Hindustan Petroleum Corporation Limited (HPCL)
-
ఇతర సంస్థల నుంచి డీజిల్ కొనుగోళ్ల నిలిపివేత
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి కంపెనీల నుంచి డీజిల్ కొనుగోళ్లను వచ్చే ఏడాది నుంచి నిలిపివేయాలని ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) భావిస్తోంది. వైజాగ్ రిఫైనరీ విస్తరణ పనులు పూర్తయి, వచ్చే ఆర్థిక సంవత్సరం రాజస్థాన్‌లో కొత్త రిఫైనరీని నిర్మించిన తర్వాత నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు ఇన్వెస్టర్లతో సమావేశంలో సంస్థ వెల్లడించింది. వైజాగ్ రిఫైనరీ ప్రస్తుత వార్షిక సామర్ధ్యం 13.7 మిలియన్ టన్నులుగా ఉండగా విస్తరణ పనులు పూర్తయితే 15 మిలియన్ టన్నులకు పెరుగుతుందని కంపెనీ చైర్మన్ పుష్ప్ కుమార్ జోషి చెప్పారు. రాజస్థాన్ రిఫైనరీ 72 శాతం పూర్తయ్యిందని, వచ్చే ఏడాది దశలవారీగా వినియోగంలోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాము విక్రయించే పెట్రోల్‌లో 43 శాతం, డీజిల్‌లో 47 శాతం ఇంధనాలను ముంబై, వైజాగ్ రిఫైనరీలు సమకూరుస్తున్నాయి. వైజాగ్ రిఫైనరీ విస్తరణ పనులు పూర్తయ్యాక డీజిల్ విక్రయాల్లో హెచ్‌పీసీఎల్ సొంత రిఫైనరీల వాటా 61 శాతానికి పెరుగుతుంది. రాజస్థాన్ రిఫైనరీ కూడా అందుబాటులోకి వస్తే మొత్తం డీజిల్‌ను హెచ్‌పీసీఎల్ సొంతంగానే ఉత్పత్తి చేసుకోగలుగుతుంది. దేశీయంగా మొత్తం పెట్రోల్ బంకుల్లో దాదాపు పావు శాతం బంకులు హెచ్‌పీసీఎల్‌వే ఉన్నాయి. అయితే, వాటిలో విక్రయ అవసరాలకు తగినంత స్థాయిలో సొంతంగా పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి చేసుకోలేకపోతుండటంతో ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. హెచ్‌పీసీఎల్ ఇప్పటికే తమ ముంబై రిఫైనరీ సామరŠాధ్యన్ని 7.5 మిలియన్ టన్నుల నుంచి 9.5 మిలియన్ టన్నులకు విస్తరించింది. -
హెచ్‌పీసీఎల్ లాభం క్షీణత
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం భారీగా క్షీణించి రూ. 172 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 869 కోట్లు ఆర్జించింది. అయితే అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరించకపోవడంతో వరుసగా రెండు త్రైమాసికాలలో నష్టాలు నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. చమురు ధరలు క్షీణించడంతో తిరిగి మూడో క్వార్టర్లో నష్టాలను పూడ్చుకునేందుకు వీలు చిక్కినట్లు తెలియజేసింది. ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం రూ. 1.03 లక్షల కోట్ల నుంచి రూ. 1.15 లక్షల కోట్లకు ఎగసింది. ఈ కాలంలో ఒక క్వార్టర్‌కు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 4.83 మిలియన్ టన్నుల(ఎంటీ) ముడిచమురును ప్రాసెస్ చేసింది. గత క్యూ3లో ఇది 4.24 ఎంటీగా నమోదైంది. అమ్మకాల పరిమాణం 7 శాతం పుంజుకుని 11.25 ఎంటీకి చేరింది. ఒక్కో బ్యారల్ చమురుపై స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 11.4 డాలర్లకు ఎగశాయి. గత క్యూ3లో ఇవి 4.5 డాలర్లు మాత్రమే. విశాఖ రిఫైనరీ నవీకరణ ప్రాజెక్టు చివరి దశకు చేరుకున్నట్లు కంపెనీ పేర్కొంది. దీనిలో భాగంగా 8.3 ఎంటీ రిఫైనింగ్ సామర్థ్యాన్ని 15 ఎంటీకి విస్తరిస్తున్న విషయం విదితమే. 5 ఎంటీ ఎల్ఎన్జీ టెర్మినల్ సైతం పూర్తికావస్తున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌పీసీఎల్ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 232 వద్ద ముగిసింది. -
హెచ్‌పీసీఎల్ డివిడెండ్ రూ. 14
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 40 శాతం రూ. 1,795 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం(2020–21) ఇదే కాలంలో రూ. 3,018 కోట్లు ఆర్జించింది. క్యూ4లో స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) 12.44 డాలర్లకు బలపడినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ పుష్ప కుమార్ జోషి పేర్కొన్నారు. 2021 క్యూ4లో 8.11 డాలర్ల జీఆర్ఎం మాత్రమే లభించింది. అయితే చౌకగా కొనుగోలు చేసిన నిల్వల లాభాలను మినహాయిస్తే ఒక్కో బ్యారల్ చమురు శుద్ధిపై 6.42 డాలర్ల మార్జిన్లు సాధించినట్లు జోషి వెల్లడించారు. కాగా.. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ అమ్మకపు నష్టాలు మార్జిన్ల లాభాలను దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. చమురు ధరలు 14ఏళ్ల గరిష్టానికి చేరినప్పటికీ మార్చి 22 నుంచి మాత్రమే వీటి ధరలను పెంచడం ప్రభావం చూపినట్లు వివరించారు. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 14 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 3.72 లక్షల కోట్ల ఆదాయం, రూ. 6,383 కోట్ల నికర లాభం సాధించినట్లు జోషి తెలియజేశారు. 2020–21లో హెచ్‌పీసీఎల్ రూ. 2.69 లక్షల కోట్ల టర్నోవర్ సాధించగా.. రూ. 10,664 కోట్ల నికర లాభం ఆర్జించింది. క్యూ4లో దేశీయంగా 10.26 మిలియన్ టన్నులను విక్రయించగా.. అంతక్రితం 3.83 ఎంటీ అమ్మకాలు నమోదయ్యాయి. వెరసి 4 శాతం వృద్ధి సాధించింది. ఇక పూర్తి ఏడాదిలో 6 శాతం అధికంగా 37.65 ఎంటీ అమ్మకాలు నమోదయ్యాయి. ఇదే కాలంలో ఎల్పీజీ అమ్మకాలు 4.4 శాతం పుంజుకుని 7.7 ఎంటీకి చేరాయి. ఫలితాల నేపథ్యంలో హెచ్‌పీసీఎల్ షేరు ఎన్ఎస్ఈలో 1.5% నీరసించి రూ. 240 వద్ద ముగిసింది. -
రష్యా చమురు రేసులో దేశీ సంస్థలు
న్యూఢిల్లీ: భారీ డిస్కౌంటుతో లభిస్తున్న రష్యా ముడి చమురును కొనుగోలు చేసేందుకు దేశీ రిఫైనరీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మూడు మిలియన్ బ్యారెళ్లు కొనుగోలు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) బాటలోనే తాజాగా హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) రెండు మిలియన్ బ్యారెళ్లు తీసుకుంది. యూరప్‌కు చెందిన ట్రేడరు విటోల్ ద్వారా రష్యన్ ఉరల్స్ క్రూడాయిల్‌ను హెచ్‌పీసీఎల్ కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ (ఎంఆర్‌పీఎల్) కూడా అదే తరహాలో ఒక మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ కోసం టెండర్లు ఆహ్వానించింది. ఉక్రెయిన్ మీద దాడుల కారణం గా రష్యాపై పాశ్చాత్య దేశాలు భారీగా ఆంక్షలు విధించడంతో ఆ దేశం ఉత్పత్తి చేసే ముడి చమురు భారీ డిస్కౌంటుకు లభిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, చమురును చౌకగా దక్కించుకునేందుకు భారత రిఫైనింగ్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మే నెలలో డెలివరీ కోసం బ్యారెల్‌కు 20–25 డాలర్ల డిస్కౌంటుతో ఐవోసీ గత వారమే మూడు మిలియన్ బ్యారెళ్లను విటోల్ సంస్థ ద్వారా కొనుగోలు చేసింది. అమెరికాలో భారీగా కార్యకలాపాలు ఉన్నందున, రష్యాపై ఆంక్షల ప్రభావం తమపై కూడా పడే అవకాశం ఉండటంతో ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం రష్యన్ క్రూడాయిల్‌కు దూరం గా ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. డాలర్లలో సెటిల్మెంట్.. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థాపరంగా ఇంకా ఆంక్షలేమీ విధించనందున.. రష్యాతో వాణిజ్య లావాదేవీలకు భారత రిఫైనర్లు డాలర్ల మారకంలోనే సెటిల్మెంట్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వివాదాస్పద అణ్వాయుధాల తయారీ కారణంగా ఇరాన్‌పై విధించినట్లుగా రష్యా చమురుపై నిషేధం ఏదీ ప్రస్తుతం లేదు. ఫలితంగా ఏ దేశమైనా లేదా కంపెనీ అయినా రష్యా చమురు లేదా ఇతర ఇంధన కమోడిటీలను కొనుగోలు చే సేందుకు, అంతర్జాతీయ పేమెంట్ సిస్టమ్స్ ద్వారా చెల్లింపులు జరిపేందుకు వెసులుబాటు ఉంటోంది. 2020 నుంచే ఒప్పందాలు.. దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తి అంతంత మాత్రమే కావడంతో.. భారత్ తన అవసరాలకు సంబంధించి 85% క్రూడ్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఎక్కువ వాటా మధ్యప్రాచ్య దేశాలదే. అయితే వాటిపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో రష్యా, అమెరికా తదితర దేశాల నుంచి కూడా భారత్ సరఫరా పెంచుకుంటోంది. సౌదీ అరేబియా తర్వాత ప్రపంచంలో చమురు ఎగుమతులపరంగా రష్యా రెండో స్థానంలో ఉంది. యూరప్‌లోని పలు దేశాలు తమ ఇంధన అవసరాల కోసం రష్యాపైనే ఆధారపడుతున్నాయి. కానీ, రష్యా నుండి భారత్ కొనుగోలు చేస్తున్నది చాలా తక్కువే. 2021లో కేవలం 45,000 బ్యారెళ్లు మాత్రమే దిగుమతి చేసుకుంది. రవాణా రేట్లు భారీగా ఉండటమే ఇందుకు కారణం. వాస్తవానికి.. దాదాపు 2 మిలియన్ టన్నుల ముడిచమురును కొనుగోలు చేసేందుకు రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్ ఆయిల్ కంపెనీతో 2020 ఫిబ్రవరిలోనే ఐవోసీ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో చమురుకు డిమాండ్ 8% అప్ ఈ ఏడాది 5.15 మిలియన్ బీపీడీకి చేరొచ్చని ఒపెక్ అంచనా న్యూఢిల్లీ: మహమ్మారి ప్రభావాల నుండి ఎకానమీ నెమ్మదిగా పుంజుకుంటున్న నేపథ్యంలో దేశీయంగా ఈ ఏడాది చమురుకు డిమాండ్ 8.2 శాతం మేర పెరగనుంది. రోజుకు 5.15 మిలియన్ బ్యారెళ్లకు (బీపీడీ) చేరనుంది. ఆయిల్ మార్కెట్ నివేదికలో పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి ఒపెక్ ఈ విషయాలు వెల్లడించింది. భారత్‌లో 2020లో చమురు డిమాండ్ రోజుకు 4.51 మిలియన్ బ్యారెళ్లుగా (బీపీడీ) ఉండగా.. 2021లో 5.61 శాతం పెరిగి 4.76 మిలియన్ బీపీడీకి చేరింది. కరోనా పూర్వం 2018లో ఆయిల్ డిమాండ్ 4.98 మిలియన్ బీపీడీగా, 2019లో 4.99 మిలియన్ బీపీడీగా నమోదైంది. ‘2022లో ఆర్థిక వృద్ధి పటిష్టంగా 7.2 శాతం స్థాయిలో ఉంటుందన్న అంచనాలకు తోడు సమీప భవిష్యత్తులో ఒమిక్రాన్‌ను వేగంగా కట్టడి చేసే అవకాశాలు ఉన్నందున ఆయిల్‌కు డిమాండ్ మెరుగుపడవచ్చని భావిస్తున్నాం‘ అని ఒపెక్ నివేదిక పేర్కొంది. డీజిల్, నాఫ్తాకు పరిశ్రమల తోడ్పాటు.. కోవిడ్–19 కట్టడిపరమైన ఆంక్షలను సడలించడంతో దేశీయంగా ప్రయాణాలు, రవాణా కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. పారిశ్రామిక రంగం మెరుగుపడుతుండటంతో డీజిల్, ఎల్పీజీ, నాఫ్తాకు డిమాండ్ పెరగగలదని నివేదిక వివరించింది. -
హెచ్‌పీసీఎల్ జాబిలమ్మలు...
ఏదీ తనంతట తాను దరిచేరదు, ప్రయత్న పూర్వకంగా సాధిస్తేనే విజయం సొంతమవుతుంది అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు అక్షర సత్యమని నిరూపించారీ యువతులు. పెట్రోల్ ఉత్పత్తి కర్మాగారంలో రాత్రిపూట విధులు నిర్వహిస్తున్నారీ మహిళలు. సంస్థ పురోగతిలో మేము సైతం అని ముందడుగు వేశారు విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పిసిఎల్) సంస్థ ఉద్యోగినులు. హెచ్‌పిసిఎల్ సంస్థ పనివేళలు... ఉదయం 8 నుంచి 4.30 గంటల వరకు జనరల్ షిఫ్ట్, సాయంత్రం 4.30 నుంచి రాత్రి 12 గంటల వరకు సాయంత్రం షిఫ్ట్, అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అర్ధరాత్రి షిఫ్ట్లుంటాయి. మోటార్ స్పిరిట్ (పెట్రోల్)ను తయారు చేసే విభాగంలో ఇంజనీరింగ్ చదివి సుశిక్షితులైన 15 మంది విధులను నిర్వహిస్తున్నారు. కంట్రోల్ రూమ్ విభాగంలో క్షణక్షణం అప్రమత్తులై కన్నార్పకుండా పరిశీలించడంతోపాటు, అత్యవసర సమయాలలో ప్లాంట్‌లో సమస్యలను గుర్తించడం, వాటిని సరిచేయడం, సరఫరా వ్యవస్థను నిరాఘాటంగా నడపడం వీరి విధులు. ప్రతి షిఫ్ట్‌లో ముగ్గురు మహిళలు విధులు నిర్వర్తిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి రొటీన్ సజావుగా సాగుతోంది. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ మహిళలకు రాత్రి విధులు అప్పగించడానికి ముందు... వారి భద్రత గురించి చాలా కసరత్తు జరిగింది. సాయంత్ర షిఫ్ట్, అర్ధరాత్రి షిఫ్ట్‌కు హాజరయ్యే మహిళలకు క్యాబ్ సదుపాయంతోపాటు సెక్యూరిటీ గార్డులుగా కూడా మహిళలనే నియమించారు. నైట్ షిఫ్ట్ ఉద్యోగినులకు మార్షల్ ఆర్ట్స్(ఆత్మరక్షణ)లో ప్రాథమిక తర్ఫీదు ఇచ్చారు. మహిళలు డ్యూటీకి రావడానికి ఇంటి నుంచి బయలు దేరిన సమయం నుంచి హిందుస్థాన్ పెట్రోలియం ప్లాంట్‌కు చేరే వరకు, విధులు ముగించుకుని తిరిగి ఇంటికి చేరుకునే వరకు వారు ప్రయాణించే వాహనం గమనాన్ని పరిశీలించే జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ క్షణంలో స్పందించాలి పరిశ్రమలో పనిచేయడం ఎంతో సంక్లిష్టమైన విషయం. ప్రమాదాలు సంభవించినప్పుడు సకాలంలో స్పందించాలి. ఆ క్షణంలో మేము తీసుకున్న నిర్ణయంతోపాటు అమలు చేసే విధానం కూడా వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి కూడా ఆపరేషన్స్ విభాగంలో పనిచేయడం ఎంతో అవసరం. ఇది మా ప్రగతికి దోహదం చేస్తుంది. – ఎం. నవ్య, హెచ్‌పిసిఎల్ ఉద్యోగిని, ఐఐటి, ఖర్గపూర్ పూర్వ విద్యార్థి ఇది మంచి ప్రయత్నం గతంలో సేల్స్‌లో విధులు నిర్వర్తించాను. ఫిబ్రవరిలో ఎంఎస్ బ్లాక్ విధుల్లోకి వచ్చాను. మహిళలు నైట్‌షిఫ్ట్‌లలో పనిచేస్తున్న విషయం ఇంట్లో చెప్పి వారిని ఒప్పించాను. సాహసోపేతమైన నిర్ణయంలో నేను కూడా భాగం కావడం సంతోషంగా ఉంది. – వై. చందన, హెచ్‌పిసిఎల్ ఉద్యోగిని, ఎన్ఐటి వరంగల్ పూర్వ విద్యార్థి సవాళ్ల ఉద్యోగం మేము ఎంచుకున్న రంగం ఎన్నో సవాళ్లతో కూడినదనే విషయం మాకు విద్యార్థిగా ఉన్నపుడే అర్థమైంది. మానసికంగా ముందుగానే సన్నద్ధం అయి ఉండడంతో విధి నిర్వహణ మాకు పెద్దగా కష్టం అనిపించలేదు. ప్లాంట్‌లో సమస్య రావడం, గ్యాస్ లీకవడం వంటివి జరుగుతుంటాయి. వీటిని డిటెక్టర్లతో వెంటనే గుర్తించి ప్రమాదాలను నివారించడం పెద్ద సవాలే. కానీ టాస్క్ మొత్తాన్ని మా చేతులతో పూర్తి చేసిన తర్వాత కలిగే సంతోషం కూడా అంతే పెద్దది. – ఆర్. సత్య శిరీష, హెచ్‌పిసిఎల్ ఉద్యోగిని, ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని సంస్థ నిర్ణయం ధైర్యాన్నిచ్చింది నైట్ షిఫ్ట్ కోసం మా సంస్థ ఏర్పరచిన ప్రత్యేక రక్షణ సదుపాయాలు బాగున్నాయి. కంట్రోల్ రూమ్‌లో ప్లాంట్ పనితీరును నిరంతరం పర్యవేక్షించడం, డిస్ట్రిబ్యూషన్ కంట్రోల్ సిస్టమ్‌ను నిర్వహించడంలో అందరం మహిళలం అయిన కారణంగా ఎటువంటి సమస్యలూ ఎదురవలేదు. విధినిర్వహణలో ఆపరేటర్లను, ఇతర సిబ్బందిని అప్రమత్తం చేయడం, తగిన సూచనలు అందించడం మా విధి. కొన్ని సందర్భాలలో అత్యవసరంగా షట్ డౌన్ చేయాల్సి వస్తుంది కూడా. కీలకమైన విధులను కూడా విజయవంతంగా చేయగలుగుతున్నామనే తృప్తి ఉంది. – సిప్రా ప్రియదర్శిని, హెచ్‌పిసిఎల్ ఉద్యోగిని, ఎన్ఐటి రూర్కెలా పూర్వ విద్యార్థిని నైట్ షిఫ్టే బెటర్ నైట్ షిఫ్ట్‌లో విధులు నిర్వహించడం వలన పగలు తగినంత అదనపు సమయం లభిస్తోంది. వ్యక్తిగత పనులు చేసుకోవడానికి ఉపయుక్తంగా ఉంది. జనరల్ షిఫ్ట్ కంటే నైట్ షిఫ్టే బాగుంది. – శిఖ, హెచ్‌పిసిఎల్ ఉద్యోగిని, జాదాపూర్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని రోజుకో కొత్త పాఠం ఇక్కడికి ప్యానల్ ఆఫీసర్ గా వచ్చాను. నైట్ షిఫ్ట్ కొత్తలో కొంత సవాలుగా అనిపించింది. మెల్లగా అలవాటైంది. మా ఉద్యోగం ఎలాంటిదంటే... విధి నిర్వహణలో ప్రతి రోజూ ఒక కొత్త సవాల్ ఎదురవుతుంటుంది. ఒక్కో అనుభవం నుంచి ఒక్కో పాఠం నేర్చుకుంటాం. – సింఘ్ ఇషిత్ రాజ్, హెచ్‌పిసిఎల్ ఉద్యోగిని, ఐఐటి, ముంబయి పూర్వ విద్యార్థిని స్ఫూర్తిదాయకం.... విధుల్లో చేరిన నాటి నుంచి ఈ మహిళల నిబద్ధత, పనిలో చూపుతున్న ప్రగతి స్ఫూర్తిదాయకంగా ఉంది. చక్కగా సమన్వయం చేసుకుంటూ విధులను సమర్థంగా నిర్వహిస్తున్నారు. మా నమ్మకాన్ని రెట్టింపు చేసారు. మేము ఈ స్ఫూర్తిని కొనసాగిస్తాం. భవిష్యత్తులో రిఫైనరీలో మరింత ఎక్కువమంది మహిళలు పనిచేయడానికి అవకాశాలు కల్పిస్తాం. – వి.రతన్ రాజ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హెచ్‌పిసిఎల్, విశాఖ రిఫైనరీ – వేదుల నరసింహం, సాక్షి, విశాఖపట్నం ఫోటోలు: ఎం.డి నవాజ్, విశాఖపట్నం -
హెచ్‌పీసీఎల్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి క్వార్టర్లో ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 36 శాతం క్షీణించి రూ. 1,795 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,184 కోట్లు ఆర్జించింది. మొత్తం టర్నోవర్ మాత్రం 68 శాతం జంప్‌చేసి రూ. 77,586 కోట్లను తాకింది. కాగా.. సామర్థ్య విస్తరణ, ఆధునీకరణ నేపథ్యంలో ముంబై రిఫైనరీ 45 రోజులపాటు పనిచేయలేదని కంపెనీ చైర్మన్, ఎండీ ముకేష్ కుమార్ సురానా పేర్కొన్నారు. దీంతో చమురు శుద్ధి కార్యక్రమాలు 3.97 మిలియన్ టన్నుల నుంచి తగ్గి 2.51 ఎంటీకి పరిమితమైనట్లు వెల్లడించారు. ముంబై రిఫైనరీని 25 శాతమే వినియోగించుకోగా.. వైజాగ్ యూనిట్ 98 శాతం సామర్థ్యంతోనే పనిచేసినట్లు తెలియజేశారు. మార్జిన్లు భేష్... క్యూ1లో హెచ్‌పీసీఎల్ స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) బ్యారల్‌కు 3.31 డాలర్లకు ఎగశాయి. గత క్యూ1లో ఇవి కేవలం 0.04 డాలర్లుగా నమోదయ్యాయి. కాగా.. అమ్మకాల పరిమాణం 7.62 మిలియన్ టన్నుల నుంచి 16 శాతం ఎగసి 8.83 ఎంటీకి చేరింది. ఈ కాలంలో పెట్రోల్ విక్రయాలు 37 శాతం, డీజిల్ 22 శాతం, ఏటీఎఫ్ 119 శాతం చొప్పున వృద్ధి చూపాయి. విస్తరణ తదుపరి ముంబై రిఫైనరీ సామర్థ్యం 7.5 ఎంటీ నుంచి 9.5 ఎంటీకి పెరిగినట్లు సురానా తెలియజేశారు. ప్రధాన పట్టణాలలోని పెట్రోల్ పంప్‌ల వద్ద ఈవీ చార్జింగ్కు వీలుగా టాటా పవర్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రస్తావించారు. క్యూ1లో కంపెనీ 142 రిటైల్ ఔట్లెట్లను కొత్తగా ప్రారంభించింది. అదనంగా 50 సీఎన్జీ ఔట్లెట్ల ఏర్పాటుతో వీటి సంఖ్య 724కు చేరింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌పీసీఎల్ షేరు ఎన్ఎస్ఈలో 0.65 శాతం నష్టంతో రూ. 273 వద్ద ముగిసింది. -
హెచ్‌పీసీఎల్ లాభం 157 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) నికర లాభం 157 శాతం ఎగిసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 2,253 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఇది రూ. 877 కోట్లు. రిఫైనరీల సామర్థ్యాన్ని గణనీయంగా వినియోగించుకోవడం, పరిశ్రమతో పోలిస్తే మరింత మెరుగైన పనితీరు కనపర్చడం వల్ల కరోనా వైరస్‌పరమైన సవాళ్లు ఉన్నప్పటికీ సానుకూల ఫలితాలు సాధించగలిగినట్లు హెచ్‌పీసీఎల్ సీఎండీ ముకేశ్ కుమార్ సురానా తెలిపారు. క్యూ1లో అమ్మకాలు రూ. 45,945 కోట్లకు క్షీణించినప్పటికీ నికర లాభాలు పెరగడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అమ్మకాలు రూ. 74,596 కోట్లు. లాక్డౌన్ కారణంగా ఏప్రిల్‌లో పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలు భారీగా పడిపోయాయని, అయితే క్రమంగా ఆంక్షల సడలింపుతో మళ్లీ పుంజుకుంటున్నాయని సురానా చెప్పారు. -
హెచ్‌పీసీఎల్ బాధితుల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు
నగరంలోని హెచ్‌పీసీఎల్ సంస్థకు చెందిన రిఫైనరీలో నిన్న సాయంత్రం చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ శనివారం సందర్శించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆ సంస్థ ఉన్నతాధికారులనడిగి తెలుసుకున్నారు. హెచ్‌పీసీఎల్ ప్రమాద ఘటన వివరాలకు సంబంధించి విశాఖపట్నంలోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఆ ప్రమాద ఘటనలో మరణించిన, గాయపడిన వారి వివరాల కోసం ఈ ఫోన్ నెంబర్180042500002 ఫోన్ చేయాలని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన మృతుల సంఖ్య శనివారం ఉదయానికి నాలుగుకు చేరింది. అయితే ఆ ప్రమాదంలో గాయపడి నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 36 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.