న్యూఢిల్లీ: ఇంధన రంగంలో ఉన్న యూకే దిగ్గజం బీపీ గ్రూప్.. భారత్‌లో ఇంధన రిటైల్, మొబిలిటీ సొల్యూషన్స్‌లో విస్తరించనుంది. భారత్‌ను అసాధారణ మార్కెట్‌గా అభివర్ణించడమేగాక, నమ్మశక్యం కాని రీతిలో అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్యానించింది. అయితే సహజ వాయువును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని బీపీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ లూనీ కోరారు. సెరావీక్ నిర్వహించిన ఇండియా ఎనర్జీ ఫోరంలో ఆయన మాట్లాడారు. ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో వచ్చే ఐదేళ్లలో 5,500 రిటైల్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. పెట్రోల్, డీజిల్ విక్రయంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ సౌకర్యం కూడా వీటిలో ఉంటుంది.
ఆర్‌ఐఎల్ భాగస్వామ్యంతో..: నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా 80,000 ఉద్యోగాలను సృష్టిస్తాం అని లూనీ వివరించారు. ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీతో బీపీకి లోతైన, విశ్వసనీయ బంధం ఉందన్నారు. కాగా, ప్రస్తుతం ఆర్‌ఐఎల్‌కు 1,400 పెట్రోల్ బంకులు, 31 విమాన ఇంధన కేంద్రాలు ఉన్నాయి. ఆర్‌ఐఎల్–బీపీల సంయుక్త భాగస్వామ్య కంపెనీ వీటిని చేజిక్కించుకుని విస్తరించనుంది. ఐదేళ్లలో విమాన ఇంధన కేంద్రాలు మరో 14 రానున్నాయి. జేవీలో ఆర్‌ఐఎల్‌కు 51% వాటా ఉంది. 49% వాటాకు బీపీ గ్రూప్ రూ.7,000 కోట్లదాకా వెచ్చించింది. కేజీ బేసిన్ డీ6 బ్లాక్‌లో చమురు వెలికితీతకై ఇరు సంస్థలు రూ.37,000 కోట్లు పెట్టుబడి చేయనున్నాయి. ఇదిలావుంటే టోటల్ సీఈవో పాట్రిక్ పౌయన్నె మాట్లాడుతూ ఇంధన వినియోగంలో ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో 30 శాతమే ఉందన్నారు. ఇక్కడ అపార అవకాశాలున్నాయని చెప్పారు. ఎల్‌ఎన్‌జీ ఇంపోర్ట్ టెర్మినల్, సిటీ గ్యాస్, రెనివేబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు చేస్తున్నట్టు వెల్లడించారు.
భారత్‌లో బీపీ గ్రూప్ విస్తరణ
Published Tue, Oct 27 2020 5:50 AM | Last Updated on Tue, Oct 27 2020 5:50 AM
Comments
Please login to add a commentAdd a comment