![Three Percent of Indians have a healthy relationship with technology](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/LAPTOP.jpg.webp?itok=ov_KcXQd)
3 శాతం మంది మాత్రమే టెక్నాలజీని ఆదుపాజ్ఞల్లో పెట్టుకున్నారు
దీంతో మానసిక సమస్యల వలయంలో చిక్కుకుంటున్న వైనం
సర్వేలో వెల్లడైన విస్మయకర విషయాలు
భారతీయులు ఉదయం లేచించి మొదలు రాత్రి పడుకునేదాకా ఎల్రక్టానిక్ డివైజ్‌లతో గడుపుతున్నారు. డెస్క్ టాప్‌తో మమేకమవుతారు. డెస్క్ టాప్ నుంచి తల పక్కకు తిప్పితే నేరుగా ల్యాప్‌టాప్‌లో తలదూర్చేస్తారు. ఒకవేళ ల్యాప్‌టాప్ పక్కనబెడితే స్మార్ట్‌ఫోన్ లేదంటే ట్యాబ్ లేదంటే ఇంకో డివైజ్‌కు దాసోహం అవుతున్నారు. దీంతో ఎన్నో సమస్యలు.
తక్కువ నిజాలు, ఎక్కువ అబద్ధాలతో కూడిన సమాచారాన్ని మాత్రమే నమ్మడం, సోషల్‌మీడియా లో ప్రతికూల వార్తలనే ఎక్కువగా ఫాలో అవడం, ఫోన్ రింగ్ కాకపోయినా వచ్చినట్లు, మెసేజ్ రాకపోయినా వచ్చినట్లు భావించడం, అతి డివైజ్‌ల వాడకంతో సాధారణ విషయగ్రహణ సామర్థ్యం సన్నగిల్లడం, ఒంటరిగా ఉంటేనే బాగుందని అనిపించడం, వెంటనే స్పందించే గుణం కోల్పోవడం, అతి ఉద్రేకం లేదంటే నిస్సత్తువ ఆవహించడం, ఏకాగ్రత లోపం.. ఇలా ఎన్నో సమస్యలకు ఎల్రక్టానిక్ డివైజ్‌లు హేతువులుగా మారాయి.
వాటి అదుపాజ్ఞల్లోకి వెళ్లకుండా వాటినే తమ అదుపాజ్ఞల్లో పెట్టుకున్న భారతీయులు కేవలం మూడు శాతమేనని తాజా సర్వే కుండబద్దలు కొట్టింది. దాదాపు 83,000 కౌన్సిలింగ్ సెషన్లు, 12,000 స్క్రీనింగ్‌లు, 42,0000 అంచనాలను పరిశీలించి చేసిన సర్వేలో ఇలాంటి ఎన్నో విస్మయకర అంశాలు వెలుగుచూశాయి. డిజిటల్ డివైజ్‌లతో సహవాసం చేస్తూ భారతీయులు ఏపాటి మానసిక ఆరోగ్యంతో ఉన్నారనే అంశాలతో వన్‌టూవన్‌హెల్ప్ అనే సంస్థ ‘ది స్టేట్ ఆఫ్ ఎమోషనల్ వెల్‌బీయింగ్,2024’అనే సర్వే చేసి సంబంధిత నివేదికను వెల్లడించింది.
సగం మంది డివైజ్‌లను వదల్లేక పోతున్నారు
సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది తమ ఎల్రక్టానిక్ డివైజ్‌లను వదిలి ఉండలేకపోతున్నారు. మరో పది శాతం మందికి డిజిటల్ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో తెలీక సతమతమవుతున్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించి కౌన్సిలింగ్ తీసుకుంటున్న వారి సంఖ్య 15 శాతం పెరిగింది. ఆదుర్తా, కుంగుబాటు, పనిచేసే చోట ఒత్తిడి వంటి ప్రధాన కారణాలతో ప్రజలు మానసిక ఆరోగ్యం బాగు కోసం నిపుణులను సంప్రతించడం పెరిగింది. వృత్తిసంబంధ అంశాల్లో సమస్యలను ఎదుర్కొంటున్న వారిలో 23 శాతం మంది తాము పనిచేసేచోట ప్రతికూల వాతావరణంలో పనిచేస్తున్నట్లు తేలింది. ఇది ఆరోగ్యవంతమైన పని వాతావరణం ఆవశ్యకతను గుర్తుచేస్తోంది.
కౌన్సిలింగ్ కోసం పురుషుల్లో పెరిగిన ఆసక్తి
గతంలో ఏదైనా థెరపీ చేయించుకోవాలన్నా, మానసికంగా ఒక సాంత్వన కావాలంటే ఒకరి తోడు అవసరమని మహిళలు భావిస్తుంటారు. మగాడై ఉండి థెరపీ చేయించుకోవడమేంటనే ఆలోచనాధోరణి ఇన్నాళ్లూ పురుషుల్లో ఉండేది. ఇప్పుడు ఆ ధోరణిలో కాస్తంత మార్పు వచ్చింది. గతంతో పోలిస్తే 7 శాతం మంది ఎక్కువగా పురుషులు థెరపీలు సిద్ధపడుతున్నారు. ఆర్థికసంబంధ కన్సల్టేషన్లు పొందిన వారిలో 70 శాతం మంది పురుషులే ఉన్నాయి. ఇక మానవీయ సంబంధాలకు సంబంధించిన కౌన్సిలింగ్ సెషన్లలో 60 శాతం దాకా మహిళలే కనిపించారు.
యువతలో పెరిగిన మానసిక సమస్యలు
ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువతలో నైరాశ్యం పెరుగుతోంది. 30 ఏళ్లలోపు వయసు యువతలో అత్యధికంగా ఆదుర్దా, కుంగుబాటు సమస్యలు ఎక్కువయ్యాయి. ఉద్యోగం మారాల్సి రావడం, జీవితభాగస్వామితో సత్సంబంధం కొనసాగించడం వంటి అంశాలకొచ్చేసరికి యువత ఆత్రుత, కుంగుబాటుకు గురవుతోంది. పాతికేళ్లలోపు యువతలో 92 శాతం మందిలో ఆత్రుత, 91% మందిలో కుంగుబాటు కనిపిస్తున్నాయి.
ఆత్మహత్య భయాలూ ఎక్కువే
ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్న వారి సంఖ్య గతంతో పోలిస్తే 22 శాతం పెరిగింది. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని చెప్పిన వాళ్ల సంఖ్య 2023తో పోలిస్తే 17 శాతం పెరగడం ఆందోళనకరం. తమకు కౌన్సిలింగ్ అవసరమని భావిస్తున్న వారిలో సగం మంది ఇప్పటికే తీవ్రమైన భావోద్వేగ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఎక్కువ మందికి తక్షణం మానసిక సంబంధ తోడ్పాటు అవసరమని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే భారతీయుల్లో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన బాగా పెరిగింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment