ఆనందం.. ఉద్వేగం... | Vishnu Manchu on screening Kannappa teaser at Cannes 2024 | Sakshi
Sakshi News home page

ఆనందం.. ఉద్వేగం...

Published Wed, May 22 2024 12:44 AM | Last Updated on Wed, May 22 2024 12:44 AM

విష్ణు మంచు, ముఖేష్‌ కుమార్, మోహన్‌బాబు, ప్రభుదేవా

కాన్స్‌లో ‘కన్నప్ప’ టీజర్‌ ప్రదర్శన 

35 ఏళ్లుగా నిర్మాణంలో ‘హరిజన్‌: యాన్‌ అమెరికన్‌ సాగ’

30న హైదరాబాద్‌లో ‘కన్నప్ప’ టీజర్‌... శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. విష్ణు మంచు టైటిల్‌ రోల్‌లో ముఖేష్‌ కుమార్‌ దర్శకత్వంలో మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. కాన్స్‌ చిత్రోత్సవాల్లో ‘కన్నప్ప’ ప్రీమియర్‌ టీజర్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విష్ణు మంచు, మోహన్‌బాబు, ప్రభుదేవా పాల్గొన్నారు. ‘‘కన్నప్ప’ టీజర్‌ను కాన్స్‌లో చూపించాం. అందరూ ప్రశంసించారు. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్స్‌ కూడా ‘కన్నప్ప’ టీజర్‌ చూసి ముగ్దులయ్యారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో తెలుగు వెర్షన్‌ ‘కన్నప్ప’ టీజర్‌ను ప్రదర్శించనున్నాం. జూన్‌ 13న ఈ టీజర్‌ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేయనున్నాం’’ అంటూ ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు విష్ణు మంచు.

కాన్స్‌లో తొలిసారి... కాన్స్‌ చిత్రోత్సవాల్లో ప్రతిష్టాత్మక ‘పామ్‌ డి ఓర్‌’ అవార్డు సినీ పరిశ్ర మకు సుదీర్ఘకాలంగా సేవలు అందించినవారికి ఇస్తుంటారు. ఈ ఏడాది 77వ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోని ‘పామ్‌ డి ఓర్‌’ అవార్డుకు మెరిల్‌ స్ట్రీప్, జార్జ్‌ లూకాస్‌లను ఎంపిక చేశారు. కాగా కాన్స్‌ చరిత్రలోనే తొలిసారి ఓ స్టూడియోకు ఈ అవార్డు దక్కింది. జపాన్‌లోని యానిమేటెడ్‌ స్టూడియో ‘ఘిబ్లీ’కి ఫామ్‌ డి ఓర్‌ అవార్డును ప్రదానం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ స్టూడియో యానిమేషన్‌ రంగంలో ఉంది. ఇక హాలీవుడ్‌ నటి మెరిల్‌ స్ట్రీప్‌ ఆల్రెడీ ఈ అవార్డు స్వీకరించారు. హాలీవుడ్‌ దర్శక–నిర్మాత జార్జ్‌ లూకాస్‌ చిత్రోత్సవాల చివరి రోజున ఈ అవార్డు అందుకోనున్నారు.

కన్నీళ్లు పెట్టుకున్న కెవిన్‌... కెవిన్‌ కాస్ట్నర్‌ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘హరిజన్‌: యాన్‌ అమెరికన్‌ సాగ’. అమెరికన్‌ సివిల్‌ వార్‌కు ముందు ఉన్న పరిస్థితులు, వార్‌ తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మూడు చాప్టర్స్‌గా ఈ చిత్రం విడుదల కానుంది. తొలి చాప్టర్‌ ‘హరిజన్‌: యాన్‌ అమెరికన్‌ సాగ’ను కాన్స్‌ చిత్రోత్సవాల్లో ప్రీమియర్‌గా ప్రదర్శించగా, మంచి స్పందన లభించింది. దాదాపు పది నిమిషాల స్టాండింగ్‌ ఒవేషన్‌ దక్కడంతో కెవిన్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా నిర్మాణానికి 35 ఏళ్లుగా కెవిన్‌ కష్టపడుతున్నారని హాలీవుడ్‌ టాక్‌. 

ట్రంప్‌ బయోపిక్‌... అమెరికా మాజీ అధ్యక్షుడు, వ్యాపారవేత్త డోనాల్డ్‌ ట్రంప్‌ జీవితం ఆధారంగా ‘ది అప్రెంటిస్‌’ సినిమా తీశారు దర్శకుడు అలీ అబ్బాసి. ఈ సినిమాను తొలిసారిగా కాన్స్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించగా, స్టాండింగ్‌ ఒవేషన్‌ దక్కింది. సెబాస్టియన్‌ స్టాన్‌ ఈ చిత్రంలో డోనాల్డ్‌ ట్రంప్‌ పాత్రపోషించారు. ఫిల్మ్‌ మేకర్స్‌ పొలిటికల్‌ మూవీస్‌ మరిన్ని చేయాలని కాన్స్‌ వేదికగా అలీ అబ్బాసి పేర్కొన్నారు.  

శునకం సందడి...  లాటిటియా డెస్చ్‌ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘డాగ్‌ ఆన్‌ ట్రయిల్‌’. ఫ్రాన్స్‌లో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ కుక్క కొంతమందిని కరుస్తుంది. అప్పుడు ఆ శునకాన్ని ఓ లాయర్‌ ఏ విధంగా కోర్టు కేసు నుంచి రక్షించారు? అన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమాను కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. లాటిటియాతో పాటు ఈ సినిమాలో నటించిన శునకం చిత్రోత్సవాలకు హాజరైంది.

కాన్స్‌లో భారతీయం... కాన్స్‌లో ఈ ఏడాది మన దేశీ తారలు ఐశ్వర్యా రాయ్, ఊర్వశీ రౌతేలా, కియారా అద్వానీ, శోభితా ధూళిపాళ వంటి వారు సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదితీ రావ్‌ హైదరి ఈ చిత్రోత్సవాల్లో సందడి చేయడానికి ఫ్రాన్స్‌ వెళ్లారు. ఇక కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో దాదాపు 35 ఏళ్ల తర్వాత పామ్‌ డి ఓర్‌ విభాగంలో పోటికి భారతీయ చిత్రం ‘అల్‌ వీ  ఇమాజిన్‌ యాజ్‌ ఏ లైట్‌’ నిలిచిన సంగతి తెలిసిందే.

భారతీయ ఫిల్మ్‌ మేకర్‌ పాయల్‌ కపాడియా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం కపాడియా ఫ్రాన్స్‌లోనే ఉన్నారు. అలాగే ‘అన్‌ సర్టైన్‌ రిగార్డ్‌’ విభాగంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్‌ ఫిల్మ్‌మేకర్‌ సంధ్యా సూరి తీసిన ‘సంతోష్‌’ చిత్రం ఉంది. ఈ చిత్రంలో నటించిన సహానా గోస్వామి,సంజయ్‌ బిష్ణోయ్‌లతో పాటు సంధ్యా సూరి ఫ్రాన్స్‌ చేరుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement