ఆ ముగ్గురు మహిళలకు ధన్యవాదాలు: దర్శకురాలు పాయల్‌ కపాడియా | Payal Kapadia On Winning Grand Prix At Cannes | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురు మహిళలకు ధన్యవాదాలు: దర్శకురాలు పాయల్‌ కపాడియా

Published Mon, May 27 2024 12:12 AM | Last Updated on Mon, May 27 2024 12:13 AM

Payal Kapadia On Winning Grand Prix At Cannes

కాన్స్‌ చిత్రోత్సవాల్లో ‘తొలి’ రికార్డులతో సత్తా చాటిన భారత ఫిల్మ్‌ మేకర్స్‌ 

‘గ్రాండ్‌ ప్రిక్‌’ అవార్డుతో మెరిసిన భారత దర్శకురాలు పాయల్‌ కపాడియా 

కాన్స్‌ చిత్రోత్సవాల్లో భారతదేశం చరిత్రలో చెప్పుకునేలా సత్తా చాటింది. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘భారతీయ సినిమా’ కాన్స్‌లో మెరిసింది. తొలి గ్రాండ్‌ ప్రిక్స్‌ అవార్డును మన దేశ దర్శకురాలు పాయల్‌ కపాడియా తెచ్చారు. ప్రతిష్టాత్మక పియరీ ఏంజెనీ అవార్డును అందుకున్న తొలి ఏషియన్‌గా ఛాయాగ్రాహకుడు–దర్శక–నిర్మాత సంతోష్‌ శివన్‌ సగర్వంగా దేశానికి తిరిగొచ్చారు. ‘అన్‌సర్టైన్‌ రిగార్డ్‌’ విభాగంలో అనసూయ సేన్‌ గుప్తా ‘ది షేమ్‌లెస్‌’ చిత్రానికిగాను ఉత్తమ నటి అవార్డును దక్కించుకున్నారు.

ఇదే విభాగంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్‌ ఫిల్మ్‌ మేకర్‌ సంధ్యా సూరి దర్శకత్వంలో రూపొందిన ‘సంతోష్‌’ ప్రదర్శితమైంది. కానీ అవార్డు దక్కించుకోలేకపోయింది. ఇక చిదానంద ఎస్‌. నాయక్‌ దర్శకత్వం వహించిన కన్నడ లఘు చిత్రం ‘సన్‌ఫ్లవర్స్‌ వేర్‌ ది ఫస్ట్‌ వన్స్‌ టు నో’ ‘లా సినిఫ్‌’ విభాగంలో మొదటి బహుమతి పొందింది. అలాగే ‘బన్నీ హుడ్‌’ అనే మరో భారతీయ యానిమేటెడ్‌ మూవీ మూడో బహుమతి సాధించింది. ఇలా ఈసారి 77వ కాన్స్‌ చిత్రోత్సవాల్లో భారతదేశం హవా కనిపించింది. మే 14న ఆరంభమైన కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ముగిసింది. దర్శకురాలు పాయల్‌ కపాడియా అందుకున్న అవార్డు విశేషాలతో పాటు మరిన్ని విషయాలు ఈ విధంగా... కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భారతీయ చిత్రం ‘ఆల్‌ వీయ్‌ ఇమాజిన్‌ యాజ్‌ ఏ లైట్‌’ సినిమా సత్తా చాటింది.

గ్రాండ్‌ ప్రిక్‌ విభాగంలో అవార్డు సాధించింది. కాన్స్‌ చిత్రోత్సవాల్లోని ఈ ప్రధాన విభాగంలో అవార్డు సాధించిన తొలి భారతీయ చిత్రంగా ‘ఆల్‌ వీయ్‌ ఇమాజిన్‌ యాజ్‌ ఏ లైట్‌’ చరిత్ర సృష్టించింది. కాగా ఈ ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మక విభాగమైన పామ్‌ డి ఓర్‌ అవార్డుకు కూడా ‘ఆల్‌ వీయ్‌ ఇమాజిన్‌ యాజ్‌ ఏ లైట్‌’ చిత్రం పోటీలో నిలిచినప్పటికీ, అవార్డును అందుకోలేకపోయింది. అయితే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ విభాగంలో ‘ఆల్‌ వీయ్‌ ఇమాజిన్‌ యాజ్‌ ఏ లైట్‌’ రూపంలో ఓ భారతీయ చిత్రం పోటీలో నిలవడం ప్రశంసించదగ్గ విషయం. ఇక పామ్‌ డి ఓర్‌ విభాగంలో దాదాపు ఇరవై సినిమాలను వెనక్కి నెట్టి, సీన్‌ బేకర్‌ దర్శకత్వం వహించిన కామెడీ డ్రామా ‘అనోరా’ అవార్డును ఎగరేసుకుపోయింది.

