మధ్యప్రదేశ్‌లోని రేవాలో ప్ర«ధాని ప్రారంభించిన 750 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్ ఇదే
రేవా: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ విద్యుదుత్పత్తిలోనూ స్వావలంబన సాధించడం కీలకమైన విషయమని భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని రేవాలో 750 మెగావాట్ల భారీ సౌరవిద్యుత్తు ప్లాంట్‌ను ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. విద్యుత్తు రంగంలో స్వావలంబనకు సౌరశక్తి ఎంతో తోడ్పడుతుందన్నారు. సౌరశక్తి స్వచ్ఛమైంది మాత్రమే కాకుండా.. కచ్చితంగా అందుబాటులో ఉండేదని, సురక్షితమైంది కూడా అని అన్నారు.
ఈ శతాబ్దంలోనే అతిపెద్ద వనరుగా సౌరశక్తి అవతరించనుందని తెలిపారు. సౌర విద్యుత్తు విషయంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదు ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద కేంద్రమైన రేవా అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్‌తోపాటు ఢిల్లీ మెట్రో రైల్వేకూ విద్యుత్తు అందిస్తుందని అన్నారు. ప్రపంచమిప్పుడు పర్యావరణాన్ని కాపాడుకోవాలా? లేక ఆర్థిక వ్యవస్థనా? అన్న ద్వైదీభావంలో కొట్టుమిట్టాడుతోందని, అయితే స్వచ్ఛభారత్, ఉజ్వల, సీఎన్‌జీ, విద్యుత్ ఆధారిత రవాణా వ్యవస్థల ద్వారా భారత్ ఈ రెండూ పరస్పర ప్రయోజనకరమని చాటిందని అన్నారు.
ప్రపంచం మొత్తమ్మీద అందుబాటులో ఉండే, పర్యావరణాన్ని కలుషితం చేయకపోగా మెరుగుపడేందుకు సాయపడే, ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు ఉపయోగపడే సూర్యుడు స్వావలంబనకూ కీలకమని అన్నారు. ఇందుకోసం దేశం సోలార్ ప్యానెళ్లతోపాటు బ్యాటరీలు, ఇతర పరికరాలను సొంతంగా ఉత్పత్తి చేయాలని, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరారు. మధ్యప్రదేశ్‌లోని రేవా నర్మదా నది, తెల్లపులి కోసం చాలా ప్రసిద్ధి చెందిందని, ఇకపై ఆసియాలోనే అతిపెద్ద సౌరవిద్యుత్తు కేంద్రంగానూ ఖ్యాతి గడిస్తుందని అన్నారు. రేవా తరహాలోనే భారీ సోలార్ ప్లాంట్లను షాజాపూర్, నీమచ్, ఛత్తర్‌పూర్‌లలోనూ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని, ఓంకారేశ్వర్ సమీపంలో తేలియాడే సోలార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మధ్యప్రదేశ్ ఊర్జా వికాస్ నిగమ్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆప్ ఇండియా సంయుక్తంగా 500 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ భారీ సౌర విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment