సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి 10,785.51 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్ధ్యం రాష్ట్రానికి ఉంది. ఈ మొత్తంలో పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం 4,096.65 మెగావాట్లు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకి 15 మిలియన్ యూనిట్ల నుంచి 20 మిలియన్ యూనిట్ల మధ్య పవన విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.
భవిష్యత్తులో ఇది మరింత పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో దీర్ఘకాల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పీపీఏ)తో ఆర్థికంగా కుదేలవుతున్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఊరట కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) పవన విద్యుత్ ధరలను నిర్ణయించింది. యూనిట్ రూ.2.64గా నిర్దేశించింది. యూనిట్‌కు రూ.3.43 ఇవ్వాలని విండ్ పవర్ జనరేటర్లు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది.
ఇరవై ఏళ్ల తరువాత మీ ఇష్టం
విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి పవన విద్యుత్‌ను తీసుకుంటున్న డిస్కంలు మొదటి పది సంవత్సరాలకు యూనిట్‌కు రూ.3.50 చొప్పున చెల్లించాలని గతంలోనే ఏపీఈఆర్‌సీ ఆదేశాలిచ్చింది. అయితే 11 ఏళ్లు దాటిన తరువాత 20 ఏళ్ల వరకు యూనిట్‌కు రూ.3.43, లేదా అంతకంటే ఎక్కువ టారిఫ్ ఇవ్వాలని పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఏపీఈఆర్‌సీని కోరాయి.
డిస్కంలు మాత్రం మొదటి పదేళ్లకే ఏపీఈఆర్‌సీ టారిఫ్ ఇచ్చిందని, దానికి జనరేటర్లు కూడా అంగీకారం తెలిపారని, ఆ తరువాత పదేళ్లకు టారిఫ్‌ను మండలి నిర్ణయించాల్సి ఉందని తేల్చి చెప్పాయి. దీనిపై స్పందించిన ఏపీఈఆర్‌సీ.. పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మొదటి పదేళ్లు యూనిట్‌కు రూ.3.50గా నిర్ణయించామని తెలిపింది. కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినందున ఆ ధరలే ఇవ్వమనడం కుదరదని తేల్చి చెప్పింది.
11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు పవన విద్యుత్ టారిఫ్ యూనిట్‌కు రూ.2.64 గా నిర్థారించింది. ఇరవై ఏళ్లు దాటిన తరువాత పీపీఏలను రద్దు చేసుకునేందుకు డిస్కంలకు అవకాశం కల్పించింది. ఒక వేళ పీపీఏలను కొనసాగిస్తే విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థల పరస్పర అంగీకారంతో టారిఫ్‌ను నిర్ణయించుకోవచ్చని, దానిని కమిషన్‌కు నివేదించి ఆమోదం పొందాలని సూచించింది.
పవన విద్యుత్‌కు అనుకూలంగా రాష్ట్రం
కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహాన్నిస్తోంది. అదే సమయంలో డిస్కంలు ఆర్ధికంగా నష్టపోకుండా కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గతేడాది దేశవ్యాప్తంగా పవన విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 8 శాతం పెరిగితే రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే జాతీయ స్థాయి వృద్ధికంటే 1.8 శాతం ఎక్కువ నమోదు చేసుకుని మొదటి పది రాష్ట్రాల్లో ఒకటిగా (ఆరో స్థానంలో) ఏపీ నిలిచింది.
రాష్ట్రంలో పవన విద్యుత్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీయెరాలజీ (పూణె) పరిశోధకులు వెల్లడించారు. ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్ట్ (సీఎంఐపీ) ప్రయోగాలలో సముద్ర తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ఏపీలో గాలి సామర్ధ్యం పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో గతేడాది డిసెంబర్ నాటికి (నాలుగో త్రైమాసికంలో) దేశవ్యాప్తంగా 229 గిగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులు పెరగగా, మన రాష్ట్రంలో 40.9 మెగావాట్ల కొత్త ప్రాజెక్టులు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment