హెచ్‌పీసీఎల్‌ లాభం డౌన్‌ | HPCL net down 36percent to Rs 1,795 crore | Sakshi
Sakshi News home page

హెచ్‌పీసీఎల్‌ లాభం డౌన్‌

Published Thu, Aug 5 2021 1:46 AM | Last Updated on Thu, Aug 5 2021 1:46 AM

HPCL net down 36percent to Rs 1,795 crore - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి క్వార్టర్‌లో ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(హెచ్‌పీసీఎల్‌) నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో నికర లాభం 36 శాతం క్షీణించి రూ. 1,795 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,184 కోట్లు ఆర్జించింది. మొత్తం టర్నోవర్‌ మాత్రం 68 శాతం జంప్‌చేసి రూ. 77,586 కోట్లను తాకింది. కాగా.. సామర్థ్య విస్తరణ, ఆధునీకరణ నేపథ్యంలో ముంబై రిఫైనరీ 45 రోజులపాటు పనిచేయలేదని కంపెనీ చైర్మన్, ఎండీ ముకేష్‌ కుమార్‌ సురానా పేర్కొన్నారు. దీంతో చమురు శుద్ధి కార్యక్రమాలు 3.97 మిలియన్‌ టన్నుల నుంచి తగ్గి 2.51 ఎంటీకి పరిమితమైనట్లు వెల్లడించారు. ముంబై రిఫైనరీని 25 శాతమే వినియోగించుకోగా.. వైజాగ్‌ యూనిట్‌ 98 శాతం సామర్థ్యంతోనే పనిచేసినట్లు తెలియజేశారు.  

మార్జిన్లు భేష్‌...
క్యూ1లో హెచ్‌పీసీఎల్‌ స్థూల రిఫైనింగ్‌ మార్జిన్లు(జీఆర్‌ఎం) బ్యారల్‌కు 3.31 డాలర్లకు ఎగశాయి. గత క్యూ1లో ఇవి కేవలం 0.04 డాలర్లుగా నమోదయ్యాయి. కాగా.. అమ్మకాల పరిమాణం 7.62 మిలియన్‌ టన్నుల నుంచి 16 శాతం ఎగసి 8.83 ఎంటీకి చేరింది. ఈ కాలంలో పెట్రోల్‌ విక్రయాలు 37 శాతం, డీజిల్‌ 22 శాతం, ఏటీఎఫ్‌ 119 శాతం చొప్పున వృద్ధి చూపాయి. విస్తరణ తదుపరి ముంబై రిఫైనరీ సామర్థ్యం 7.5 ఎంటీ నుంచి 9.5 ఎంటీకి పెరిగినట్లు సురానా తెలియజేశారు. ప్రధాన పట్టణాలలోని పెట్రోల్‌ పంప్‌ల వద్ద ఈవీ చార్జింగ్‌కు వీలుగా టాటా పవర్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రస్తావించారు. క్యూ1లో కంపెనీ 142 రిటైల్‌ ఔట్‌లెట్లను కొత్తగా ప్రారంభించింది. అదనంగా 50 సీఎన్‌జీ ఔట్‌లెట్ల ఏర్పాటుతో వీటి సంఖ్య 724కు చేరింది.  
ఫలితాల నేపథ్యంలో హెచ్‌పీసీఎల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.65 శాతం నష్టంతో రూ. 273 వద్ద ముగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement