‘థర్మల్‌’ వెలుగులు | AP prefers thermal electricity | Sakshi
Sakshi News home page

‘థర్మల్‌’ వెలుగులు

Published Wed, Dec 27 2023 5:29 AM | Last Updated on Wed, Dec 27 2023 7:37 AM

AP prefers thermal electricity - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో కర్బన ఉద్గారాలను 2070 నాటికి సున్నా స్థాయికి తీసుకురావాలనే లక్ష్యంలో భాగంగా రానున్న కాలంలో పునరుత్పా­దక విద్యుత్‌ వినియోగాన్ని పెంచుకుని.. థర్మల్‌ విద్యుత్‌ను తగ్గించుకోవాలని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ కొన్ని నెలల క్రితం అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీ జెన్‌కో) థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో రిజర్వు షట్‌ డౌన్‌ (ఉత్పత్తి తగ్గింపు)పై  విధివిధానాలను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) కూడా ప్రకటించింది.

పూర్తిగా మూసేయాల్సిన అవసరం లేదని, గ్రిడ్‌కు ప్రమాదం వాటిల్లే పరిస్థితి వస్తే అప్పుడు థర్మల్‌ యూనిట్లు షట్‌డౌన్‌ చేయవచ్చని ఏపీ ఈఆర్‌సీ స్పష్టం చేసింది. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా అకస్మాత్తుగా విద్యుత్‌ డిమాండ్‌ పడిపోయినప్పుడు కూడా ఉత్పత్తి తగ్గించవచ్చని పేర్కొంది. తక్కువ ధరకు విద్యుత్‌ అందించే ఉత్పత్తి సంస్థలకు మొదట ప్రాధాన్యం ఇచ్చేలా కొన్ని యూనిట్లను రిజర్వు షట్‌ డౌన్‌ చేసే వెసులుబాటు కల్పించింది.

దీంతో రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్‌ సామర్థ్యాన్ని అత్యవసరంగా తగ్గించాల్సిన ఆవçశ్యకత రాలేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎన్‌టీటీపీఎస్‌)లో 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం గల సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ యూనిట్‌ ఈ నెల 20న వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించింది.

2024లో 17 థర్మల్‌ ప్లాంట్లు
భవిష్యత్‌లో పెరుగనున్న విద్యుత్‌ డిమాండ్‌ను తట్టుకోవాలంటే పునరుత్పాదక ఇంధనంతో పాటు శిలాజ ఇంధన ఉత్పత్తిపైనా దృష్టి సారించాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా గుర్తించాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ఒకడుగు ముందే ఉంది. ఇప్పటికే సోలార్, విండ్, హైడల్‌ కలిపి ఉండే పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ప్లాంట్లకు శ్రీకారం చుట్టింది. గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన ఒప్పందాలు కుదుర్చు­కుంది.

ఇంధన రంగంలో ఏపీ చర్యలను ఇప్పటికే అనేక పర్యాయాలు ప్రశంసించిన కేంద్రం రాష్ట్రం బాటలోనే నిర్ణయాలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా భారీగా బొగ్గు ఆధారిత ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. 2024లో దేశంలో రోజువారీ విద్యుత్‌ డిమాండ్‌ 256 గిగావాట్లకంటే ఎక్కువ ఉంటుందని సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నివేదిక అంచనా వేసింది. 2031–32కి ఇది 366.39 గిగావాట్లకు పెరుగుతుందని చెప్పింది.

2041–42కి 574.68 గిగావాట్లకు పెరగొచ్చనే అంచనాతో విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం పెంపు అనివార్యమైంది. దీంతో 2024లో 17 గిగావాట్ల సామర్థ్యం గల థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని, తర్వాత మరో 33 గిగావాట్ల ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని ప్రణాళిక రూపొందించింది. ఇలా దాదాపు రూ.7.28 లక్షల కోట్ల పెట్టుబడితో 91 థర్మల్‌ ప్లాంట్లు స్థాపించాలని యోచిస్తున్నట్టు కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

దేశంలోనే ఆదర్శంగా ఏపీ
ఏపీ గ్రిడ్‌ డిమాండ్‌ గతేడాది రోజుకు 190 మిలియన్‌ యూనిట్ల  నుంచి 200 మిలియన్‌ యూనిట్లు ఉండగా.. ఈ ఏడాది 220 నుంచి 245 మిలియన్‌ యూనిట్లు రికార్డయ్యింది. అయినప్పటికీ విద్యుత్‌ కొరత లేకుండా సరఫరా చేయడంలో థర్మల్‌ కేంద్రాలు కీలక భూమిక పోషించాయి. ఎన్‌టీటీపీఎస్‌  ఆపరేషన్, మెయింటెనెన్స్‌ యూనిట్ల లభ్యత శాతం 2022–23 ఆర్థిక సంవత్సరంలో 69.90 శాతం ఉంటే.. ఈ ఏడాదిలో 75.83 శాతానికి పెరిగింది. అలాగే గతేడాది ఎన్‌టీపీఎస్‌ స్టేజ్‌–4 యూనిట్‌  హీట్‌ రేట్‌ 2,517 కిలో వాట్‌ అవర్‌ నుంచి 2,436 తగ్గింది.

అదేవిధంగా 2022–23లో ఎంవీఆర్‌ ఆర్టీపీ­పీ స్టేషన్‌ యూనిట్ల లభ్యత 67.85 శాతం నుంచి 75.68 శాతానికి మెరుగుపడింది. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలోనే అత్యుత్తమ థర్మల్‌ ప్లాంట్‌గా  ఆర్టీపీపీ గుర్తింపు పొందింది. ఆంధ్రప్ర­దేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ (ఏపీ జెన్‌కో) తన అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ డెవల­ప్‌­మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీ పీడీసీఎల్‌)తో కలిసి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు నిర్వహిస్తోంది. వీటిలో సామర్థ్యాన్ని మించి దాదాపు 10 మెగావాట్ల అధిక విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది.

రాష్ట్ర గ్రిడ్‌ అవసరాలను సాధ్యమైనంత ఎక్కువగా తీర్చాలనే లక్ష్యంతో ఏపీ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతూ వస్తోంది. అందులో భాగంగానే కృష్ణప­ఛిట్నంలోని దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో ఈ ఏడాది మార్చి 10న 800 మెగావాట్ల యూనిట్‌ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. తాజాగా ఎన్‌టీ­టీపీ­ఎస్‌లో 8వ యూనిట్‌  సీవో­డీతో జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పాదన సామర్థ్యం 5,810 మెగావాట్ల నుంచి 6,610 మెగావాట్లకు పెరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement