దయచేసి వినండి...రైళ్లలో నీళ్లు లేవు!
► రైళ్లలో మధ్యలోనే ఖాళీ అవుతున్న నీటి ట్యాంకులు
► పర్యవేక్షణ మరిచిన రైల్వే అధికారులు
► ప్రైవేటుకు అప్పగించి చోద్యం చూస్తున్న వైనం
► ఫిర్యాదులు ఎక్కువేమీ రావడం లేదంటూ సన్నాయి నొక్కులు
గోదావరి ఎక్స్‌ప్రెస్.. విశాఖ నుంచి సాయంత్రం బయల్దేరింది.. అర్ధరాత్రి విజయవాడ దాటింది.. ఇంతలో రైల్లో నీళ్లు అయిపోయాయి.. ఏసీ బోగీల్లో తప్ప ఎక్కడా నీటి సరఫరా లేదు.. దీంతో టాయిలెట్లకు వెళ్లే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది!
గౌతమి ఎక్స్‌ప్రెస్.. కాకినాడ నుంచి బయల్దేరి రాత్రి 12.30కు విజయవాడ స్టేషన్ చేరుకుంది. రైలు ఆగగానే ప్రయాణికులు ఖాళీ వాటర్ బాటిల్స్ పట్టుకొని ప్లాట్‌ఫాంలపై ఉన్న నీటి కుళాయిల వద్దకు పరుగుపెట్టారు. రైల్లో నీటి సరఫరా లేకపోవటమే ఇందుకు కారణం!!
సాక్షి, హైదరాబాద్: ఇది ఈ రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకే పరిమితమైన సమస్య కాదు. కొంతకాలంగా చాలా రైళ్లలో ప్రయాణికులు ఇవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైలు బయల్దేరిన నాలుగైదు గంటల్లో నీటి కొరత సమస్య తలెత్తుతోంది. ఏసీ బోగీల్లో తప్ప మిగతాచోట్ల ఎక్కడా నల్లాల్లో నీళ్లు రావటం లేదు. టాయిలెట్లలో కూడా నీళ్లు రాక ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. టీసీలకు చెబుతున్నా ఈ సమస్య పరిష్కారం కావటం లేదు. దీంతో రైలు ఆగగానే ప్లాట్‌ఫాంపై ఉండే కుళాయిల వద్ద ఖాళీ సీసాల్లో నీళ్లు నింపుకోవాల్సి వస్తోంది. అత్యవసరమైన వాళ్లు మినరల్ వాటర్ బాటిల్స్ కొనుక్కోవాల్సి వస్తోంది. రాత్రి పూట తిరిగే రైళ్లలో ఈ సమస్య అధికంగా ఉంటోంది.
నీళ్లు నింపే దగ్గరే సమస్య
రైలు బయల్దేరే ముందే బోగీల్లో నీళ్లను నింపుతారు. ట్రాక్‌ను ఆనుకుని ఉండే నీటి పైపులైన్ ద్వారా ప్రతిబోగీలో ట్యాంకులు నింపాలి. వాడకం ఎక్కువై నీళ్లు అయిపోతే మరో పెద్ద స్టేషన్‌లో నింపాలి. దీనికి ప్రత్యేకంగా నీళ్లను నింపేందుకు కొన్ని స్టేషన్‌లు కేటాయిస్తారు. సికింద్రాబాద్, కాచిగూడ, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి తదితర స్టేషన్లలో నింపాలి. గతంలో గోదావరి, గౌతమిలాంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు విజయవాడలో నీటిని నింపేవారు.
గోదావరి ఎక్స్‌ప్రెస్ బయల్దేరే సమయంలో హైదరాబాద్, వైజాగ్‌లో నీటిని నింపుతారు. మధ్యలో అయిపోతే విజయవాడలో నింపుతారు. కానీ ఇప్పుడు వాటికి మధ్యలో నీటిని నింపే పద్ధతిని తొలగించారు. రాత్రి బయ ల్దేరి పొద్దునకల్లా గమ్యం చేరే రైళ్లు కావటంతో వాటికి మధ్యలో నింపాల్సిన అవసరం లేదనేది అధికారుల అభిప్రాయం. గతంలో నీటిని నింపే బాధ్యతే రైల్వే అధికారులకే ఉండేది. మూడేళ్ల క్రితం దాన్ని ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించారు.
ఎక్కువ బోగీలకు నీళ్లు నింపాలంటే ఎక్కువ సంఖ్యలో సిబ్బంది కావాలి. కానీ కాంట్రాక్టర్లు వేతనాల ఖర్చును తప్పించుకునేందుకు తక్కువ మందినే వినియోగిస్తున్నారు. దీంతో వారు ఏసీ బోగీలకు ప్రాధాన్యమిచ్చి మిగతావాటిని గాలికొదిలేస్తున్నారు. మరికొన్నింట్లో తక్కువ నీటిని నింపి చేతులు దులుపుకోవడంతో నాలుగైదు గంటల్లోనే అవి ఖాళీ అవుతున్నాయి. కొన్ని రైళ్లలో ట్యాప్‌లు సరిగ్గా లేక నీరు లీకై మధ్యలోనే ట్యాంకులు ఖాళీ అవుతున్నాయి. కుళాయిలను పర్యవేక్షించాల్సిన సిబ్బంది పట్టించుకోవటం లేదు.
ప్రయాణికులూ... మేల్కొనండి
కుళాయిలో నీళ్లు రాకుంటే ఒకరిద్దరు మినహా ఫిర్యాదు చేసేందుకు పెద్దగా జనం ముందుకు రావటం లేదు. దీంతో ఫిర్యాదులు అంతగా లేనందున ఇది పెద్ద సమస్య కాదని రైల్వే భావిస్తోంది. బోగీల్లో నీళ్లు రాకున్నా, శుభ్రత లేకున్నా ఎస్‌ఎంఎస్ రూపంలో ఫిర్యాదు చేస్తే తక్షణం స్పందిస్తామని రైల్వే చెబుతోంది. ఇందుకోసం 8121281212 మొబైల్ నంబర్‌ను కేటాయించింది.