గోవా: భారత్ వృద్ధి బాటలో భాగస్వామ్యం కావాలని ప్రపంచ పెట్టుబడిదారులను భారత్ ఆహ్వనిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. వచ్చే 5 నుండి 6 సంవత్సరాలలో భారతదేశం ఇంధన రంగంలో 67 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇండియా ఎనర్జీ వీక్.. రెండవ ఎడిషన్‌ను ఇక్కడ ప్రారంభించిన ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత్ ఎకానమీ 7.5%కన్నా అధిక వృద్ధి రేటుతో పురోగమిస్తోందన్నారు.
అమెరికా (25.5 ట్రిలియన్ డాలర్లు) చైనా (18 ట్రిలియన్ డాలర్లు), జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)ల తర్వాత దాదాపు 3.8 ట్రిలియన్ డాలర్లతో ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, త్వరలో మూడో స్థానానికి చేరడం ఖాయమని మోదీ ఉద్ఘాటించారు. ఇదే విషయాన్ని పలు సంస్థలూ స్పష్టం చేస్తున్నాయని ప్రధాని అన్నారు. 2030 నాటికి దేశం తన రిఫైనింగ్ సామర్థ్యాన్ని 254 ఎంఎంటీపీఏ (సంవత్సరానికి మిలియన్ మెట్రిక్ టన్నులు) నుండి 450 ఎంఎంటీపీఏకి పెంచుతుందని భావిస్తున్నామని ఆయన పేర్కొంటూ... ఈ నేపథ్యంలో భారతదేశ ఇంధన రంగ వృద్ధిలో పాలుపంచుకోవాలని ప్రపంచ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. ఇంధన రంగంలో మునుపెన్నడూ జరగని విధంగా భారతదేశం భారీ పెట్టుబడులు పెడుతోందని ప్రధాని అన్నారు. 2045 నాటికి దేశ ప్రాథమిక ఇంధన డిమాండ్ రెట్టింపు అవుతుందని కూడా ఆయన చెప్పారు.
ముడిచమురు, ఎల్‌పీజీల్లో మూడో స్థానం...
ముడిచమురు, ఎల్‌పీజీ వినియోగం విషయంలో భారత్ మూడవ అతిపెద్ద దేశంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. ఎల్‌ఎన్‌జీ విషయంలో నాల్గవ అతిపెద్ద దిగుమతిదారుగా భారతదేశం ఉందని మోదీ అన్నారు. గత రెండేళ్లలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయని పేర్కొన్న ఆయన, ప్రపంచ సవాళ్ల నేపథ్యంలో దేశం ఇంధన నిర్వహణ వ్యూహాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ సంస్కరణలు దేశీయ సహజ వాయువు ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతున్నాయని మోదీ తెలిపారు.
చమురు, గ్యాస్ రంగంలో ఇన్వెస్ట్ చేయండి
► గ్లోబల్ దిగ్గజ సంస్థల సీఈవోలతో ప్రధాని భేటీ
చమురు, గ్యాస్ రంగంలో ప్రత్యేకించి అన్వేషణ, ఉత్పత్తిలో పెట్టుబడులకు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ ఈ రంగంలో ప్రముఖ ఎగ్జిక్యూటివ్‌లకు విజ్ఞప్తి చేశారు. ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా ఎక్సాన్‌మొబిల్, బీపీల నుండి ఖతార్ ఎనర్జీ, ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ ఎనర్జీస్ వరకు దాదాపు 20 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో మోదీ సమావేశమయినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.
ఈ సమావేశానికి హాజరైన భారతీయ సీఈఓలలో వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్‌తో పాటు రిలయన్స్ అధికారులు ఉన్నారు. దేశంలో చమురు, గ్యాస్ వనరులను కనుగొని, ఉత్పత్తి చేయడంలో పెట్టుబడులు పెట్టేందుకుగాను ప్రపంచ దిగ్గజ సంస్థలను ఆహ్వానించేందుకు ఇటీవల ప్రారంభించిన ‘ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్సింగ్ రౌండ్’ విధానాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా, రానున్న మూడేళ్లలో చమురు, గ్యాస్ ఉత్పత్తిని రోజుకు 300,000 బ్యారెళ్లకు రెట్టింపు చేయడానికి 4 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడికి తమ సంస్థ యోచిస్తున్నట్లు ఈ సందర్భంగా అనిల్ అగర్వాల్ తెలిపారు.
ఖతార్‌తో ఎల్‌ఎన్‌జీ డీల్ పొడిగింపు
► 20 ఏళ్లకు 78 బిలియన్ డాలర్ల డీల్
►ఏటా 6 బిలియన్ డాలర్ల ఆదా
బెతుల్ (గోవా): ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) దిగుమతులకు సంబంధించిన డీల్‌ను మరో 20 ఏళ్ల పాటు పొడిగిస్తూ ఖతార్‌ఎనర్జీతో దేశీ దిగ్గజం పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ 78 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. ఈ డీల్ 2048 వరకు అమల్లో ఉంటుంది. ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీ కొనుగోలు కోసం ఖతార్‌ఎనర్జీతో ఒప్పందాన్ని పొడిగించుకున్నట్లు పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యుత్, ఎరువుల ఉత్పత్తి కోసం ఈ గ్యాస్ ఉపయోగపడనున్నట్లు పేర్కొంది. ప్రస్తుత రేట్ల కన్నా తక్కువ ధరకే ఎల్‌ఎన్‌జీని ఖతార్ సరఫరా చేయనుండటంతో భారత్‌కు ఏటా 6 బిలియన్ డాలర్లు ఆదా కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇప్పుడున్న ధరలతో పోలిస్తే కొత్త ఒప్పందం ప్రకారం యూనిట్‌కు (ఎంబీటీయూ) భారత్‌కి 0.8 డాలర్ల మేర మిగులుతుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 80 డాలర్లుగా ఉండగా ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీ దిగుమతుల బిల్లు 3.9 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలనే భారత్ లక్ష్యానికి ఈ కాంట్రాక్టు తోడ్పడగలదని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి తెలిపారు. భారత ఎకానమీ వృద్ధిలో తాము కూడా భాగంగా ఉండాలని ఆశిస్తున్నట్లు ఖతార్ ఇంధన శాఖ మంత్రి, ఖతార్‌ఎనర్జీ సీఈవో సాద్ అల్–కాబి తెలిపారు. ఎల్‌ఎన్‌జీ సరఫరా కోసం ఆ్రస్టేలియా, అమెరికా, రష్యాతో కూడా భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంది.
ప్రస్తుతం ఏటా 8.5 ఎంటీపీఏ దిగుమతి..
ఖతార్‌ఎనర్జీ నుంచి పెట్రోనెట్ రెండు కాంట్రాక్టుల కింద ఏటా 8.5 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) ఎల్‌ఎన్‌జీ దిగుమతి చేసుకుంటోంది. వాటిలో 25 ఏళ్లకు సంబంధించిన 2024లో కుదుర్చుకున్న ఒక ఒప్పందం 2028తో ముగిసిపోనుంది. దీన్నే పెట్రోనెట్ తాజాగా పొడిగించింది. భారత ఎల్‌ఎన్‌జీ దిగుమతుల్లో ఖతార్ ఎనర్జీతో పెట్రోనెట్ ఒప్పందం వాటా దాదాపు 35%గా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment