మాల్వీ మెహ్రోత్రా
సాక్షి, అమరావతి: ఇంధన రంగంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు బాగున్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) ప్రాజెక్ట్ ఎకనామిస్ట్ మాల్వీ మెహ్రోత్రా ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు బీఈఈ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్(పాట్) పథకంపై రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్(ఏపీఎస్‌ఈసీఎం) బుధవారం విజయవాడలో అవగాహనా సదస్సు నిర్వహించింది.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని భారీ పరిశ్రమల్లో ‘పాట్’ అమలు చేయడం ద్వారా సాధించిన ఫలితాలను ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. రాష్ట్రంలోని 36 భారీ పరిశ్రమల్లో దశాబ్దకాలంలో దాదాపు రూ.5,709 కోట్ల విలువైన 0.818 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ ఇంధనం(బొగ్గు, చమురు, గ్యాస్, లిగ్నైట్) ఆదా అయిందని తెలిపారు. 2.464 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయని.. భారీ పరిశ్రమలలో ఇంధన సామర్థ్యం పెరిగిందని చెప్పారు.
పరిశ్రమలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరాపై వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. పాట్ పథకాన్ని భారీ పరిశ్రమలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ పథకం కింద పరిశ్రమలకు ఇంధన పొదుపు సర్టిఫికెట్లను బీఈఈ మంజూరు చేస్తుందని, వీటి ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందవచ్చన్నారు. పరిశ్రమల కోసం విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆధునీకరించి మరింత బలోపేతం చేయాలని సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారని విజయానంద్ పేర్కొన్నారు.
ఏపీఎస్‌ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. మొత్తం 65 ఎంఎస్‌ఎంఈ యూనిట్లలో ఐఓటీ పవర్ మానిటరింగ్ పరికరాలను అమర్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ సంస్థ జాయింట్ డైరెక్టర్ పుష్పేంద్ర నాయక్, ఈఈఎస్‌ఎల్ అసోసియేట్ మేనేజర్ కిషోర్ సింగ్ పాటిల్, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment