ఏడు అవార్డులతో అటామిక్ సైంటిఫిక్ థ్రిల్లర్ ‘ఆపెన్‌హైమర్’ హవా
ఒక్క అవార్డుకే పరిమితమైన ‘బార్బీ’
అణు బాంబు సౌండ్ అదిరింది.. క్రిస్టోఫర్ కల నిజమైంది... ‘ఆర్‌ఆర్‌ఆర్’ నాటు నాటు ఆకర్షణగా నిలిచింది. ఫేక్ చప్పట్లతో మెస్సీ (శునకం), ఆమిర్ ఖాన్ ‘పీకే’ తరహాలో జాన్ ప్రత్యక్షం కావడం చర్చలకు దారి తీసింది.ఇలా ఆనందాలు, వింతలు, విడ్డూరాలతో ఆస్కార్ అవార్డు వేడుక జరిగింది. ఆ విశేషాలు తెలుసుకుందాం.
విజేతల వివరాలు:
• ఉత్తమ చిత్రం: (ఆపెన్ హైమర్)
• దర్శకుడు : క్రిస్టోఫర్ నోలన్ (ఆపెన్ హైమర్)
• నటుడు: సిలియన్ మర్ఫీ (ఆపెన్ హైమర్)
• నటి: ఎమ్మాస్టోన్ (పూర్ థింగ్స్)
• సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఆపెన్ హైమర్)
• సహాయ నటి: డేవైన్ జో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్)
• సినిమాటోగ్రఫీ: ఆపెన్ హైమర్
• డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: 20 డేస్ ఇన్ మరియోపోల్
• హెయిర్ స్టయిల్ అండ్ మేకప్: నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్)
• అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కార్డ్ జెఫర్‌పన్ (అమెరికన్ ఫిక్షన్ )
• ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జస్టిన్ ట్రైట్, అర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్)
• యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ది బాయ్ అండ్ ది హిరాన్
• కాస్ట్యూమ్ డిజైన్ : హోలి వెడ్డింగ్‌టన్ (పూర్ థింగ్స్)
• ప్రోడక్షన్ డిజైన్ : జేమ్స్ ప్రైస్, షోనా హెత్ (పూర్ థింగ్స్)
• ఇంటర్నేషనల్ ఫిల్మ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
• ఎడిటింగ్: జెన్నిఫర్ లేమ్ (ఆపెన్ హైమర్)
• విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ వన్
• డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్): ది లాస్ట్ రిపేర్ షాప్
• ఒరిజినల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఆపెన్ హైమర్
• సౌండ్ : ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
• ఒరిజినల్ సాంగ్: వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ)
• లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్.
రాబర్ట్ జూనియర్, డేవైన్ జో రాండాల్ఫ్, ఎమ్మా స్టోన్, సిలియన్ మర్ఫీ
ప్రముఖ భౌతిక శాస్త్ర నిపుణుడు, అణుబాంబు సృష్టికర్తగా పేరుగాంచిన జె. రాబర్ట్ ఆపెన్‌హైమర్ జీవితంతో రూపొందిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘ఆపెన్‌హైమర్’ మోత ఆస్కార్ వేదికపై బాగా వినిపించింది. దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలన్‌తో ఆస్కార్ అవార్డును ముద్దాడేలా చేసింది. మార్చి 10న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరిగిన 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఆపెన్‌హైమర్’ చిత్రం ఏడు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టి విజయఢంకా మోగించింది. మొత్తం పదమూడు నామినేషన్లు దక్కించుకున్న ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంతో పాటు దర్శకుడు, నటుడు, సహాయనటుడు, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో అవార్డు దక్కింది.
అలాగే పదకొండు నామినేషన్లు దక్కించుకున్న ‘పూర్ థింగ్స్’ సినిమాకు నాలుగు విభాగాల్లో, హిస్టారికల్ డ్రామా ‘జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ సినిమాకు రెండు విభాగాల్లో అవార్డులు దక్కాయి. ‘ఆపెన్‌హైమర్’కు పోటీగా నిలుస్తుందనుకున్న ‘బార్బీ’ సినిమాకు 8 నామినేషన్లు దక్కినా, ఒక్క అవార్డు (బెస్ట్ ఒరిజినల్ సాంగ్)తో సరిపెట్టుకుంది, పది నామినేషన్లు దక్కించుకున్న ‘కిల్లర్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్’ సినిమాకి ఒక్క అవార్డు కూడా దక్కకపోవడం చర్చనీయాంశమైంది. ఈ ఏడాది ఉత్తమ నటుడిగా నిలిచిన సిలియన్ మర్ఫీ, ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్, ఉత్తమ సహాయ నటి రాండాల్ఫ్ తొలిసారి ఆస్కార్‌ని ముద్దాడారు. గతంలో ‘లా లా ల్యాండ్’కి ఉత్తమ నటిగా ఆస్కార్ అందు కున్న ఎమ్మా స్టోన్ ఇప్పుడు ఇదే విభాగానికి అవార్డుని అందుకున్నారు. భారత సంతతికి చెందిన నిషా తెరకెక్కించిన ‘టు కిల్ ఎ టైగర్’ డాక్యుమెంటరీ ఆస్కార్ సాధించలేకపోయింది. ఇక అవార్డు విజేతల జాబితా ఈ విధంగా...
స్వీట్ సర్‌ప్రైజ్
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో చిత్ర సంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. 96వ అవార్డ్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ విజువల్స్ కనిపించాయి. వరల్డ్ గ్రేటెస్ట్ స్టంట్ సీక్వెన్స్ అంటూ ఆస్కార్ వేదికపై ప్రదర్శించిన విజువల్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌లు రెండుసార్లు కనిపించాయి. ‘టైటానిక్’, ‘మిషన్ ఇంపాజిబుల్’, ‘చార్లీ చాప్లిన్’, ‘బస్టర్ కీటన్’ వంటి హాలీవుడ్ క్లాసిక్ చిత్రాల యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని యాక్షన్ విజువల్స్ ప్లే కావడం విశేషం. అలాగే ఈ ఏడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ‘వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్?’ను విజేతగా ప్రకటించే ముందు ప్లే చేసిన కొన్ని సాంగ్స్ విజువల్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’ పాట కనిపించింది. ఈ సందర్భంగా.. ‘‘వరల్డ్ స్టంట్ సీక్వెన్స్‌లకు నివాళిగా ప్లే చేసిన కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ స్టంట్ సీక్వెన్స్‌లు ఉండటం స్వీట్ సర్‌ప్రైజ్‌లా ఉంది’’ అని ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ స్పందించింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య ‘ఆర్‌ఆర్‌ఆర్’ను నిర్మించారు.
నా కళ్లు చెబుతున్నాయి... – అల్ పచినో
మామూలుగా విజేతలను ప్రకటించే ముందు పోటీలో ఉన్నవారి పేర్లు చెప్పి, చివరిగా విజేత పేరు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రముఖ నటుడు 83 ఏళ్ల అల్ పచినో ఈ విధానాన్ని అనుసరించలేదు. ఈ ‘గాడ్ ఫాదర్’ మూవీ ఫేమ్ ఉత్తమ చిత్రాన్ని ప్రకటించడానికి వేదికపైకి వచ్చారు. ఈ విభాగంలో పది చిత్రాలు పోటీ పడ్డాయి. ఈ చిత్రాల పేర్లు చెప్పకుండా.. ‘ఇదిగో..’ అంటూ మెల్లిగా ఎన్వలప్ కవర్‌ని ఓపెన్ చేస్తూ.. నా కళ్లు చెబుతున్నాయి టైప్‌లో నా కళ్లకు ‘ఆపెన్‌హైమర్’ కనబడుతోంది అనగానే వీక్షకుల నుంచి కరతాళ ధ్వనులు వినిపించాయి. అయితే అల్ పచినో ఈ విధంగా ప్రకటించడంతో.. అవార్డు ఈ సినిమాకే వచ్చిందా? అనే సందేహంలో కొందరు ఉండిపోయారు. అంతలోనే ‘అవును.. అవును..’ అన్నారు. అయితే అల్ పచినో ఇలా ప్రకటించడం పట్ల పలువురు విమర్శించారు. ఆస్కార్ అవార్డుల జాబితాలో ప్రధానమైన విభాగంలో పోటీ పడిన చిత్రాల పేర్లు చెప్పకుండా, పైగా వేడుకలో చివరి అవార్డు కాబట్టి కాస్తయినా సస్పెన్స్ మెయిన్‌టైన్ చేయకుండా చెప్పడం బాగాలేదని అంటున్నారు. ఇలా సాదా సీదా ప్రకటనతో ఆస్కార్ అవార్డు వేడుక ముగిసింది.
నోలన్ కల నెరవేరెగా...
ఫిల్మ్ మేకర్ క్రిస్టోఫర్ నోలన్ ఆస్కార్ చరిత్ర కాస్త ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఎందుకంటే నోలన్ తీసిన సినిమాలు ఆస్కార్ అవార్డుల కోసం 49 నామినేషన్లు దక్కించుకుని, 18 అవార్డులను సాధించాయి. కానీ క్రిస్టోఫర్ నోలన్‌కు మాత్రం 95వ ఆస్కార్ అవార్డుల వరకూ ఒక్కటంటే ఒక్క అవార్డు కూడా రాలేదు. తొలిసారి 2002లో ‘మెమెంటో’ సినిమాకు గాను బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో 74వ ఆస్కార్ అవార్డ్స్‌లో నామినేషన్ దక్కించుకున్నారు నోలన్... నిరాశే ఎదురైంది. ఆ తర్వాత 83వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘ఇన్సెప్షన్’ సినిమాకు బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లో నామినేషన్లు దక్కినా అవార్డులు రాలేదు.
90వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్ విభాగాల్లో నోలన్ ‘డంకిర్క్’ సినిమాకు నామినేషన్లు దక్కినా ఆస్కార్ అవార్డు దక్కలేదు. చివరికి నోలన్ కల ‘ఆపెన్‌హైమర్’తో నెరవేరింది.
ఈ ప్రయాణంలో నేనూ భాగం అని... – క్రిస్టోఫర్ నోలన్
ఆస్కార్ వేదికపై క్రిస్టోఫర్ నోలన్ మాట్లాడుతూ – ‘‘మా సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మాట్‌లతో పాటు యూనిట్ అందరికీ ధన్యవాదాలు. ఇక మా కుటుంబాన్ని, ఈ సినిమాను నిర్మించిన మా నిర్మాత ఎమ్మా థామస్‌తో (భార్య ఎమ్మా పేరును ప్రస్తావించగానే ఒక్కసారిగా నవ్వులు) పాటు నా సోదరుడికి థ్యాంక్స్ చె΄్పాలి. మా సినిమాలో సత్తా ఉందని నమ్మి, డిస్ట్రిబ్యూట్ చేసిన యూనీవర్సల్ స్టూడియోస్‌కు ధన్యవాదాలు. సినిమా చరిత్ర వందేళ్లకు చేరువ అవుతోంది. ఈ అద్భుతమైన ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. కానీ ఈ ప్రయాణం తాలూకు సినిమాల్లో నేను కూడా ఓ అర్థవంతమైన భాగం అని భావించి, నన్ను గుర్తించిన ఆస్కార్ కమిటీకి ధన్యవాదాలు’’ అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.... భార్యాభర్త నోలన్, ఎమ్మా దర్శక–నిర్మాతలుగా ఒకేసారి ఆస్కార్ అవార్డులు సాధించారు.
అణుబాంబు విస్ఫోటనం నేపథ్యంలోని ‘ఆపెన్‌హైమర్’లో నటించి, అవార్డు దక్కించుకున్న మర్ఫీ తన అవార్డును ప్రపంచ శాంతి ఆకాంక్షించేవారికి అంకితమిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
జీవితంలో తనకు ఎంతో అండగా నిలిచిన తన భార్య సుసాన్ డౌన్‌కి అవార్డుని అంకితం ఇస్తున్నట్లుగా ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ తెలిపారు.
‘‘నేను నా జీవితంలో మరోలా (స్లిమ్‌గా) ఉండాలనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే... నేను నాలానే ఉండాలి’’ అంటూ ఎమోషనల్ అయ్యారు రాండాల్ఫ్
నేనీ సినిమా చేసి ఉండాల్సింది కాదు – ఎమ్ చెర్నోవ్
ఉక్రెయిన్ వార్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ‘20 డేస్ ఇన్ మరియోపోల్’ చిత్రం ఆస్కార్ అవార్డును సాధించింది. ఈ అవార్డు యాక్సెప్టెన్సీ స్పీచ్‌లో చిత్రదర్శకుడు ఎమ్ చెర్నోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉక్రెయిన్ చరిత్రలో ఇది తొలి ఆస్కార్ అవార్డు. ఇందుకు గౌరవంగా భావిస్తున్నాను. అయితే ఈ సినిమాను నేను చేసి ఉండకూడదని అనుకుంటున్నాను. బహుశా ఈ వేదికపై ఇలా మాట్లాడుతున్న తొలి దర్శకుడిని నేనేమో. మా ఉక్రెయిన్‌పై దాడులు చేయకుండా, మా నగరాలను ఆక్రమించకుండా ఉండేందుకు బదులుగా రష్యావారికి ఈ అవార్డు ఇస్తాను. నేను చరిత్రను, గతాన్ని మార్చలేను. కానీ కొందరు ప్రతిభావంతులతో కలిసి ఓ కొత్త రికార్డును సృష్టించగలం. అప్పుడు నిజం గెలుస్తుంది. జీవితాలను త్యాగం చేసిన మరియోపోల్ ప్రజలు గుర్తుండిపోతారు. సినిమా జ్ఞాపకాలను ఏర్పరుస్తుంది. జ్ఞాపకాలు చరిత్రను నెలకొల్పుతాయి’’ అంటూ భావోద్వేగంతో మాట్లాడారు చెర్నోవ్.
ఆమిర్ ‘పీకే’ని తలపించేలా జాన్ సెనా
ఆస్కార్ అవార్డు వేడుకలో జరిగిన ఓ ఘటన ఆమిర్ ఖాన్ నటించిన ‘పీకే’ సినిమాని గుర్తు చేసింది. ఈ చిత్రంలో ఆమిర్ ఓ సీన్లో తన శరీరానికి ముందు భాగంలో ఓ రేడియో అడ్డుపెట్టుకుని అర్ధనగ్నంగా నటించారు. ఆస్కార్ వేదికపై ఇలాంటి సీనే రిపీట్ అయింది. స్టార్ రెజ్లర్ (డబ్ల్యూడబ్ల్యూఈ) జాన్ సెనా అర్ధనగ్నంగా ప్రత్యక్షమై షాక్ ఇచ్చారు. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డును ప్రకటించేందుకు జాన్ సెనా ఇలా అర్ధనగ్నంగా రావడం చర్చనీయాంశంగా మారింది. తన శరీరానికి ముందు భాగంలో విజేత వివరాలు ఉండే ఎన్వలప్ కవర్‌ను మాత్రమే అడ్డుపెట్టుకొని వేదికపైకి రావడంతో సభికులందరూ తెగ నవ్వుకున్నారు. అయితే తాను ఇలా రావడానికి కారణం ఉందన్నారు జాన్ సెనా. ‘పురుషుడి శరీరం కూడా జోక్ కాదని, అలానే కాస్ట్యూమ్స్ అనేవి ముఖ్యం అని తెలియజెప్పేందుకే ఇలా వచ్చా’ అన్నారు సెనా. అనంతరం ‘పూర్ థింగ్స్’ సినిమాకి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో అవార్డును ప్రకటించారు.
1974 సీన్ రిపీట్
దాదాపు 50 ఏళ్ల క్రితం (1974) జరిగిన ఆస్కార్ వేడుకల్లో నటి ఎలిజబెత్ టేలర్‌ను పరిచయం చేస్తుండగా ఓ వ్యక్తి నగ్నంగా వేదికపైకి దూసుకు రావడం అప్పట్లో సంచలనమైంది. తాజాగా జాన్ సెనా ప్రవర్తనతో నాటి ఘటనను కొందరు గుర్తుకు తెచ్చుకున్నారు.
ఫేక్ క్లాప్‌తో శునకానందం
ఆస్కార్ వేడుకలో ఈ ఏడాది ఓ శునకం అందరి దృష్టినీ ఆకర్షించింది. సభికులతో పాటు క్లాప్స్ కొట్టిన ఈ శునకం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆస్కార్ కోసం పలు విభాగాల్లో పోటీ పడిన సినిమాల్లో ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’ ఒకటి. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో ఈ చిత్రం అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటించిన మెస్సీ (శునకం)ని అవార్డు వేడుకకు తీసుకొచ్చింది యూనిట్. ‘ఆపెన్ హైమర్’కి రాబర్డ్ డౌనీ జూనియర్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకుంటున్నప్పుడు అందరితో పాటు మెస్సీ చప్పట్లు కొట్టడం ఆకర్షణగా నిలిచింది. అయితే ఆ శునకం కూర్చున్న కుర్చీ కింద ఓ వ్యక్తి ఉండి, ఫేక్ చేతులతో క్లాప్ కొట్టాడు. అవి శునకం కాలిని పోలి ఉండటంతో మెస్సీయే చప్పట్లు కొట్టిందని భావించారంతా.
Comments
Please login to add a commentAdd a comment