
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాత్కాలిక ప్రాతిపదికన పవన విద్యుత్ యూనిట్‌కు రూ.2.43, సౌర విద్యుత్‌కు రూ.2.44 చెల్లించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై కంపెనీలు దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం తుది విచారణ ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
ఆయా కంపెనీల తరఫున సీనియర్ న్యాయవాదులు సి.వైద్యనాథన్, బసవ ప్రభుపాటిల్, సజన్ పూవయ్య, పి.శ్రీరఘురాం, చల్లా గుణరంజన్ తదితరులు వాదనలు వినిపించారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన గతంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సవరించడం సరికాదని నివేదించారు. ఒప్పందాలు ప్రభుత్వాలతో జరుగుతాయే తప్ప రాజకీయ పార్టీలతో కాదన్నారు.
పీపీఏల విషయంలో ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని, ప్రభుత్వాల జోక్యాన్ని నివారించేందుకు విద్యుత్ చట్టంలో స్పష్టమైన నిబంధనలు పొందుపరిచారని తెలిపారు. చట్టబద్ధంగా, పారదర్శకంగా పీపీఏలు జరిగాయని చెప్పారు. విద్యుత్ పంపిణీ సంస్థల తరఫున రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, పీపీఏలో పేర్కొన్న ధరలను సమీక్షించే అధికారం ఏపీఈఆర్‌సీకి ఉందని వివరించారు. తదుపరి వాదనల నిమిత్తం విచారణను ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది.