Solar Vs Nuclear: Nuclear Power Generation Falls In FY23 - Sakshi
Sakshi News home page

ఎంత ప్రమాదమో తెలిసొచ్చింది.. వెలుగులు అణువంతే!

Published Thu, Aug 3 2023 4:28 AM | Last Updated on Thu, Aug 3 2023 11:40 AM

Solar vs Nuclear: Nuclear power generation falls in FY23 - Sakshi

అణు బాంబు సృష్టికర్త ఒప్పెన్హీమర్‌ జీవిత గాథ హాలీవుడ్‌ తెరపైకెక్కడంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి అణు శక్తిపై చర్చ మొదలైంది. అణు పరిజ్ఞానం ఇప్పటిదాకా ఎన్నోసార్లు చర్చల్లో నానుతూనే ఉంది. ఇటీవలి కాలంలో పర్యావరణాన్ని పరిరక్షించే పునరుద్పాతక ఇంధన శక్తుల వినియోగంపై అవగాహన పెరగడంతో అణుశక్తి ప్రభ క్రమంగా తగ్గుతూ వస్తోంది. దాని స్థానాన్ని సౌర విద్యుత్‌ ఆక్రమిస్తోంది...

అణు శాస్త్రవేత్త జె. రాబర్ట్‌ ఒప్పెన్హీమర్‌ 1940లో తొలిసారి అణు బాంబును సృష్టించారు. తర్వాత పదేళ్లకు 1950లో తొలి అణు విద్యుత్కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో దాన్ని ఇంధన రంగంలో గేమ్‌ చేంజర్‌గా భావించారు. కానీ అణు విద్యుత్కేంద్రాలు ఎంత ప్రమాదకరమో అనుభవపూర్వకంగా తెలిసొచ్చాక వాటికి ఆదరణ క్రమంగా తగ్గుతూ వస్తోంది. జపాన్, అమెరికా, ఫ్రాన్స్‌ తప్ప మిగతా దేశాల్లో అణు ఇంధనానికి ప్రాధాన్యమూ తగ్గుతూ వస్తోంది. జర్మనీ ప్రభుత్వం 3 అణు విద్యుత్‌ కేంద్రాలను మూసివేయడం గమనార్హం.

అణు వర్సెస్‌ సౌర విద్యుత్‌
1970 దశకంలో అణు విద్యుత్‌ ఒక వెలుగు వెలిగింది. అణు శక్తికి అది స్వర్ణయుగమని చెప్పొచ్చు. చాలా దేశాల్లో భారీగా అణు ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అలా ప్రపంచ విద్యుదుత్పత్తిలో అణు విద్యుత్‌ వాటా 1985 కల్లా ఏకంగా 15.1% దాకా పెరిగింది. కానీ 2022 నాటికి అది 9.1 శాతానికి పడిపోయింది. సౌరవిద్యుత్‌ వినియోగంలోకి రావడమే దీనికి ప్రధాన కారణం. ‘‘2021లో ప్రపంచ దేశాల్లో సౌర విద్యుత్‌ 1.04 టెరావాట్స్‌ కాగా, ప్రపంచ అణు విద్యుత్‌ సామర్థ్యం 463 గిగావాట్లు. అంటే అణు విద్యుత్‌ కంటే సౌర విద్యుత్‌ రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది’’ అని ఇస్రోలో సోలార్‌ ప్యానెల్‌ డివిజన్‌ మాజీ శాస్త్రవేత్త మనీశ్‌ పురోహిత్‌ చెప్పారు.

సౌర విద్యుత్‌తో లాభాలు...
► సౌర విద్యుత్‌కు ముడి సరుకు సూర్యుడే గనుక దానికి కొరత ఉంటుందన్న భయం లేదు.
► సోలార్‌ ప్యానెల్స్, యూనిట్ల ధర బాగా తగ్గింది. సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణ వ్యయం మెగావాట్‌కు 10 లక్షల డాలర్లే. సౌర విద్యుత్‌ వ్యర్థాలను నిర్మూలించే క్రమంలో ఎలాంటి ప్రమాదానికీ ఆస్కారం లేదు.
► అణు విద్యుత్కేంద్రం ఏర్పాటే అత్యంత ఖరీదైన వ్యవహారం. కొత్తగా అణు ప్లాంట్‌ నిర్మాణానికయ్యే వ్యయం కనీసం 1,000 కోట్ల డాలర్లు.
► అణు విద్యుదుత్పత్తి వల్ల వెలువడే అణు ధారి్మక వ్యర్థాల నిర్మూలన అత్యంత ప్రమాదంతో కూడిన వ్యవహారం.
► ఒక్కో అణు విద్యుత్కేంద్రం నుంచి ఏటా కనీసం 20 మెట్రిక్‌ టన్నుల అణు ధారి్మక వ్యర్థాలు వెలువడతాయి.
► ప్రస్తుతం అన్ని దేశాల వద్దా కలిపి 90 వేల మెట్రిక్‌ టన్నుల అణు ధారి్మక
వ్యర్థాలున్నాయి. వీటిని అత్యంత సురక్షిత పద్ధతిలో నిర్మూలించకపోతే ఎన్నో రకాలుగా తీవ్ర ముప్పు వాటిల్లుతుంది.
► పైగా అణు విద్యుత్కేంద్రాలతో ప్రమాదాలు కూడా ఎక్కువే. అందుకే కొత్త ప్లాంట్ల ఏర్పాటును అడ్డుకుంటూ ఎన్నో పోరాటాలు జరిగాయి, జరుగుతున్నాయి.
► దాంతో చాలా ఏళ్లుగా కొత్త అణు విద్యుత్కేంద్రాలేవీ రాలేదు.
► అమెరికా, జపాన్, ఫ్రాన్స్‌ మినహా మరే దేశాలు అణు విద్యుత్‌పై మొగ్గు చూపించకపోవడంతో అంతర్జాతీయంగా ఒప్పందాలు, పరస్పర సాంకేతిక సహకారం తగ్గిపోయాయి. ఫలితంగా అణు విద్యుత్‌ చుట్టూ చీకట్లు అలుముకున్నాయి.


అణ్వాయుధాలు తగ్గిపోతున్నాయ్‌!
► అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో కొన్నేళ్లు పాటు అణ్వాయుధాల పోటీయే ప్రధానంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల దగ్గర 1986 నాటికి ఏకంగా 64,452 అణ్వాయుధాలు పోగుపడ్డాయి.
► ఇప్పుడు వాటి సంఖ్య 12,510కి తగ్గింది. వీటిలో 89% రష్యా, అమెరికా దగ్గరే ఉన్నాయి.
► అణు వినాశనం ఎంత భయానకంగా ఉంటుందో హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణు బాంబు దాడులతో అందరికీ తెలిసొచి్చంది.
► ఏళ్లు గడిచే కొద్దీ అణ్వాయుధాల తయారీని తగ్గించడంపై దేశాలన్నీ దృష్టి సారించాయి.  

అణు విద్యుత్‌ రియాక్టర్ల సగటు జీవిత కాలం 60 ఏళ్లు. ఇప్పుడున్న వాటిలో చాలావరకు ఇక పనికి రాని స్థితికి వచ్చేశాయి. కొత్తవి ఏర్పాటు కావడం లేదు. దాంతో అణు విద్యుదుత్పత్తి తగ్గుతూ వస్తోంది
– డాక్టర్‌ నితేంద్ర సింగ్, ఇండియన్‌ యూత్‌ న్యూక్లియర్‌ సొసైటీ వ్యవస్థాపకుడు
-1968లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం కుదిరిన తర్వాత అణు శక్తిని ప్రజాప్రయోజనాలకే తప్ప, వినాశనానికి వాడొద్దని దేశాలన్నీ నెమ్మదిగా గ్రహించాయి.
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement