Energy Sector News
-
డిస్కంలు చెప్పాయి.. ఈఆర్సీ నిర్ణయించింది
సాక్షి, అమరావతి: ఐదేళ్ల కాలానికి టారిఫ్ నిర్ణయంలో పునరుత్పాదక ఇంధన రంగంలోని పరిశ్రమలకు ఊరట లభించలేదు. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు చెప్పిన దాని ప్రకారమే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆ టారిఫ్ని నిర్ణయించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం నుంచి 2028–29 ఆర్థిక సంవత్సరం వరకు బయోమాస్, పారిశ్రామిక వ్యర్థాలు, బగాస్సే(చెరకు పిప్పి) విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమల ఖర్చుల ఆధారంగా ఏపీఈఆర్సీ ధరలను సమీక్షించింది. రాష్ట్రంలో ఇలాంటి పరిశ్రమలు 26 ఉన్నాయి. వీటిలో పారిశ్రామిక వ్యర్థాల నుంచి 40.965 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. బయోమాస్ బేస్డ్ పరిశ్రమల నుంచి 171.25 మెగావాట్లు, బగాస్సే పరిశ్రమల నుంచి 206.95 మెగావాట్లు చొప్పున విద్యుత్ వస్తోంది. వీటికి గతంతో 2019–20 నుంచి 2023–24 వరకు నిర్ణయించిన టారిఫ్ ప్రస్తుతం అమలులో ఉంది. టారిఫ్‌ను నిర్ణయించినప్పుడే వార్షిక ఇంధన ధర 5 శాతం పెరుగుదలతో లెక్కిస్తారు. ఈ లెక్కన 2023–24కి ఇంధన ధరలు బయోమాస్, పారిశ్రామిక వ్యర్థాల యూనిట్‌కు రూ. 5.80, బగాస్సేకి యూనిట్ రూ. 3.82 చొప్పున అమలు చేస్తున్నారు. తాము ప్రతిపాదించిన ధరలను ఆమోదించాలని లేదా 2023–24కి ఆమోదించిన అదే ధరలను కొనసాగించాలని డిస్కంలు మండలిని కోరాయి. పరిశ్రమల నిర్వాహకులు ఇంకా ఏవైనా సూచనలు, సలహాలు, అభ్యంతరాలను వెల్లడించాలనుకుంటే దానికి కూడా కమిషన్ అవకాశం కల్పించింది. కరోనా వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, దానికి తోడు డీజిల్ ధరలు భారీగా పెరిగినందున ఖర్చులు విపరీతంగా ఉన్నాయని పరిశ్రమల నిర్వాహకులు ఏపీఈఆర్సీకి మొరపెట్టుకున్నారు. తాము కోలుకోవాలంటే యూనిట్ విద్యుత్‌ను కనీసం రూ. 8 నుంచి రూ. 15కు విక్రయించేలా అనుమతించాలని కోరారు. కానీ దానికి డిస్కంలు అంగీకరించలేదు. దీంతో దాదాపుగా డిస్కంలు చేసిన ప్రతిపాదనలకే 2024–29 నియంత్రణ కాలానికి ఏపీఈఆర్సీ అంగీకారం తెలిపింది. -
ప్రపంచంలో అత్యుత్తమంగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని భారతదేశంలోనే కాకుండా, ప్రపంచ వేదికపై అత్యుత్తమ నగరంగా నిలపాలని సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా నిర్దేశించుకున్నారని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ చెప్పారు. లక్ష్యానికి అనుగుణంగా ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు. ఇంధన సామర్థ్య సాధన ద్వారా ప్రపంచంలోనే పెట్టుబడులకు సురక్షిత నగరంగా హైదరాబాద్ త్వరలో రూపాంతరం చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్ధంగా మూసీ నది పునరుజ్జీవనానికి తీసుకుంటున్న చర్యలు ఇందులో భాగమని స్పష్టం చేశారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ)తో కలిసి హైదరాబాద్‌లో మిషన్ లైఫ్ (లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్) పోస్టర్‌ను గురువారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రివర్ ఫ్రంట్ అభివృద్ధితో పాటు, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, నగర సామాజిక, ఆర్థిక, పర్యావరణ వ్యవస్థల్ని మెరుగుపరచడం కూడా ప్రభుత్వ లక్ష్యమని దానకిశోర్ చెప్పారు. ఇవన్నీ పూర్తయితే లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈసీబీసీతో విస్తృత ప్రయోజనాలు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (టీఎస్ రెడ్కో), బీఈఈ సంయుక్త భాగస్వామ్యంతో ఇంధన శక్తి సామర్థ్య నిర్వహణ, పర్యావరణ లక్ష్యాల్ని అందుకునేందుకు దానకిశోర్ నేతృత్వంలో చర్చించి, పలు నిర్ణయాల అమలుకు కృషి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. నగరంలో ఇకపై ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ)కు అనుగుణంగానే కొత్త ప్రభుత్వ భవనాలను నిర్మించనున్నారు. బీఈఈ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈసీబీసీ ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణకు దోహదపడటంతో పాటు ఆర్థిక, తదిత విస్తృత ప్రయోజనాలను అందిస్తుందని భావిస్తున్నారు. బీఈఈ కార్యదర్శి మిలింద్ దేవ్రా, బీఈఈ డైరెక్టర్లు సౌరభ్ దీదీ, ఎస్కే వర్ణా, బీఈఈ దక్షిణాది రాష్ట్రాల మీడియా సలహాదారు ఎ.చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంధన రంగంలో 67 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
గోవా: భారత్ వృద్ధి బాటలో భాగస్వామ్యం కావాలని ప్రపంచ పెట్టుబడిదారులను భారత్ ఆహ్వనిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. వచ్చే 5 నుండి 6 సంవత్సరాలలో భారతదేశం ఇంధన రంగంలో 67 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇండియా ఎనర్జీ వీక్.. రెండవ ఎడిషన్‌ను ఇక్కడ ప్రారంభించిన ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత్ ఎకానమీ 7.5%కన్నా అధిక వృద్ధి రేటుతో పురోగమిస్తోందన్నారు. అమెరికా (25.5 ట్రిలియన్ డాలర్లు) చైనా (18 ట్రిలియన్ డాలర్లు), జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)ల తర్వాత దాదాపు 3.8 ట్రిలియన్ డాలర్లతో ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, త్వరలో మూడో స్థానానికి చేరడం ఖాయమని మోదీ ఉద్ఘాటించారు. ఇదే విషయాన్ని పలు సంస్థలూ స్పష్టం చేస్తున్నాయని ప్రధాని అన్నారు. 2030 నాటికి దేశం తన రిఫైనింగ్ సామర్థ్యాన్ని 254 ఎంఎంటీపీఏ (సంవత్సరానికి మిలియన్ మెట్రిక్ టన్నులు) నుండి 450 ఎంఎంటీపీఏకి పెంచుతుందని భావిస్తున్నామని ఆయన పేర్కొంటూ... ఈ నేపథ్యంలో భారతదేశ ఇంధన రంగ వృద్ధిలో పాలుపంచుకోవాలని ప్రపంచ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. ఇంధన రంగంలో మునుపెన్నడూ జరగని విధంగా భారతదేశం భారీ పెట్టుబడులు పెడుతోందని ప్రధాని అన్నారు. 2045 నాటికి దేశ ప్రాథమిక ఇంధన డిమాండ్ రెట్టింపు అవుతుందని కూడా ఆయన చెప్పారు. ముడిచమురు, ఎల్‌పీజీల్లో మూడో స్థానం... ముడిచమురు, ఎల్పీజీ వినియోగం విషయంలో భారత్ మూడవ అతిపెద్ద దేశంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. ఎల్ఎన్జీ విషయంలో నాల్గవ అతిపెద్ద దిగుమతిదారుగా భారతదేశం ఉందని మోదీ అన్నారు. గత రెండేళ్లలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయని పేర్కొన్న ఆయన, ప్రపంచ సవాళ్ల నేపథ్యంలో దేశం ఇంధన నిర్వహణ వ్యూహాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ సంస్కరణలు దేశీయ సహజ వాయువు ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతున్నాయని మోదీ తెలిపారు. చమురు, గ్యాస్ రంగంలో ఇన్వెస్ట్ చేయండి ► గ్లోబల్ దిగ్గజ సంస్థల సీఈవోలతో ప్రధాని భేటీ చమురు, గ్యాస్ రంగంలో ప్రత్యేకించి అన్వేషణ, ఉత్పత్తిలో పెట్టుబడులకు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ ఈ రంగంలో ప్రముఖ ఎగ్జిక్యూటివ్‌లకు విజ్ఞప్తి చేశారు. ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా ఎక్సాన్‌మొబిల్, బీపీల నుండి ఖతార్ ఎనర్జీ, ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ ఎనర్జీస్ వరకు దాదాపు 20 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో మోదీ సమావేశమయినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి హాజరైన భారతీయ సీఈఓలలో వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్‌తో పాటు రిలయన్స్ అధికారులు ఉన్నారు. దేశంలో చమురు, గ్యాస్ వనరులను కనుగొని, ఉత్పత్తి చేయడంలో పెట్టుబడులు పెట్టేందుకుగాను ప్రపంచ దిగ్గజ సంస్థలను ఆహ్వానించేందుకు ఇటీవల ప్రారంభించిన ‘ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్సింగ్ రౌండ్’ విధానాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా, రానున్న మూడేళ్లలో చమురు, గ్యాస్ ఉత్పత్తిని రోజుకు 300,000 బ్యారెళ్లకు రెట్టింపు చేయడానికి 4 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడికి తమ సంస్థ యోచిస్తున్నట్లు ఈ సందర్భంగా అనిల్ అగర్వాల్ తెలిపారు. ఖతార్‌తో ఎల్ఎన్జీ డీల్ పొడిగింపు ► 20 ఏళ్లకు 78 బిలియన్ డాలర్ల డీల్ ►ఏటా 6 బిలియన్ డాలర్ల ఆదా బెతుల్ (గోవా): ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) దిగుమతులకు సంబంధించిన డీల్‌ను మరో 20 ఏళ్ల పాటు పొడిగిస్తూ ఖతార్‌ఎనర్జీతో దేశీ దిగ్గజం పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ 78 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. ఈ డీల్ 2048 వరకు అమల్లో ఉంటుంది. ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ కొనుగోలు కోసం ఖతార్‌ఎనర్జీతో ఒప్పందాన్ని పొడిగించుకున్నట్లు పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యుత్, ఎరువుల ఉత్పత్తి కోసం ఈ గ్యాస్ ఉపయోగపడనున్నట్లు పేర్కొంది. ప్రస్తుత రేట్ల కన్నా తక్కువ ధరకే ఎల్ఎన్జీని ఖతార్ సరఫరా చేయనుండటంతో భారత్‌కు ఏటా 6 బిలియన్ డాలర్లు ఆదా కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పుడున్న ధరలతో పోలిస్తే కొత్త ఒప్పందం ప్రకారం యూనిట్‌కు (ఎంబీటీయూ) భారత్‌కి 0.8 డాలర్ల మేర మిగులుతుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 80 డాలర్లుగా ఉండగా ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ దిగుమతుల బిల్లు 3.9 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలనే భారత్ లక్ష్యానికి ఈ కాంట్రాక్టు తోడ్పడగలదని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. భారత ఎకానమీ వృద్ధిలో తాము కూడా భాగంగా ఉండాలని ఆశిస్తున్నట్లు ఖతార్ ఇంధన శాఖ మంత్రి, ఖతార్‌ఎనర్జీ సీఈవో సాద్ అల్–కాబి తెలిపారు. ఎల్ఎన్జీ సరఫరా కోసం ఆ్రస్టేలియా, అమెరికా, రష్యాతో కూడా భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రస్తుతం ఏటా 8.5 ఎంటీపీఏ దిగుమతి.. ఖతార్‌ఎనర్జీ నుంచి పెట్రోనెట్ రెండు కాంట్రాక్టుల కింద ఏటా 8.5 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) ఎల్ఎన్జీ దిగుమతి చేసుకుంటోంది. వాటిలో 25 ఏళ్లకు సంబంధించిన 2024లో కుదుర్చుకున్న ఒక ఒప్పందం 2028తో ముగిసిపోనుంది. దీన్నే పెట్రోనెట్ తాజాగా పొడిగించింది. భారత ఎల్ఎన్జీ దిగుమతుల్లో ఖతార్ ఎనర్జీతో పెట్రోనెట్ ఒప్పందం వాటా దాదాపు 35%గా ఉంటుంది. -
‘థర్మల్’ వెలుగులు
సాక్షి, అమరావతి: దేశంలో కర్బన ఉద్గారాలను 2070 నాటికి సున్నా స్థాయికి తీసుకురావాలనే లక్ష్యంలో భాగంగా రానున్న కాలంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచుకుని.. థర్మల్ విద్యుత్‌ను తగ్గించుకోవాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కొన్ని నెలల క్రితం అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ జెన్కో) థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో రిజర్వు షట్ డౌన్ (ఉత్పత్తి తగ్గింపు)పై విధివిధానాలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కూడా ప్రకటించింది. పూర్తిగా మూసేయాల్సిన అవసరం లేదని, గ్రిడ్‌కు ప్రమాదం వాటిల్లే పరిస్థితి వస్తే అప్పుడు థర్మల్ యూనిట్లు షట్‌డౌన్ చేయవచ్చని ఏపీ ఈఆర్సీ స్పష్టం చేసింది. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా అకస్మాత్తుగా విద్యుత్ డిమాండ్ పడిపోయినప్పుడు కూడా ఉత్పత్తి తగ్గించవచ్చని పేర్కొంది. తక్కువ ధరకు విద్యుత్ అందించే ఉత్పత్తి సంస్థలకు మొదట ప్రాధాన్యం ఇచ్చేలా కొన్ని యూనిట్లను రిజర్వు షట్ డౌన్ చేసే వెసులుబాటు కల్పించింది. దీంతో రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ సామర్థ్యాన్ని అత్యవసరంగా తగ్గించాల్సిన ఆవçశ్యకత రాలేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల సూపర్ క్రిటికల్ థర్మల్ యూనిట్ ఈ నెల 20న వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించింది. 2024లో 17 థర్మల్ ప్లాంట్లు భవిష్యత్‌లో పెరుగనున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవాలంటే పునరుత్పాదక ఇంధనంతో పాటు శిలాజ ఇంధన ఉత్పత్తిపైనా దృష్టి సారించాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా గుర్తించాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒకడుగు ముందే ఉంది. ఇప్పటికే సోలార్, విండ్, హైడల్ కలిపి ఉండే పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లకు శ్రీకారం చుట్టింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇంధన రంగంలో ఏపీ చర్యలను ఇప్పటికే అనేక పర్యాయాలు ప్రశంసించిన కేంద్రం రాష్ట్రం బాటలోనే నిర్ణయాలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా భారీగా బొగ్గు ఆధారిత ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. 2024లో దేశంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 256 గిగావాట్లకంటే ఎక్కువ ఉంటుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నివేదిక అంచనా వేసింది. 2031–32కి ఇది 366.39 గిగావాట్లకు పెరుగుతుందని చెప్పింది. 2041–42కి 574.68 గిగావాట్లకు పెరగొచ్చనే అంచనాతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు అనివార్యమైంది. దీంతో 2024లో 17 గిగావాట్ల సామర్థ్యం గల థర్మల్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని, తర్వాత మరో 33 గిగావాట్ల ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని ప్రణాళిక రూపొందించింది. ఇలా దాదాపు రూ.7.28 లక్షల కోట్ల పెట్టుబడితో 91 థర్మల్ ప్లాంట్లు స్థాపించాలని యోచిస్తున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోనే ఆదర్శంగా ఏపీ ఏపీ గ్రిడ్ డిమాండ్ గతేడాది రోజుకు 190 మిలియన్ యూనిట్ల నుంచి 200 మిలియన్ యూనిట్లు ఉండగా.. ఈ ఏడాది 220 నుంచి 245 మిలియన్ యూనిట్లు రికార్డయ్యింది. అయినప్పటికీ విద్యుత్ కొరత లేకుండా సరఫరా చేయడంలో థర్మల్ కేంద్రాలు కీలక భూమిక పోషించాయి. ఎన్టీటీపీఎస్ ఆపరేషన్, మెయింటెనెన్స్ యూనిట్ల లభ్యత శాతం 2022–23 ఆర్థిక సంవత్సరంలో 69.90 శాతం ఉంటే.. ఈ ఏడాదిలో 75.83 శాతానికి పెరిగింది. అలాగే గతేడాది ఎన్టీపీఎస్ స్టేజ్–4 యూనిట్ హీట్ రేట్ 2,517 కిలో వాట్ అవర్ నుంచి 2,436 తగ్గింది. అదేవిధంగా 2022–23లో ఎంవీఆర్ ఆర్టీపీపీ స్టేషన్ యూనిట్ల లభ్యత 67.85 శాతం నుంచి 75.68 శాతానికి మెరుగుపడింది. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలోనే అత్యుత్తమ థర్మల్ ప్లాంట్‌గా ఆర్టీపీపీ గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో) తన అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ పీడీసీఎల్)తో కలిసి థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్వహిస్తోంది. వీటిలో సామర్థ్యాన్ని మించి దాదాపు 10 మెగావాట్ల అధిక విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. రాష్ట్ర గ్రిడ్ అవసరాలను సాధ్యమైనంత ఎక్కువగా తీర్చాలనే లక్ష్యంతో ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతూ వస్తోంది. అందులో భాగంగానే కృష్ణపఛిట్నంలోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ ఏడాది మార్చి 10న 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. తాజాగా ఎన్టీటీపీఎస్లో 8వ యూనిట్ సీవోడీతో జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 5,810 మెగావాట్ల నుంచి 6,610 మెగావాట్లకు పెరిగింది. -
ఎంత ప్రమాదమో తెలిసొచ్చింది.. వెలుగులు అణువంతే!
అణు బాంబు సృష్టికర్త ఒప్పెన్హీమర్ జీవిత గాథ హాలీవుడ్ తెరపైకెక్కడంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి అణు శక్తిపై చర్చ మొదలైంది. అణు పరిజ్ఞానం ఇప్పటిదాకా ఎన్నోసార్లు చర్చల్లో నానుతూనే ఉంది. ఇటీవలి కాలంలో పర్యావరణాన్ని పరిరక్షించే పునరుద్పాతక ఇంధన శక్తుల వినియోగంపై అవగాహన పెరగడంతో అణుశక్తి ప్రభ క్రమంగా తగ్గుతూ వస్తోంది. దాని స్థానాన్ని సౌర విద్యుత్ ఆక్రమిస్తోంది... అణు శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఒప్పెన్హీమర్ 1940లో తొలిసారి అణు బాంబును సృష్టించారు. తర్వాత పదేళ్లకు 1950లో తొలి అణు విద్యుత్కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో దాన్ని ఇంధన రంగంలో గేమ్ చేంజర్‌గా భావించారు. కానీ అణు విద్యుత్కేంద్రాలు ఎంత ప్రమాదకరమో అనుభవపూర్వకంగా తెలిసొచ్చాక వాటికి ఆదరణ క్రమంగా తగ్గుతూ వస్తోంది. జపాన్, అమెరికా, ఫ్రాన్స్ తప్ప మిగతా దేశాల్లో అణు ఇంధనానికి ప్రాధాన్యమూ తగ్గుతూ వస్తోంది. జర్మనీ ప్రభుత్వం 3 అణు విద్యుత్ కేంద్రాలను మూసివేయడం గమనార్హం. అణు వర్సెస్ సౌర విద్యుత్ 1970 దశకంలో అణు విద్యుత్ ఒక వెలుగు వెలిగింది. అణు శక్తికి అది స్వర్ణయుగమని చెప్పొచ్చు. చాలా దేశాల్లో భారీగా అణు ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అలా ప్రపంచ విద్యుదుత్పత్తిలో అణు విద్యుత్ వాటా 1985 కల్లా ఏకంగా 15.1% దాకా పెరిగింది. కానీ 2022 నాటికి అది 9.1 శాతానికి పడిపోయింది. సౌరవిద్యుత్ వినియోగంలోకి రావడమే దీనికి ప్రధాన కారణం. ‘‘2021లో ప్రపంచ దేశాల్లో సౌర విద్యుత్ 1.04 టెరావాట్స్ కాగా, ప్రపంచ అణు విద్యుత్ సామర్థ్యం 463 గిగావాట్లు. అంటే అణు విద్యుత్ కంటే సౌర విద్యుత్ రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది’’ అని ఇస్రోలో సోలార్ ప్యానెల్ డివిజన్ మాజీ శాస్త్రవేత్త మనీశ్ పురోహిత్ చెప్పారు. సౌర విద్యుత్‌తో లాభాలు... ► సౌర విద్యుత్‌కు ముడి సరుకు సూర్యుడే గనుక దానికి కొరత ఉంటుందన్న భయం లేదు. ► సోలార్ ప్యానెల్స్, యూనిట్ల ధర బాగా తగ్గింది. సోలార్ ప్లాంట్ నిర్మాణ వ్యయం మెగావాట్‌కు 10 లక్షల డాలర్లే. సౌర విద్యుత్ వ్యర్థాలను నిర్మూలించే క్రమంలో ఎలాంటి ప్రమాదానికీ ఆస్కారం లేదు. ► అణు విద్యుత్కేంద్రం ఏర్పాటే అత్యంత ఖరీదైన వ్యవహారం. కొత్తగా అణు ప్లాంట్ నిర్మాణానికయ్యే వ్యయం కనీసం 1,000 కోట్ల డాలర్లు. ► అణు విద్యుదుత్పత్తి వల్ల వెలువడే అణు ధారి్మక వ్యర్థాల నిర్మూలన అత్యంత ప్రమాదంతో కూడిన వ్యవహారం. ► ఒక్కో అణు విద్యుత్కేంద్రం నుంచి ఏటా కనీసం 20 మెట్రిక్ టన్నుల అణు ధారి్మక వ్యర్థాలు వెలువడతాయి. ► ప్రస్తుతం అన్ని దేశాల వద్దా కలిపి 90 వేల మెట్రిక్ టన్నుల అణు ధారి్మక వ్యర్థాలున్నాయి. వీటిని అత్యంత సురక్షిత పద్ధతిలో నిర్మూలించకపోతే ఎన్నో రకాలుగా తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. ► పైగా అణు విద్యుత్కేంద్రాలతో ప్రమాదాలు కూడా ఎక్కువే. అందుకే కొత్త ప్లాంట్ల ఏర్పాటును అడ్డుకుంటూ ఎన్నో పోరాటాలు జరిగాయి, జరుగుతున్నాయి. ► దాంతో చాలా ఏళ్లుగా కొత్త అణు విద్యుత్కేంద్రాలేవీ రాలేదు. ► అమెరికా, జపాన్, ఫ్రాన్స్ మినహా మరే దేశాలు అణు విద్యుత్‌పై మొగ్గు చూపించకపోవడంతో అంతర్జాతీయంగా ఒప్పందాలు, పరస్పర సాంకేతిక సహకారం తగ్గిపోయాయి. ఫలితంగా అణు విద్యుత్ చుట్టూ చీకట్లు అలుముకున్నాయి. అణ్వాయుధాలు తగ్గిపోతున్నాయ్! ► అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో కొన్నేళ్లు పాటు అణ్వాయుధాల పోటీయే ప్రధానంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల దగ్గర 1986 నాటికి ఏకంగా 64,452 అణ్వాయుధాలు పోగుపడ్డాయి. ► ఇప్పుడు వాటి సంఖ్య 12,510కి తగ్గింది. వీటిలో 89% రష్యా, అమెరికా దగ్గరే ఉన్నాయి. ► అణు వినాశనం ఎంత భయానకంగా ఉంటుందో హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణు బాంబు దాడులతో అందరికీ తెలిసొచి్చంది. ► ఏళ్లు గడిచే కొద్దీ అణ్వాయుధాల తయారీని తగ్గించడంపై దేశాలన్నీ దృష్టి సారించాయి. అణు విద్యుత్ రియాక్టర్ల సగటు జీవిత కాలం 60 ఏళ్లు. ఇప్పుడున్న వాటిలో చాలావరకు ఇక పనికి రాని స్థితికి వచ్చేశాయి. కొత్తవి ఏర్పాటు కావడం లేదు. దాంతో అణు విద్యుదుత్పత్తి తగ్గుతూ వస్తోంది – డాక్టర్ నితేంద్ర సింగ్, ఇండియన్ యూత్ న్యూక్లియర్ సొసైటీ వ్యవస్థాపకుడు -1968లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం కుదిరిన తర్వాత అణు శక్తిని ప్రజాప్రయోజనాలకే తప్ప, వినాశనానికి వాడొద్దని దేశాలన్నీ నెమ్మదిగా గ్రహించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అభివృద్ధి పథంలో ఇంధన రంగం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఇంధన రంగం అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. వార్షిక ఇంధన వినియోగం 2017–18లో 50,077 మిలియన్ యూనిట్లతో పోలిస్తే 2022–23లో 65,830 మిలియన్ యూనిట్లకు చేరుకోవడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్ ప్రణాళికలపై విద్యుత్ సంస్థలతో ఆయన ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే.. విద్యుత్ వినియోగం దాదాపు 31.45 శాతానికి పెరిగిందని, ఇటీవల రోజుకు 251 మిలియన్ యూనిట్లు ఆల్ టైమ్ హై ఎనర్జీ డిమాండ్ రాగా విద్యుత్ సంస్థలు విజయవంతంగా తీర్చాయని చెప్పారు. ఒప్పందాలతో ఉజ్వల భవిష్యత్ ఈ ఏడాది మార్చి నెలలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగం పెట్టుబడులతో దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని విజయానంద్ వెల్లడించారు. ఈ 42 అవగాహన ఒప్పందాలను అమలు చేయాల్సిన అవసరం విద్యుత్ సంస్థలపై ఉందన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే అత్యంత అనుకూల రాష్ట్రంగా ఏపీని ప్రభుత్వం మార్చిందన్నారు. విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులను స్థాపించడానికి ప్రభుత్వం ఇప్పటికే పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020ని ప్రకటించిందని తెలిపారు. పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్ట్‌లు (పీఎస్పీ) పూర్తయితే విద్యుత్ రంగంలో దేశంలోనే ఏపీ నంబర్ వన్‌గా మారి మిగులు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వినియోగదారులకు నమ్మకమైన విద్యుత్‌ను అందించాలని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించాలని పదే పదే చెబుతున్నారన్నారు. వ్యవసాయానికి 9 గంటలు పగటిపూట ఉచిత విద్యుత్‌ను వచ్చే 25 ఏళ్ల పాటు కొనసాగించేందుకు 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. రాష్ట్ర గ్రిడ్ కు 105 మిలియన్ యూనిట్లు జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర గ్రిడ్‌కు రోజుకు 102 నుంచి 105 మిలియన్ యూనిట్లను జెన్కో సరఫరా చేస్తోందని, ఇది మొత్తం ఇంధన డిమాండ్‌లో 40 నుండి 45 శాతం ఉందని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఇదే అత్యధికమని, బొగ్గు నిల్వలను మెరుగుపరచడానికి కూడా జెన్కో అన్ని ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. సమావేశంలో ట్రాన్స్‌కో జేఎండీ బి.మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు, ఏపీ ఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి, ట్రాన్స్‌కో డైరెక్టర్లు ఏవీకే భాస్కర్, టి.వీరభద్రారెడ్డి పాల్గొన్నారు. -
ఇంధన సామర్థ్యంలో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్య రంగంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాలలో ఏపీ ఒకటని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సెక్రటరీ ఆర్.కే. రాయ్ కొనియాడారు. ఇంధన భద్రత, పర్యావరణ లక్ష్యాలను సాధించడంతో పాటు ఆర్థిక వ్యవస్థపై ఇంధన తీవ్రతను తగ్గించడానికి సహాయపడే ఇంధన సామర్థ్య కార్యకలాపాలకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఇంధన సామర్థ్య పరికరాలను అమర్చే ప్రాజెక్టును ఏపీ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) రికార్డు స్థాయిలో నెల రోజుల్లోనే పూర్తిచేసింది. ఈ ప్రాజెక్టును రాయ్ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీ భవన్లో ఏటా 1.96 లక్షల యూనిట్ల విద్యుత్తును, రూ.39 లక్షల మేర ప్రజా ధనాన్ని ఆదా చేయొచ్చని చెప్పారు. 139 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించొచ్చన్నారు. ఇందుకోసం పెట్టిన పెట్టుబడి 13 నెలల్లోనే ఇంధనం ఆదా రూపంలో తిరిగి పొందవచ్చన్నారు. తొలి దశలో హాలోజన్ ల్యాంప్‌ల స్థానంలో 190 వాట్ల కెపాసిటీ గల 12 ఎల్ఈడీ ఫ్లడ్ లైట్లు, సంప్రదాయ సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో 28 వాట్స్ కెపాసిటీ గల 170 బీఎల్డీసీ సీలింగ్ ఫ్యాన్లు, 1.8 టీఆర్ 3 స్టార్ రేటెడ్ హాట్ అండ్ కోల్డ్ ఇన్వర్టర్ టైప్ స్ప్లిట్ ఏసీలు, కారిడార్ల వద్ద లైట్లను నియంత్రించడానికి 40 మోషన్ సెన్సార్లను ఏర్పాటు చేశారని తెలిపారు. దీనివల్ల ఏటా రూ.6.25 లక్షల విలువైన49,469 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుందన్నారు. నెల రోజుల్లోనే పనులు పూర్తి చేసిన ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డిని రాయ్ అభినందించారు. ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు. ఇంధన సామర్థ్య చర్యలకు న్యూ ఢిల్లీలో బీఈఈ ఎంపిక చేసిన తొలి రాష్ట్ర భవన్ ఏపీ భవన్. ఇక్కడి ఇంధన పొదుపు చర్యల ఫలితాల ఆధారంగా ఇతర రాష్ట్ర ప్రభుత్వాల భవనాల్లోనూ ఇదే ప్రాజెక్టును అమలు చేయాలని బీఈఈ భావిస్తోంది. ఏపీ భవన్‌ను ఎంపిక చేసి ఏపీఎస్ఈసీఎం ద్వారా ఇంధన సామర్థ్య చర్యలను విజయవంతంగా అమలు చేసిన బీఈఈకి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కృతజ్ఞతలు తెలిపారు. -
ఏపీలో సోలార్ ప్రాజెక్టు పెడతాం
సాక్షి ప్రతినిధి: ఇంధన రంగంలో రాష్ట్ర ప్రభుత్వ పాలసీ.. పరిశ్రమలను ప్రోత్సహించడంలో ఇక్కడి పాలకులు అనుసరిస్తున్న విధానాలు పారిశ్రామిక దిగ్గజాలను రాష్ట్రానికి రప్పిస్తున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో రూ. 9,57,139 కోట్ల పెట్టుబడులతో 42 ప్రాజెక్టుల ద్వారా 1,80,918 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సంస్థలు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వేదికగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ జాబితాలోకి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా (ఎన్‌ఎల్‌సీఐ) లిమిటెడ్ కూడా చేరింది. రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను స్థాపించడానికి ఈ సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఎన్ఎల్సీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ప్రసన్నకుమార్ మోటుపల్లి విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి ప్రతినిధి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పునరుత్పాదక విద్యుత్‌కు ఏపీలో అవకాశాలు.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ‘నైవేలీ’ సిద్ధంగా ఉంది. పునరుత్పాదక శక్తి (రెన్యూవబుల్ ఎనర్జీ) విభాగంలో.. ముఖ్యంగా సౌర, పవన విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల స్థాపనకు ఏపీలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రానున్న నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 6 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడమే మా కార్పొరేషన్ లక్ష్యం. ఇందుకు అనుకూలమైన రాష్ట్రాలేమిటని చూసినప్పుడు మాకు మొదట ఏపీ కనిపించింది. దీంతో వెంటనే ప్రభుత్వానికి మేం ప్రతిపాదించాలని నిర్ణయించాం. అందులో భాగంగానే ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌తో భేటీ అయ్యాం. రాష్ట్రంలో ఎన్ఎల్సీ విస్తరణ, పవర్ ప్రాజెక్ట్‌లు నెలకొల్పడానికి ఉన్న అవకాశాలపై చర్చించాం. ప్రభుత్వం వైపు నుంచి మాకు అత్యంత సానుకూల వాతావరణం కనిపించింది. లిగ్నైట్ ద్వారా విద్యుదుత్పత్తి.. లిగ్నైట్ (గోధుమ బొగ్గు) ద్వారా విద్యుదుత్పత్తి చేయడం మా కార్పొరేషన్ ప్రత్యేకత. తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్‌లలో మాత్రమే ఈ బ్రౌన్ కోల్ అందుబాటులో ఉంది. ఎన్‌ఎల్‌సీఐ ద్వారా లిగ్నైట్ మైనింగ్ చేసి నైవేలీలోనే విద్యుదుత్పత్తి చేస్తాం. అలా ఉత్పత్తి అయిన విద్యుత్ 8 వేల మెగావాట్లు కాగా అందులో థర్మల్ పవర్ 6 వేల మెగావాట్లు ఉంటుంది. ఇక దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలకి కార్పొరేషన్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌కి దాదాపు 310 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఏపీలో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో.. దేశంలోనే తొలిసారిగా నైవేలీలో రూ.12 వేల కోట్లతో 1,320 మెగావాట్ల లిగ్నైట్ అల్ట్రా సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్‌ని ఏర్పాటుచేయబోతున్నాం. దీనికి సంబంధించి ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఒడిశా రాష్ట్రం తాలబిరలో రూ.22 వేల కోట్ల వ్యయంతో 3,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ని నిర్మించబోతున్నాం. అన్నీ అనుకూలిస్తే ఏపీలో రూ.3 వేల కోట్లతో 500–1000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు నచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం. 2025లోగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించగలిగితే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీల నుంచి కూడా కేంద్రం ద్వారా మినహాయింపు లభిస్తుంది. ఈ ప్రాజెక్టువల్ల ప్రత్యక్షంగా 200 మందికి పరోక్షంగా 1000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విద్యుత్ కూడా తక్కువ ధరకే దొరుకుతుంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) లిమిటెడ్‌తో ఏపీ ఇప్పటికే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ పొందడానికి ఒప్పందం చేసుకుంది. వారి ధర యూనిట్ రూ.2.49గా నిర్ణయించారు. మేం కూడా ఇంచుమించు అదే ధరకు సౌర విద్యుత్‌ను అందిస్తాం. -
నూతన, పునరుత్పాదక ఇంధన శాఖకు రూ.37,828.15 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖకు బడ్జెట్లో ప్రభుత్వం రూ.37,828.15 కోట్లు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్లో సవరించిన అంచనా(రూ.27,547.47 కోట్లు)తో పోలిస్తే ఇది 37 శాతం అధికం. ఈ శాఖ ఆధ్వర్యంలోని రెండు సంస్థలకు బడ్జెట్లో కేంద్రం భారీ కేటాయింపులు చేసింది. తాజా బడ్జెట్లో ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఐఆర్ఈడీఏ)కి రూ.35,777.35 కోట్లు కేటాయించారు. అలాగే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈసీఐ)కి రూ.2,050.80 కోట్లు కేటాయించారు. ఇంధన రంగంలో కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందజేయడానికి ఐఆర్ఈడీఏ 1987లో ఏర్పాటయ్యింది. నేషనల్ సోలార్ మిషన్(ఎన్ఎస్ఎం) అమలు, ఈ రంగంలో లక్ష్యాల సాధన కోసం ఎస్ఈసీఐని 2011లో నెలకొల్పారు. -
పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ చర్యలు భేష్
సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే ప్రశంసించారు. రాష్ట్ర ఇంధన శాఖ, ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) అధికారులతో బాక్రే ఆదివారం వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. తొలుత ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పునరుత్పాదక ఇంధన రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టినట్లు అభయ్ బాక్రేకు వివరించారు. రాష్ట్రంలో మొత్తం విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం 18.8 గిగావాట్లు ఉండగా, అందులో 40 శాతం (7.5 గిగా వాట్లు) పునరుత్పాదక ఇంధన ఉత్పత్తే అని తెలిపారు. ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి ఇతర రాష్ట్రాలకు కూడా పునరుత్పాదక ఇంధనాన్ని ఎగుమతి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం అభయ్ బాక్రే మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్థ్య రంగాలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీని ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. ఏపీ, కేరళ తరహాలో అన్ని రాష్ట్రాలు ఇంధన సామర్థ్య విభాగాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన సామర్థ్యం తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఏపీఎస్ఈసీఎం అధికారులకు బాక్రే సూచించారు. ఈ సమావేశంలో ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి, ఇంధన శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఇంధన రంగంలో ఏపీ చర్యలు భేష్.. కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఇంధన రంగంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు బాగున్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) ప్రాజెక్ట్ ఎకనామిస్ట్ మాల్వీ మెహ్రోత్రా ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు బీఈఈ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్(పాట్) పథకంపై రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్(ఏపీఎస్ఈసీఎం) బుధవారం విజయవాడలో అవగాహనా సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని భారీ పరిశ్రమల్లో ‘పాట్’ అమలు చేయడం ద్వారా సాధించిన ఫలితాలను ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. రాష్ట్రంలోని 36 భారీ పరిశ్రమల్లో దశాబ్దకాలంలో దాదాపు రూ.5,709 కోట్ల విలువైన 0.818 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ ఇంధనం(బొగ్గు, చమురు, గ్యాస్, లిగ్నైట్) ఆదా అయిందని తెలిపారు. 2.464 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయని.. భారీ పరిశ్రమలలో ఇంధన సామర్థ్యం పెరిగిందని చెప్పారు. పరిశ్రమలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరాపై వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. పాట్ పథకాన్ని భారీ పరిశ్రమలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ పథకం కింద పరిశ్రమలకు ఇంధన పొదుపు సర్టిఫికెట్లను బీఈఈ మంజూరు చేస్తుందని, వీటి ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందవచ్చన్నారు. పరిశ్రమల కోసం విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆధునీకరించి మరింత బలోపేతం చేయాలని సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారని విజయానంద్ పేర్కొన్నారు. ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. మొత్తం 65 ఎంఎస్ఎంఈ యూనిట్లలో ఐఓటీ పవర్ మానిటరింగ్ పరికరాలను అమర్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ సంస్థ జాయింట్ డైరెక్టర్ పుష్పేంద్ర నాయక్, ఈఈఎస్ఎల్ అసోసియేట్ మేనేజర్ కిషోర్ సింగ్ పాటిల్, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. -
హెచ్‌పీసీఎల్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి క్వార్టర్లో ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 36 శాతం క్షీణించి రూ. 1,795 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,184 కోట్లు ఆర్జించింది. మొత్తం టర్నోవర్ మాత్రం 68 శాతం జంప్‌చేసి రూ. 77,586 కోట్లను తాకింది. కాగా.. సామర్థ్య విస్తరణ, ఆధునీకరణ నేపథ్యంలో ముంబై రిఫైనరీ 45 రోజులపాటు పనిచేయలేదని కంపెనీ చైర్మన్, ఎండీ ముకేష్ కుమార్ సురానా పేర్కొన్నారు. దీంతో చమురు శుద్ధి కార్యక్రమాలు 3.97 మిలియన్ టన్నుల నుంచి తగ్గి 2.51 ఎంటీకి పరిమితమైనట్లు వెల్లడించారు. ముంబై రిఫైనరీని 25 శాతమే వినియోగించుకోగా.. వైజాగ్ యూనిట్ 98 శాతం సామర్థ్యంతోనే పనిచేసినట్లు తెలియజేశారు. మార్జిన్లు భేష్... క్యూ1లో హెచ్‌పీసీఎల్ స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) బ్యారల్‌కు 3.31 డాలర్లకు ఎగశాయి. గత క్యూ1లో ఇవి కేవలం 0.04 డాలర్లుగా నమోదయ్యాయి. కాగా.. అమ్మకాల పరిమాణం 7.62 మిలియన్ టన్నుల నుంచి 16 శాతం ఎగసి 8.83 ఎంటీకి చేరింది. ఈ కాలంలో పెట్రోల్ విక్రయాలు 37 శాతం, డీజిల్ 22 శాతం, ఏటీఎఫ్ 119 శాతం చొప్పున వృద్ధి చూపాయి. విస్తరణ తదుపరి ముంబై రిఫైనరీ సామర్థ్యం 7.5 ఎంటీ నుంచి 9.5 ఎంటీకి పెరిగినట్లు సురానా తెలియజేశారు. ప్రధాన పట్టణాలలోని పెట్రోల్ పంప్‌ల వద్ద ఈవీ చార్జింగ్కు వీలుగా టాటా పవర్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రస్తావించారు. క్యూ1లో కంపెనీ 142 రిటైల్ ఔట్లెట్లను కొత్తగా ప్రారంభించింది. అదనంగా 50 సీఎన్జీ ఔట్లెట్ల ఏర్పాటుతో వీటి సంఖ్య 724కు చేరింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌పీసీఎల్ షేరు ఎన్ఎస్ఈలో 0.65 శాతం నష్టంతో రూ. 273 వద్ద ముగిసింది. -
భారత్‌లో బీపీ గ్రూప్ విస్తరణ
న్యూఢిల్లీ: ఇంధన రంగంలో ఉన్న యూకే దిగ్గజం బీపీ గ్రూప్.. భారత్‌లో ఇంధన రిటైల్, మొబిలిటీ సొల్యూషన్స్‌లో విస్తరించనుంది. భారత్‌ను అసాధారణ మార్కెట్‌గా అభివర్ణించడమేగాక, నమ్మశక్యం కాని రీతిలో అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్యానించింది. అయితే సహజ వాయువును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని బీపీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ లూనీ కోరారు. సెరావీక్ నిర్వహించిన ఇండియా ఎనర్జీ ఫోరంలో ఆయన మాట్లాడారు. ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో వచ్చే ఐదేళ్లలో 5,500 రిటైల్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. పెట్రోల్, డీజిల్ విక్రయంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ సౌకర్యం కూడా వీటిలో ఉంటుంది. ఆర్ఐఎల్ భాగస్వామ్యంతో..: నెట్వర్క్ విస్తరణలో భాగంగా 80,000 ఉద్యోగాలను సృష్టిస్తాం అని లూనీ వివరించారు. ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీతో బీపీకి లోతైన, విశ్వసనీయ బంధం ఉందన్నారు. కాగా, ప్రస్తుతం ఆర్ఐఎల్కు 1,400 పెట్రోల్ బంకులు, 31 విమాన ఇంధన కేంద్రాలు ఉన్నాయి. ఆర్ఐఎల్–బీపీల సంయుక్త భాగస్వామ్య కంపెనీ వీటిని చేజిక్కించుకుని విస్తరించనుంది. ఐదేళ్లలో విమాన ఇంధన కేంద్రాలు మరో 14 రానున్నాయి. జేవీలో ఆర్ఐఎల్కు 51% వాటా ఉంది. 49% వాటాకు బీపీ గ్రూప్ రూ.7,000 కోట్లదాకా వెచ్చించింది. కేజీ బేసిన్ డీ6 బ్లాక్‌లో చమురు వెలికితీతకై ఇరు సంస్థలు రూ.37,000 కోట్లు పెట్టుబడి చేయనున్నాయి. ఇదిలావుంటే టోటల్ సీఈవో పాట్రిక్ పౌయన్నె మాట్లాడుతూ ఇంధన వినియోగంలో ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో 30 శాతమే ఉందన్నారు. ఇక్కడ అపార అవకాశాలున్నాయని చెప్పారు. ఎల్ఎన్జీ ఇంపోర్ట్ టెర్మినల్, సిటీ గ్యాస్, రెనివేబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు చేస్తున్నట్టు వెల్లడించారు. -
మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి..
రియాద్: వచ్చే ఐదేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలని నిర్దేశించుకున్న భారత్‌లో పెట్టుబడులకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ సౌదీ అరేబియా కంపెనీలను ఆహ్వానించారు. ఈ రంగంలో 100 బిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్ పెట్టుబడుల సదస్సు(ఎఫ్ఐఐ) 2019లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. మౌలిక రంగంపై రూ. 1.5 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇన్ఫ్రా రంగంలో కూడా ఇన్వెస్ట్ చేసేందుకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులను కల్పించే క్రమంలో పన్ను రేట్లను, మేధోహక్కుల విధానాలను సంస్కరించినట్లు చెప్పారు. నైపుణ్యాలను మెరుగుపర్చడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని.. వచ్చే 3–4 ఏళ్లలో 40 కోట్ల మందిని వివిధ రంగాల్లో సుశిక్షితులుగా తీర్చిదిద్దనున్నామని ఆయన పేర్కొన్నారు. విధానాల్లో అసమానతలతోనే అనిశ్చితి.. భారత్, సౌదీ అరేబియా వంటి భారీ వర్ధమాన దేశాల దిశపైనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఆధారపడి ఉందని మోదీ వ్యాఖ్యానించారు. బహుళపక్ష వాణిజ్య విధానాల్లో అసమానతల వల్లే ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘భారత్ వంటి పెద్ద వర్ధమాన దేశాల బాటపైనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఎక్కువగా ఆధారపడి ఉంది. గత నెల ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కూడా చెప్పినట్లు.. సమష్టిగా వృద్ధి సాధించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని విశ్వసిస్తున్నాం. జీ20 కూటమిలో.. అసమానతలు తగ్గించేందుకు, నిలకడగా అభివృద్ధిని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై భారత్, సౌదీ అరేబియా కలిసి పనిచేస్తున్నాయి’ అని మోదీ తెలిపారు. ప్రపంచ ఆర్థిక మందగమన ప్రభావాలను ఎదుర్కొనేందుకు ఆసియా దేశాలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. భారత్, సౌదీ అరేబియా ఇప్పటికే పలు సంస్కరణలు ప్రవేశపెట్టాయని చెప్పారు. ‘వ్యాపారాలకు అనువైన పరిస్థితులు నెలకొల్పేందుకు, ప్రపంచ వృద్ధికి .. స్థిరత్వానికి చోదకంగా నిల్చేందుకు భారత్ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టింది. సౌదీ అరేబియా కూడా తమ విజన్ 2030 సాధనలో భాగంగా సంస్కరణల ఎజెండాను అమలు చేస్తుండటం సంతోషించదగ్గ విషయం‘ అని ప్రధాని చెప్పారు. 15 బిలియన్ డాలర్ల డీల్స్ మూడు రోజుల ఎఫ్ఐఐ సదస్సులో భాగంగా తొలిరోజున సుమారు 15 బిలియన్ డాలర్ల విలువ చేసే 23 పెట్టుబడి ఒప్పందాలు కుదిరినట్లు సౌదీ అరేబియన్ జనరల్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఎస్‌ఏజీఏఐ) వెల్లడించింది. తమ దేశంలో పెట్టుబడులకు గల భారీ అవకాశాలకు ఇది నిదర్శనమని పేర్కొంది. విజన్ 2030లో భాగంగా సౌదీ అరేబియా భారీ స్థాయిలో ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తోందని ఎస్‌ఏజీఐఏ గవర్నర్ ఇబ్రహీం అల్–ఒమర్ తెలిపారు. మందగమనం తాత్కాలికం: ముకేశ్ అంబానీ భారత్‌లో మందగమనం తాత్కాలికమని, ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంస్కరణలతో రాబోయే రోజుల్లో పరిస్థితులు మెరుగుపడగలవని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు. ‘భారత ఎకానమీ స్వల్పంగా మందగించింది. కానీ, ఇది తాత్కాలికమే. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు క్రమంగా ఫలితాలనిస్తాయి. వచ్చే క్వార్టర్ నుంచి మందగమన ధోరణి కచ్చితంగా మారుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీ, యువ జనాభా, నాయకత్వం వంటి అంశాల్లో రెండు దేశాలకు చాలా సారూప్యతలు ఉన్నాయని .. వృద్ధి సాధనకు ఇవి దోహదపడగలవని పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న సందర్భంగా అంబానీ తెలిపారు. -
ఇక టీవీలూ, గీజర్లకూ రేటింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్ వాడకం ఆధారంగా ఇచ్చే స్టార్ రేటింగ్‌ను ఇక నుంచి టీవీలు, గీజర్లకు తప్పనిసరి చేయనున్నట్టు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ(బీఈఈ) తెలిపింది. విద్యుత్ వాడకాన్ని బట్టి వీటికి 1 నుంచి 5 వరకు బీఈఈ స్టార్ రేటింగ్ ఉంటుంది. ప్రస్తుతం స్వచ్ఛంద రేటింగ్ జాబితాలో ఉన్న టీవీలు, గీజర్లు 2014 జనవరి 1 నుంచి తప్పనిసరి రేటింగ్ జాబితా కిందకు వెళ్తాయి. తద్వారా ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ట్రాన్స్ఫార్మర్ల సరసన చేరతాయి. స్టార్ ఏసీ కనుమరుగు.. 2014 జనవరి 1 నుంచి స్టార్ రేటింగ్‌ను కఠినతరం చేయనున్నట్టు బీఈఈ డెరైక్టర్ జనరల్ అజయ్ మాథుర్ తెలిపారు. బుధవారమిక్కడ సీఐఐ 12వ ఎనర్జీ ఎఫీషియెన్సీ సమ్మిట్-2013లో పాల్గొన్న ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ‘ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ప్రస్తుత రేటింగ్‌ను మారుస్తాం. అంటే 5 స్టార్ 4 స్టార్ అవుతుంది. 4 స్టార్ 3 స్టార్ అవుతుంది. ఈ విధానంలో ప్రస్తుత 1 స్టార్ ఏసీలు కనుమరుగవుతాయి. అలాగే 5 స్టార్ ఉపకరణం మరింత సమర్థవంతంగా పనిచేసి అతి తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది’ అని తెలిపారు. అయితే ఉత్పత్తుల ధరలు పెరగడానికి రేటింగ్ ఒక్కటే కారణం కాదు. ముడిసరుకు ధర పెరగడం, రూపాయి పతనం కూడా కారణమని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్‌ను ఆదా చేసే పరిజ్ఞానం అభివృద్ధికి పరిశోధనా సంస్థలకు, కంపెనీలకు రుణ సహాయం చేసే అంశంపై కేంద్ర ఆర్థిక శాఖతో చర్చిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన చెప్పారు.