‘గ్రాండ్‌ టూర్‌’ సినిమాకు గాను మిగ్యుల్‌ గోమ్స్‌ ఉత్తమ దర్శకుడిగా, ‘కైండ్స్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌’ సినిమాలోని నటనకు గాను జెస్సీ ప్లేమోన్స్‌ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. క్రైమ్‌ కామెడీ ఫిల్మ్‌ ‘ఎమిలియా పరేజ్‌’లో నటించిన అడ్రియానా పాజ్, కర్లా సోఫియా, సెలెనా గోమేజ్, జో సల్దానాలు ఉత్తమ నటీమణులుగా నిలిచారు. జాక్వెస్‌ డియార్డ్‌ నటించిన ఈ సినిమాకే జ్యూరీ ప్రైజ్‌ దక్కడం విశేషం. చిత్రోత్సవాల తొలి రోజు హాలీవుడ్‌ నటి మెరిల్‌ స్ట్రీప్, ఆ తర్వాత జపాన్‌కు చెందిన యానిమేషన్‌ స్టూడియో ‘స్టూడియో ఘిబ్లి’ ప్రతిష్టాత్మక పామ్‌ డి ఓర్‌ అవార్డు అందుకోగా చివరి రోజు హాలీవుడ్‌ దర్శక–నిర్మాత జార్జ్‌ లూకాస్‌ స్వీకరించారు.

‘‘నిజానికి స్క్రిప్ట్‌ రాసేటప్పుడు కంగారుపడ్డాను. ఆ కంగారులో ఏదో రాశాను (నవ్వుతూ). మా సినిమాని ఇక్కడ వరకూ తీసుకొచ్చిన ‘కాన్స్‌’కి థ్యాంక్స్‌. దయచేసి మరో భారతీయ చిత్రం కోసం 30 ఏళ్లు వేచి ఉండొద్దు’’ అని అవార్డు అందుకున్న అనంతరం పాయల్‌ కపాడియా అన్నారు. వేదిక మీద ఉన్న ఈ మూవీలో నటించిన కనీ కస్రుతి, దివ్య ప్రభ, చాయా కదమ్‌లను ఆత్మీయంగా హత్తుకుని, ‘‘తమ సొంత సినిమాలా భావించి చేసిన ఈ ముగ్గురు మహిళలకు ధన్యవాదాలు’’ అన్నారు.

ఇంకా ఈ చిత్ర నిర్మాతలు, భాగస్వాములు, ఇతర యూనిట్‌ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అది మాత్రమే కాదు... ఈ ఏడాది కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ తొలి రోజు ఫెస్టివల్‌ వర్కర్లు మెరుగైన వేతనాలు డిమాండ్‌ చేస్తూ చేసిన నిరసనకు మద్దతు తెలిపారు. పాయల్‌ మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ – ‘‘నేను తీసిన ఈ సినిమా ముగ్గురి మహిళల స్నేహం నేపథ్యంలో ఉంటుంది. అయితే మహిళలు ఎక్కువగా ఒకరికొకరు గోతులు తీసుకుంటారు.

సమాజం అలానే చిత్రీకరించింది. అది దురదృష్టకరం. కానీ స్నేహం అనేది నాకు ముఖ్యమైన బంధం. ఎందుకంటే అది గొప్పతనానికి దారి తీస్తుంది. కలుపుగోలుతనాన్ని పెంచుతుంది. ఈ విలువలను కాపాడుకోవడానికి మనం ప్రయత్నిస్తుండాలి’’ అన్నారు. ఆమె అవార్డు తీసుకురావడం పట్ల భారత ప్రధాని మోదీ, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశారు.

పాయల్‌ కపాడియా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్‌ ఫిల్మ్‌ ‘ఆల్‌ వీయ్‌ ఇమాజిన్‌ యాజ్‌ ఏ లైట్‌’. కని కస్రుతి, దివ్య ప్రభ, చాయా కదమ్‌ లీడ్‌ రోల్స్‌లో ఈ సినిమాను థామస్‌ హకీమ్, జూలియన్‌ గ్రాఫ్‌ నిర్మించారు.  కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ నెల 23న ఈ చిత్రం ప్రదర్శితమైంది. కాగా పాయల్‌ కపాడియా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్‌ ఫిల్మ్‌కే కాన్స్‌లోని ఓ ప్రధాన విభాగమైన గ్రాండ్‌ ప్రిక్‌ అవార్డు రావడం విశేషం.

అయితే కాన్స్‌లో పాయల్‌ ప్రతిభ మెరవడం ఇదే తొలిసారి కాదు. 2021లో జరిగిన కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాయల్‌ కపాడియా దర్శకత్వం వహించిన ‘ఏ నైట్‌ ఆఫ్‌ నోయింగ్‌ నథింగ్‌’ బెస్ట్‌ డాక్యుమెంటరీగా నిలిచింది. ఆ ఏడాది గోల్డెన్‌ ఐ అవార్డు పాయల్‌కు దక్కింది. అలాగే 2017లో జరిగిన కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాయల్‌ కపాడియా దర్శకత్వం వహించిన షార్ట్‌ ఫిల్మ్‌ ‘ఆఫ్టర్‌ నూన్‌ క్లౌడ్‌’  ప్రదర్శితమైంది. 

‘ఆల్‌ వీయ్‌ ఇమాజిన్‌ యాజ్‌ ఏ లైట్‌’ కథ ఏంటంటే... కేరళ నుంచి ముంబైకి వెళ్లి నర్సులుగా పని చేస్తుంటారు ప్రభ (కని కస్రుతి), అను (దివ్య ప్రభ). భర్తతో విడిపోయిన ప్రభకు ఓ గిఫ్ట్‌ వస్తుంది. ఆ గిఫ్ట్‌ను ఆమె భర్త పంపిస్తాడు. దీంతో ప్రభకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు అను తన రిలేషన్‌షిప్‌లో ఇబ్బందులకు లోనవుతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరూ రోడ్‌ ట్రిప్‌కు వెళితే ఏం జరిగింది? అన్నదే కథ. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement