పునరుత్పాదక ఇంధన రంగం పరిశ్రమలకు టారిఫ్ నిర్ణయించిన ఈఆర్‌సీ
బయోమాస్, పారిశ్రామిక వ్యర్థాలు, బగాస్సే విద్యుత్ సంస్థలæ ఖర్చుల సమీక్ష
ఐదేళ్ల కాలానికి ఇంధన ధరలను నిర్ణయించిన ఏపీఈఆర్‌సీ
యూనిట్‌కు కనీసం రూ. 8 నుంచి రూ. 15 వరకూ వసూలుకు అనుమతించాలన్న నిర్వాహకులు
సాక్షి, అమరావతి: ఐదేళ్ల కాలానికి టారిఫ్ నిర్ణయంలో పునరుత్పాదక ఇంధన రంగంలోని పరిశ్రమలకు ఊరట లభించలేదు. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు చెప్పిన దాని ప్రకారమే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆ టారిఫ్‌ని నిర్ణయించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం నుంచి 2028–29 ఆర్థిక సంవత్సరం వరకు బయోమాస్, పారిశ్రామిక వ్యర్థాలు, బగాస్సే(చెరకు పిప్పి) విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమల ఖర్చుల ఆధారంగా ఏపీఈఆర్‌సీ ధరలను సమీక్షించింది. రాష్ట్రంలో ఇలాంటి పరిశ్రమలు 26 ఉన్నాయి.
వీటిలో పారిశ్రామిక వ్యర్థాల నుంచి 40.965 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. బయోమాస్ బేస్డ్ పరిశ్రమల నుంచి 171.25 మెగావాట్లు, బగాస్సే పరిశ్రమల నుంచి 206.95 మెగావాట్లు చొప్పున విద్యుత్ వస్తోంది. వీటికి గతంతో 2019–20 నుంచి 2023–24 వరకు నిర్ణయించిన టారిఫ్ ప్రస్తుతం అమలులో ఉంది. టారిఫ్‌ను నిర్ణయించినప్పుడే వార్షిక ఇంధన ధర 5 శాతం పెరుగుదలతో లెక్కిస్తారు.
ఈ లెక్కన 2023–24కి ఇంధన ధరలు బయోమాస్, పారిశ్రామిక వ్యర్థాల యూనిట్‌కు రూ. 5.80, బగాస్సేకి యూనిట్ రూ. 3.82 చొప్పున అమలు చేస్తున్నారు. తాము ప్రతిపాదించిన ధరలను ఆమోదించాలని లేదా 2023–24కి ఆమోదించిన అదే ధరలను కొనసాగించాలని డిస్కంలు మండలిని కోరాయి. పరిశ్రమల నిర్వాహకులు ఇంకా ఏవైనా సూచనలు, సలహాలు, అభ్యంతరాలను వెల్లడించాలనుకుంటే దానికి కూడా కమిషన్ అవకాశం కల్పించింది.
కరోనా వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, దానికి తోడు డీజిల్ ధరలు భారీగా పెరిగినందున ఖర్చులు విపరీతంగా ఉన్నాయని పరిశ్రమల నిర్వాహకులు ఏపీఈఆర్‌సీకి మొరపెట్టుకున్నారు. తాము కోలుకోవాలంటే యూనిట్ విద్యుత్‌ను కనీసం రూ. 8 నుంచి రూ. 15కు విక్రయించేలా అనుమతించాలని కోరారు. కానీ దానికి డిస్కంలు అంగీకరించలేదు. దీంతో దాదాపుగా డిస్కంలు చేసిన ప్రతిపాదనలకే 2024–29 నియంత్రణ కాలానికి ఏపీఈఆర్‌సీ అంగీకారం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment