సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్య రంగంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాలలో ఏపీ ఒకటని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సెక్రటరీ ఆర్.కే. రాయ్ కొనియాడారు. ఇంధన భద్రత, పర్యావరణ లక్ష్యాలను సాధించడంతో పాటు ఆర్థిక వ్యవస్థపై ఇంధన తీవ్రతను తగ్గించడానికి సహాయపడే ఇంధన సామర్థ్య కార్యకలాపాలకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఇంధన సామర్థ్య పరికరాలను అమర్చే ప్రాజెక్టును ఏపీ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం) రికార్డు స్థాయిలో నెల రోజుల్లోనే పూర్తిచేసింది.
ఈ ప్రాజెక్టును రాయ్ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీ భవన్‌లో ఏటా 1.96 లక్షల యూనిట్ల విద్యుత్తును, రూ.39 లక్షల మేర ప్రజా ధనాన్ని ఆదా చేయొచ్చని చెప్పారు. 139 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించొచ్చన్నారు. ఇందుకోసం పెట్టిన పెట్టుబడి 13 నెలల్లోనే ఇంధనం ఆదా రూపంలో తిరిగి పొందవచ్చన్నారు. తొలి దశలో హాలోజన్ ల్యాంప్‌ల స్థానంలో 190 వాట్ల కెపాసిటీ గల 12 ఎల్‌ఈడీ ఫ్లడ్ లైట్లు, సంప్రదాయ సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో 28 వాట్స్ కెపాసిటీ గల 170 బీఎల్‌డీసీ సీలింగ్ ఫ్యాన్లు, 1.8 టీఆర్ 3 స్టార్ రేటెడ్ హాట్ అండ్ కోల్డ్ ఇన్వర్టర్ టైప్ స్ప్లిట్ ఏసీలు, కారిడార్ల వద్ద లైట్లను నియంత్రించడానికి 40 మోషన్ సెన్సార్లను ఏర్పాటు చేశారని తెలిపారు.
దీనివల్ల ఏటా రూ.6.25 లక్షల విలువైన49,469 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుందన్నారు. నెల రోజుల్లోనే పనులు పూర్తి చేసిన ఏపీఎస్‌ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డిని రాయ్ అభినందించారు. ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు. ఇంధన సామర్థ్య చర్యలకు న్యూ ఢిల్లీలో బీఈఈ ఎంపిక చేసిన తొలి రాష్ట్ర భవన్ ఏపీ భవన్. ఇక్కడి ఇంధన పొదుపు చర్యల ఫలితాల ఆధారంగా ఇతర రాష్ట్ర ప్రభుత్వాల భవనాల్లోనూ ఇదే ప్రాజెక్టును అమలు చేయాలని బీఈఈ భావిస్తోంది. ఏపీ భవన్‌ను ఎంపిక చేసి ఏపీఎస్‌ఈసీఎం ద్వారా ఇంధన సామర్థ్య చర్యలను విజయవంతంగా అమలు చేసిన బీఈఈకి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment