సాక్షి, అమరావతి: ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తోడ్పాటుగా ప్యాసింజర్ ఆటోల విద్యుద్దీకరణకు కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) అంగీకరించింది. ఈ క్రమంలో తొలివిడతగా తిరుపతిలో 200, విశాఖపట్నంలో 100 త్రీవీలర్లు ఎలక్ట్రికల్ వాహనాలుగా మారనున్నాయి.
మరోవైపు జాతీయ రహదారుల వెంబడి ప్రతి 25 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్, నగరాల్లో ప్రతి మూడు కిలోమీటర్లకు చార్జ్ పాయింట్ చొప్పున నెడ్‌కాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇంధన సంరక్షణ మిషన్ ఆధ్వర్యంలో ‘గో ఎలక్ట్రిక్ ప్రచారం’లో భాగంగా త్రీ–వీలర్ ప్యాసింజర్ ఆటోల విద్యుదీకరణ (రెట్రోఫిట్టింగ్)కు స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ ఫండ్ నుంచి రూ.2 కోట్లు వెచ్చించనున్నారు.
ఏపీతో సహా 14 రాష్ట్రాల్లో..
దేశంలో 2030 నాటికి 1 బిలియన్ టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గించాల్సిన అవసరం ఉందని గుర్తించిన కేంద్రం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఏపీతో సహా 14 రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. రాయితీలు అందించేందుకు రూ.8,596 కోట్ల నిధులను కేటాయించింది.
టూ వీలర్లకు కిలోవాట్‌కు రూ.15 వేలు, 3,4 చక్రాల వాహనాలకు కిలోవాట్‌కు రూ.10 వేలు, ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులకు కిలోవాట్‌కు రూ.20వేల చొప్పున రాయితీ ప్రకటించింది. తద్వారా 2024 నాటికి దేశ వ్యాప్తంగా 7వేల ఎలక్ట్రిక్ బస్సులు, 5 లక్షల త్రీ వీలర్లు, 55 వేల ఫోర్ వీలర్ ప్యాసింజర్ కార్లు, 10 లక్షల టూ వీలర్లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీని వేగంగా స్వీకరించడం, తయారు చేయడం (ఫేమ్–2) పథకం కింద దేశవ్యాప్తంగా 2019 నుంచి 4.08 లక్షల వాహనాలు, రాష్ట్రంలో 15,865 ఈ–వాహనాలను విక్రయించారు. రోజుకు 3,76,801 లీటర్ల ఇంధనం ఆదా అయ్యింది. దీంతో రోజుకు 8,57,441 కేజీల కార్బన్‌డయాక్సైడ్ తగ్గింది.
ఏపీ ముందడుగు..
వచ్చే పదేళ్లలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఏపీ ముందడుగు వేస్తోంది. ఆటోలను ఈవీలుగా మార్చేందుకు ముందుకొచ్చింది. దీనికి ఫేమ్–2 పథకం ద్వారా రాయితీలిచ్చేందుకు బీఈఈ నుంచి అనుమతినిచ్చాం. ఈవీలను ప్రోత్సహించడానికి వైజాగ్, హైదరాబాద్, చెన్నై, లక్నో, బెంగళూరు, జైపూర్ వంటి ప్రధాన నగరాల్లో అతి త్వరలో సమావేశాలు నిర్వహించనున్నాం.
–అభయ్ బక్రే, డైరెక్టర్ జనరల్, బీఈఈ
అందరికీ అందుబాటులో ఈవీ స్టేషన్లు..
రాష్ట్రంలో దాదాపు 109 ఛార్జింగ్ స్టేషన్లున్నాయి. రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రతి 25 కిలోమీటర్లకు, నగరాల్లోని ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ చొప్పున అందుబాటులోకి తీసుకురావడానికి నెడ్‌కాప్ ప్రణాళికలు తయారు చేసింది. ప్రైవేట్ భూ యజమానులతో కలిసి 4 వేల లొకేషన్లను ఇందుకోసం గుర్తించింది. 10 మంది డెవలపర్లను కూడా ఎంపానెల్ చేసింది.
– ఎస్.రమణారెడ్డి, వీసీఎండీ, నెడ్‌కాప్
Comments
Please login to add a commentAdd a comment