేదు. దీంతో ఫిర్యాదులు అంతగా లేనందున ఇది పెద్ద సమస్య కాదని రైల్వే భావిస్తోంది. బోగీల్లో నీళ్లు రాకున్నా, శుభ్రత లేకున్నా ఎస్ఎంఎస్ రూపంలో ఫిర్యాదు చేస్తే తక్షణం స్పందిస్తామని రైల్వే చెబుతోంది. ఇందుకోసం 8121281212 మొబైల్ నంబర్‌ను కేటాయించింది.